APPSC Group 1 Interviews 2025: మరోవారంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు.. 1:2 నిష్పత్తిలో మెరిట్‌లిస్ట్
రాష్ట్ర గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుపుతామని..

అమరావతి, జూన్ 12: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి రాజబాబు వెల్లడించారు. రెండు బోర్డుల ద్వారా ఇంటర్వ్యూలు జరగుతాయన్నారు. వీలైతే మరో బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ నిర్వహణ తేదీల షెడ్యూలను త్వరలోనే ఏపీపీఎస్సీ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే రోజునే అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ క్యాటగిరీలో ఎంపికైన 42 మంది అభ్యర్థులకు జూన్ 17న ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని కమిషన్ కార్యదర్శి తెలిపారు. కాగా మే 3 నుంచి 9వ తేదీ వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఆఫ్‌లైన్ విధానంలో 4,497 మంది అభ్యర్ధులకు జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం పట్టణాల్లోని మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏరోజుకారోజు పరీక్షలు ముగిసిన వెంటనే గ్రూప్ 1 జవాబు పత్రాలను విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరవేశారు.
మరోవైపు పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఎప్పటికప్పుడు జవాబుపత్రాల మూల్యాంకనం కూడా చేశారు. దీంతో పరీక్షలు ముగిసిన కేవలం నెల రోజుల్లోనే మొత్తం ప్రక్రియను ముగించారు. ఒక్కో జవాబు పత్రాన్నీ ఇద్దరు చొప్పున సీసీ కెమెరాల నిఘాలో మూల్యాంకనం చేశారు. ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2023 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తుది దశ అయిన ఇంటర్యూ అనంతరం అభ్యర్ధుల మార్కులతో కూడిన మెరిట్ లిస్ట్‌ను కమిషన్ విడుదల చేస్తుంది. అనంతరం నియామక పత్రాలు అందజేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.