Indian Railways: ఆక్సిజన్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న భారత రైల్వే శాఖ.. ఇప్పటి వరకు ఎంత ఆక్సిజన్ సరఫరా చేశాయంటే..!
Oxygen Transport: కరోనా రెండో వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఒక వైపు పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరోవైపు ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో రైల్వే శాఖ రంగంలోకి దిగింది...
Indian Railways: కరోనా రెండో వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఒక వైపు పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరోవైపు ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో రైల్వే శాఖ రంగంలోకి దిగింది. ఆక్సిజన్ కొరతను నివారించడానికి రకరకాల మార్గాలను అన్వేషించాయి. విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడం. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా రైల్వే వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ పంపిణీ చేయడం చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను నివారించగలిగారు. ఆక్సిజన్ సరఫరాలో రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు, భారత రైల్వే దాదాపు 775 ట్యాంకర్లలో 12630 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
దాదాపు 200 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఎంతో మేలు చేశాయి. ప్రతి రోజు 800 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓలను పంపిణీ చేస్తున్నాయి. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి 13 రాష్ట్రాలకు చేరుకుంది. ఇప్పటి వరకు మహారాష్ట్రకు 521 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, యూపీకి దాదాపు 3189 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 521 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 1549 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 772 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 641 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 584 మెట్రిక్ టన్నులు, ఏపీకి 292 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 111 మెట్రిక్ టన్నులు, కేరళకు 118 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 3915 మెట్రిక్ టన్నులకుపైగా ఆక్సిజన్‌ను ఇండియన్ రైల్వే ద్వారా అందుకున్నాయి.