AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025 ముగుస్తోంది.. మీ జీవితంలో ఈ ఏడాది ఏం సాధించారు? సెల్ఫ్ చెకప్ చేసుకోండిలా!

కాలం ఎవరి కోసమూ ఆగదు. అది కొందరికి రెప్పపాటులో గడిచిపోయినట్లు అనిపిస్తే, మరికొందరికి మాత్రం అస్సలు గడవని మొండిఘటంలా తోస్తుంది. అంతా మన మానసిక స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో కాలం గమనంలో తేడాలు ఉండేవేమో కానీ, ఇప్పుడు మాత్రం అందరికీ కాలం ఒకేలా ..

2025 ముగుస్తోంది.. మీ జీవితంలో ఈ ఏడాది ఏం సాధించారు? సెల్ఫ్ చెకప్ చేసుకోండిలా!
Yearendaudit
Nikhil
|

Updated on: Dec 22, 2025 | 8:30 AM

Share

కాలం ఎవరి కోసమూ ఆగదు. అది కొందరికి రెప్పపాటులో గడిచిపోయినట్లు అనిపిస్తే, మరికొందరికి మాత్రం అస్సలు గడవని మొండిఘటంలా తోస్తుంది. అంతా మన మానసిక స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో కాలం గమనంలో తేడాలు ఉండేవేమో కానీ, ఇప్పుడు మాత్రం అందరికీ కాలం ఒకేలా పరుగు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం మన చేతుల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అలా రీల్స్ చూస్తూ ఉంటే.. డిసెంబర్ రావడం మాత్రమే కాదు, దశాబ్దాలే కరిగిపోతాయి. మరి ఈ 2025 ఏడాదిలో మీరు నిర్మాణాత్మకంగా ఏం చేశారు? గతేడాది వేసుకున్న ప్రణాళికలు ఎంతవరకు అమలు చేశారు? గాల్లో లెక్కలు వేయకుండా ఒక తెల్ల కాగితంపై మీ పేరు రాసి ‘హైలైట్స్ 2025’ అని హెడ్డింగ్ పెట్టి అసలు లెక్క తేల్చండి.

కుటుంబం, ఆర్థికం..

ముందుగా కుటుంబం గురించి ఆలోచించండి. ఈ ఏడాది మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయించగలిగారు? వారి కోరికలు ఏంటో కనీసం విన్నారా? ఇంటి పెద్దల ఆరోగ్యం కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఎంత సమయం వెచ్చించారో పేపర్ మీద పెట్టండి. ఆర్థిక విషయాలకొస్తే.. గతేడాది కంటే ఈ ఏడాది మీ ఆదాయ మార్గాలు పెరిగాయా? పొదుపు ఎంత చేశారు? కనీసం కొద్దిగా అయినా బంగారం కొని దాచగలిగారా? అనవసర ఖర్చులు ఎక్కడ జరిగాయో గుర్తిస్తేనే వచ్చే ఏడాది ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

వ్యక్తిగత ఆరోగ్యం, స్నేహం..

మిమ్మల్ని మీరు ఎంతవరకు పట్టించుకున్నారో ఒకసారి సరిచూసుకోండి. వ్యాయామం, సరైన ఆహారం, బరువు అదుపు వంటి విషయాల్లో మీ మార్కులు ఎన్నో వేసుకోండి. పెండింగ్‌లో ఉన్న పంటి లేదా కంటి పరీక్షలు చేయించుకున్నారా? రాబోయే ఏడాది మీ ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఏడాది మీరు చేసిన నిర్లక్ష్యాన్ని పేపర్ మీద రాసుకోవాల్సిందే. అలాగే స్నేహితుల విషయంలో కూడా ఒక స్పష్టత ఉండాలి. మీకు ఉపయోగపడే మంచి స్నేహితులను కాపాడుకుంటూనే, మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేసే ‘టాక్సిక్’ స్నేహాలను వదులుకోవడం చాలా ముఖ్యం. స్నేహంలో మీరు సాధించిన మార్కులు ఎన్నో లెక్కించుకోండి.

మనిషి మెదడు ఒక సూపర్ కంప్యూటర్. దానికి కొత్త విషయాలు నేర్పించినప్పుడే అది చురుగ్గా ఉంటుంది. ఈ ఏడాది మీరు చదివిన మంచి పుస్తకాలు ఎన్ని? ప్రపంచ పరిణామాల గురించి ఏమైనా తెలుసుకున్నారా? మేధోపరంగా మీరు ఎంత ఎదిగారో రాసుకోండి. ఇక జీవితాన్ని రసాత్మకంగా మార్చేవి కళలు. సంగీతం, సాహిత్యం, మంచి సినిమాలు.. వీటికి మీరు ఎంత సమయం ఇచ్చారు? మీకు నచ్చిన వారితో ఎంత సమయం గడిపారు? కేవలం తిని పడుకోవడం మాత్రమే కాకుండా, కళలతో జీవితాన్ని ఎంత అందంగా మార్చుకున్నారో బేరీజు వేసుకోండి.

కాలం చాలా విలువైనది. కాలానికి విలువనిచ్చిన వారే ఉన్నతమైన జీవితాలను నిర్మించుకోగలరు. ఈ 2025 ఏడాదిలో మీ తప్పులు, ఒప్పులు ఈ కాగితం మీద రాసుకుంటేనే, కొత్త సంవత్సరానికి (2026) మీరు పూర్తి అప్రమత్తతతో సిద్ధం కాగలరు. పనికిమాలిన విషయాలకు స్వస్తి చెప్పి, విలువైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!