రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే మేఘాలయలోని మాసిన్‌రామ్ గ్రామం తన ప్రత్యేక జీవనశైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏడాదంతా వర్షాలు కురిసినా అక్కడి ప్రజలు గొడుగులు వాడరు. బలమైన గాలుల కారణంగా వెదురు, ఆకులతో తయారుచేసిన ‘నాప్’ అనే సంప్రదాయ రక్షణ కవచాన్ని ఉపయోగిస్తారు. ప్రకృతితో సామరస్యంగా జీవిస్తూ పర్యావరణహిత జీవన విధానానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదంటే అందరూ చటుక్కున చెప్పే పేరు ‘మాసిన్‌రామ్’. మేఘాలయలోని ఈ కుగ్రామం గురించి వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ ఏడాదంతా వర్షమే! అనుక్షణం ఇక్కడ వాన చినుకులు ఎప్పుడూ భూమిని ముద్దాడుతూనే ఉంటాయి. అయితే, ఏడాదంతా వర్షం కురిస్తున్నప్పటికీ అక్కడి జనం మాత్రం గొడుగులే వాడరు. అదే ఇక్కడి ప్రత్యేకత. మౌసిన్‌రామ్ గ్రామం నిజంగానే ఒక ప్రకృతి అద్భుతమనే చెప్పాలి. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉన్న ఈ చిన్న పట్టణం, భూమిపై అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతంగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. సుందరమైన పచ్చదనం, నిరంతరం కురిసే వర్షాలు, మబ్బుల అందాలు, పొగమంచుతో నిండిన లోయలు, జాలువారే జలపాతాలు, విశిష్టమైన సున్నపురాయి గుహలు ఈ ప్రాంత ప్రత్యేకతలు. అయితే, మౌసిన్‌రామ్‌లో ప్రజలు గొడుగులు వాడరు. ఎందుకంటే, అక్కడ వర్షంతో పాటు బలమైన గాలులు రోజంతా వీస్తూనే ఉంటాయి. ఒకవేళ మనం గొడుగు వేసుకుందామని.. దానిని విప్పేలోపే అవి గాలికి తలకిందులై, విరిగిపోతాయి. అందుకే అక్కడివారు ‘నాప్’ అనే ఓ రక్షణ కవచాన్ని వాడుతారు. అలాగే ఆ గ్రామంలో ప్లాస్టిక్ కూడా వాడకపోవడం మరో విశేషం. ‘నాప్’ అనేది ఒక సంప్రదాయ వాన రక్షక కవచం. ఇది చూడటానికి అచ్చం తాబేలుపై ఉండే చిప్పలా కనిపిస్తుంది. స్థానిక ఖాసీ తెగ ప్రజలు వెదురు, అడవి ఆకులతో ఎంతో నైపుణ్యంగా దీనిని తయారు చేస్తారు. దీన్ని తల మీద వేసుకుంటే, అది తల నుండి మోకాళ్ల వరకు శరీరాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీన్ని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రైతులకు, కూలీలకు ఇది ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. గాలి ఎంత బలంగా వీచినా, ఇది చెదిరిపోదు. నాలుగు రోజులు ముసురు పడితే.. మనం ‘బురద బాబోయ్’ అని చికాకు పడుతుంటాం. కానీ, మాసిన్‌రామ్ ప్రజలు నిరంతరం కురుస్తూనే ఉంటే వానను చూసి ..ఏమాత్రం విసుక్కోరు. ఎందుకంటే.. వారి స్థానిక జీవనంలో శతాబ్దాలుగా వర్షం ఒక దైనందిన భాగమైపోయింది. వర్షం పడుతోందని అక్కడ ఎవరూ ఇళ్లకే పరిమితం కారు. పిల్లలు చిన్న ‘నాప్’లు వేసుకుని స్కూలుకు వెళ్తుంటే, పెద్దలు పెద్ద నాప్‌లు వేసుకుని తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. అక్కడ ఇళ్లకు పెంకులు లేదా గడ్డి, తాటాకుల వంటివి వాడరు, ఎందుకంటే వర్షంతో బాటు వీచే బలమైన గాలుల ధాటికి అవి కొట్టుకుపోతాయని కాబట్టి. అందుకే, వాళ్లు బలమైన రేకులతో ఇళ్లను నిర్మించుకుంటారు. ప్రకృతిని నిందించడం కంటే, దానికి అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకోవడమే తెలివైన పనని నిరూపించిన ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి ఇచ్చే సవాళ్లను ఎదుర్కోవడం ఎలాగో మాసిన్‌రామ్ ప్రజలకు బాగా తెలుసు. ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ రెయిన్‌కోట్లు, గొడుగులు ఉన్నప్పటికీ, తమ పూర్వీకుల నాటి వెదురు ‘నాప్’లను నమ్ముకుని, పర్యావరణానికి హాని చేయకుండా జీవిస్తున్న వారి తీరు ఎంతో గొప్పది. మనిషి.. ప్రకృతితో యుద్ధం చేయకూడదు, దానితో కలిసి జీవించాలని మాసిన్‌రామ్ గ్రామం ఈ ప్రపంచానికి చాటి చెబుతోంది. అవును, ఆ ‘నాప్’ కేవలం వాన నుంచి రక్షణ కల్పించే ఒక పరికరం మాత్రమే కాదు, ప్రకృతితో వారు ఏర్పరుచుకున్న ఒక అందమైన బంధం! మావ్‌జింబుయిన్ గుహల నుంచి ఉత్కంఠభరితమైన జలపాతాల వరకు, మాసిన్‌రామ్‌లోని ప్రతి మూలా మేఘాలయ సహజ సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రకృతి అన్వేషకులకు, వర్షం ప్రియులకు, ప్రశాంతమైన విడిది కోసం చూస్తున్నవారికి మాసిన్‌రామ్ కచ్చితంగా ఓ మరపురాని అనుభూతిని అందిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు ఇదొ స్వర్గధామంగా చెప్పుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెక్కింగ్ కు వెళ్లి తిరిగి రాని యువతి.. ఇంకా మిస్టరీగానే మిస్సింగ్ కేసు..
Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్.. ఖరీదైన ప్రొడక్ట్స్ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
సంపదలో అంబానీనే దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

