డ్యాన్స్ పార్టీకి అనుమతించనందుకు రెస్టారెంట్ పై 100 మంది వైద్య విద్యార్థుల దాడి..ఎక్కడంటే..?
డ్యాన్స్ పార్టీకి తమను అనుమతించనందుకు రాజస్థాన్ లోని అజ్మీర్ లో గల ఓ రెస్టారెంటుపై వంద మంది వైద్య విద్యార్థులు దాడి చేశారు.
డ్యాన్స్ పార్టీకి తమను అనుమతించనందుకు రాజస్థాన్ లోని అజ్మీర్ లో గల ఓ రెస్టారెంటుపై వంద మంది వైద్య విద్యార్థులు దాడి చేశారు. మొదట సుమారు 15 మంది విద్యార్థులు వచ్చి ఈ రెస్టారెంట్ లోని డ్యాన్స్ ఫ్లోర్ లో డ్యాన్స్ చేయడానికి అనుమతించాలని యాజమాన్యాన్ని కోరినట్టు తెలిసింది..అయితే కోవిడ్ దృష్ట్యా ఇందుకు అనుమతించలేమని అక్కడి సిబ్బందిలో ఒకరు చెప్పడంతో అతడ్ని వారు దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకున్నట్టు తెలిసింది. మీ సంగతి చూస్తామంటూ అప్పటికి వెళ్ళిపోయి.. రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో మళ్ళీ తమతో బాటు సుమారు వంద మందిని వెంటబెట్టుకుని వచ్చి రెస్టారెంట్ పై దాడికి దిగారని తెలియ వచ్చింది. రాడ్లు, కర్రలతో వారు రెస్టారెంట్ లోని కిటికీల అద్దాలను పగులగొట్టినట్టు సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి. వీరు సుమారు 150 మంది వరకు ఉండవచ్చునని యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఈ రెస్టారెంట్ వద్ద తాత్కాలికంగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
అసలు విద్యార్థులు అందులోనూ వైద్య విద్యార్థులు ఇలా వచ్చి దాడులు చేస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంట్ యజమాని, స్థానిక కౌన్సిలర్ అన్నారు. భవిష్యత్తులో ఈ విధమైన సంఘటనలు జరగకుండా చూస్తామని పోలీసులు చెప్పారు. దాడికి పాల్పడిన విద్యార్థుల్లో కొందరిని అరెస్టు చేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. అక్కడే మరి కొన్ని రెస్టారెంట్లు ఉండడంతో వాటి యజమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా ఉండే అజ్మీర్ లో ఈ విధమైన ఘటనలు ఎన్నడూ జరగలేదంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Rare Disease: అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పిల్లలు.. ఇలాంటి కష్టం పగొళ్లకు కూడా రావొద్దు..!