True Happiness: ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
Secret of Happiness: ఆనందం కోసం మనిషి నిత్యం పరితపిస్తుంటాడు. ధనం, పదవులు, వస్తువులు, విలాసాలు, సంబంధాల్లో ఆనందం, సంతోషం ఉందన్న భ్రమలో జీవిస్తాడు. చివరికి అక్కడ అత్యంత విలువైన ఆనందం లేదని తెలుసుకుంటాడు. అయితే నిజానికి ఆనందం ఎక్కడ దాగి ఉందో..? మనసుకు హత్తుకునేలా తెలిపే చిట్టి కథ ఇది. అసలైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలంటే ఈ చిట్టి కథను చదివేయండి.

ఆనందం కోసం మనిషి చేసే అన్వేషణ ఎప్పటికీ ముగియదు. కొందరు ధనం, మరికొందరు అధికార పదవి, ఇంకొందరు సంబంధాల్లో ఆనందాన్ని వెతుకుతుంటారు. కొందరు విలాసాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటే.. మరికొందరు తాత్కాలికమైన సంబంధాల్లోనే సంతోషం దాగి ఉందని సంతృప్టి చెందుతారు. అయితే నిజమైన ఆనందం ఎక్కడ ఉందో తెలిపే ఓ ఆధ్యాత్మిక కథ ప్రచారంలో ఉంది. ఆ చిట్టి కథను ఇప్పుడు చూద్దాం.
చిట్టి కథ
చాలా కాలం క్రితం దేవుడు మానవులను సృష్టించిన తర్వాత ఒక ఆలోచనలో పడ్డాడట. మానవుడికి అపారమైన తెలివితేటలు, సామర్థ్యాలు ఉన్నందున అతను ఏదైనా సాధించగలడని దేవుడు గ్రహించాడు. అందుకే మనిషి జీవితంలో అత్యంత విలువైన ఆనందాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచాలని నిర్ణయించుకున్నాడట.
ఈ విషయంపై దేవుడు తన దూతలతో సమావేశం నిర్వహించి.. మనిషి కోరుకునే ఆనందాన్ని ఎక్కడ దాచాలన్న అంశంపై వారి సలహాలు సూచనలు కోరాడు. ఒక దూత ఆనందాన్ని ఎత్తైన పర్వత శిఖరంపై దాచాలని సూచించాడు. అయితే దేవుడు “మనిషి ఒకరోజు ఎంతటి ఎత్తైన పర్వతాన్ని అయినా అధిరోహిస్తాడు” అని చెప్పాడట. మరో దూత సముద్ర గర్భంలో దాచమన్నాడు. దానికి దేవుడు “సముద్రాల లోతుల్లోకీ మానవుడు చేరుకుంటాడు” అని సమాధానమిచ్చాడు. ఇంకొక దూత దాన్ని దూర గ్రహాల్లో దాచమన్నా, “అంతరిక్షాన్ని కూడా మానవుడు జయిస్తాడు” అని దేవుడు వారి సలహాలు తిరస్కరించాడు.
చివరికి దేవుడే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆనందాన్ని మనిషి ఎప్పుడూ వెతకని చోట, అతనికే అత్యంత దగ్గరగా ఉన్న చోట దాచాలి. అది అతని మనసులోనే అని నిర్ణయించుకున్నాడు.
అప్పటి నుంచి మనిషి ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతుకుతూనే ఉన్నాడు. కానీ నిజమైన సంతోషం తన ఆలోచనలు, తన అంతరాత్మలోనే ఉందనే విషయాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు.
గొప్ప సందేశం
ప్రతి మనిషి కోరుకునే ఆనందం అనేది ధనం, వస్తువులు లేదా బాహ్య పరిస్థితుల వల్ల లభించేది కాదు. మనసు ప్రశాంతంగా ఉండి, ఉన్నదానితో సంతృప్తి చెందగలిగితేనే నిజమైన ఆనందాన్ని అనుభవించగలం. సంతోషం కోసం ప్రపంచాన్ని వెతకడం కంటే, మనలోకి మనం తొంగిచూడటం నేర్చుకోవడమే జీవితంలోని గొప్ప జ్ఞానం.
ఇది కూడా చదవండి.. మూడు చిలుకలు కథ.. కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది




