Talliki Vandanam Scheme 2025: నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అమలు చేయనున్నట్లు..

అమరావతి, జూన్ 12: ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లను నేడు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నారు. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనుంది.
వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అర్హులైన విద్యార్థుల్లో ఒకవేళ ఎవరికైనా జాబితాలో పేరు లేకపోతే.. అటువంటి వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాగా ఇప్పటికే ఎన్నికల హామీల్లో పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకుల ఖాతాల్లో గురువారం (జూన్ 12) నేరుగా నిధులు జమ చేయనుంది.
మరోవైపు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సుపరిపాలన – తొలి అడుగు’ పేరుతో లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పోరంకి లోని మురళి రిసార్ట్స్ లో గురువారం సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభంకానుంది. వర్షం కారణంగా సచివాలయం సమీప ప్రాంతం నుండి మురళి రిసార్ట్‌కు సభ ప్రాంగణాన్ని మార్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ,ఇతర మంత్రులు ఎంఎల్ఏ, ఎంఎల్‌సి, ఎంపీలు హాజరుకానున్నారు. ఏడాది పాలన లో ప్రభుత్వం సాధించిన ప్రగతి పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.