AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Traditions: మిక్సీ పచ్చడిలో దొరకని మధురిమ.. రోటి పచ్చళ్లకే ఎందుకింత రుచో తెలుసా?

రుచి, ఆరోగ్యం పేరుతో ప్రజలు ఆధునిక పద్ధతులకు అలవాటుపడ్డారు. కానీ, ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. కొత్త తరం యువత రోటి పచ్చడిపై మక్కువ చూపుతోంది. నానమ్మ, అమ్మమ్మల చేతి పచ్చళ్ళ రుచిని మళ్లీ రుచి చూడాలని ఆరాటపడుతున్నారు. ఈ కోరికతోనే రోటి పచ్చళ్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. పాతకాలపు వంటల రుచి, సంప్రదాయ పద్ధతులలో తయారయ్యే ఆహారంపై ఆసక్తి ఈ కొత్త తరంలో పెరుగుతోంది. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, మన మూలాలను, రుచిని మళ్లీ వెతుక్కోవడం.

Indian Traditions: మిక్సీ పచ్చడిలో దొరకని మధురిమ.. రోటి పచ్చళ్లకే ఎందుకింత రుచో తెలుసా?
Roti Pachadi Taste Vs Mixi Grinder
Bhavani
|

Updated on: Aug 21, 2025 | 7:15 PM

Share

రోలు, రోకలి… ఒకప్పుడు ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా కనిపించే వస్తువులు. ఇప్పుడు అలంకరణ వస్తువులుగా మారాయి. కారణం మిక్సీ గ్రైండర్లు. వేగం, సౌలభ్యం పేరుతో వాటి స్థానంలో మిక్సీలు చేరాయి. అయితే, రోటిలో చేసిన పచ్చడి రుచి మిక్సీ పచ్చడికి ఉండదనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఈ తేడాకు కారణాలు చాలానే ఉన్నాయి.

రోటిలో పచ్చడి నూరుతున్నప్పుడు పదార్థాలు పూర్తిగా పేస్ట్‌లా మారకుండా కాస్త పలుకులుగా ఉంటాయి. ఈ పలుకులు పంటి కింద పడితే వచ్చే అనుభూతి అద్భుతం. అలాగే, ఈ ప్రక్రియలో పదార్థాలలోని నూనెలు, సువాసనలు సహజంగా బయటకు వస్తాయి. ఉదాహరణకు, వేయించిన పల్లీలు, పచ్చి మిరపకాయలు, అల్లం వంటివి రోటిలో నూరినప్పుడు వాటి అసలు రుచి, వాసన పచ్చడికి పడతాయి. ఫలితంగా పచ్చడి మధురంగా, కమ్మగా తయారవుతుంది.

ఇక, మిక్సీలో గ్రైండ్ చేస్తే బ్లేడ్‌ల వేగం వల్ల వేడి పుడుతుంది. ఈ వేడి పచ్చడిలోని సున్నితమైన రుచులను, సువాసనలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా, పదార్థాలు పూర్తిగా మెత్తని పేస్ట్‌లా మారడంతో పచ్చడిలో అసలు ముక్కలే తగలవు. అంతేకాకుండా, మిక్సీ పచ్చడి చేసే క్రమంలో పదార్థాల సహజ గుణాలు, పోషకాలు కొంతమేర తగ్గుతాయి.

రోటి పచ్చడి ఒక కళ లాంటిది. రోకలితో నెమ్మదిగా నూరుతూ పచ్చడి చేసే క్రమంలో ఆ పదార్థాలలోని రుచి మనసుకి కూడా అంతుతుంది. ఈ పచ్చడిలో కేవలం రుచి మాత్రమే కాదు, చేసే వారి శ్రమ, ప్రేమ కూడా కలిసి ఉంటాయి. అందుకే, రోటి పచ్చడికి ఆ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ రుచి మిక్సీ పచ్చడిలో దొరకదు.