AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము – ముంగీస నీతి కథ: ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎంతో ప్రమాదకరం..!

The Snake and the Mongoose Moral Story: పిల్లలు, పెద్దలకు నీతి కథలు వినోదంతో పాటు జీవితానికి అవసరమైన నైతిక విలువలను నేర్పిస్తాయి. ఆవేశం, తొందరపాటుతో తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఎంత ప్రమాదానికి దారితీస్తాయో మనకు అర్థమయ్యేలా నీతి కథలు నేర్పిస్తాయి. అలాంటి ప్రసిద్ధ నీతి కథల్లో పాము–ముంగీస కథ ఒకటి. హృదయాన్ని తాకే విధంగా చెప్పే ఈ కథను పెద్దలు తరతరాలుగా తమ పిల్లలకు బోధిస్తూ వస్తున్నారు.

పాము - ముంగీస నీతి కథ: ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎంతో ప్రమాదకరం..!
Snake And The Mongoose Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jun 06, 2026 | 5:18 PM

Share

నీతి కథలు కేవలం వినోదం కోసం చెప్పే కథలు కావు. అవి పిల్లలతో పాటు పెద్దలకు జీవితంలో సరైన మార్గాన్ని చూపించే నైతిక విలువలు, జీవిత పాఠాలు నేర్పుతాయి. నిజాయితీ, దయ, కష్టపడి పనిచేయడం, సహనం, వినయం వంటి మంచి గుణాలను పెంపొందిస్తాయి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవడం, తప్పులను గుర్తించడం, వాటి పరిణామాలను అర్థం చేసుకోవడం నేర్పిస్తాయి. పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించే నీతి కథల్లో పాము–ముంగీస కథకు ప్రత్యేక స్థానం ఉంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ కథ ఎంతో ఆసక్తికరంగా.. హృదయాన్ని తాకేలా వివరిస్తుంది. అందుకే తరతరాలుగా ఈ కథను పెద్దలు పిల్లలకు చెబుతూ వస్తున్నారు.

కథ

ఒక గ్రామంలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారికి దయాగుణం చాలా ఎక్కువ. దానధర్మాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. చాలా కాలం తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డను వారు తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించేవారు.

ఒక రోజు భాస్కర శర్మకు దారిలో ఒక చిన్న ముంగీస పిల్ల కనిపించింది. దానిపై జాలిపడి ఇంటికి తీసుకొచ్చి పెంచడం ప్రారంభించాడు. ‘ఇది మన బిడ్డకు తోడుగా, కాపలాదారుగా ఉంటుంది’ అని భార్యకు చెప్పాడు. ఆమె కూడా సంతోషంగా ముంగీసను ఇంట్లో పెంచుకునేందుకు అంగీకరించింది. అలా ముంగీస భాస్కర శర్మ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఒకరోజు భాస్కర శర్మ బయటకు వెళ్లగా, కమలమ్మ ఇంటి పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకురావడానికి బావి వద్దకు వెళ్లింది. వెళ్లేముందు బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి.. ‘నేను వచ్చే వరకు బాబును జాగ్రత్తగా చూసుకో’ అని ముంగీసకు చెప్పింది. ముంగీస కూడా ఉయ్యాల పక్కనే కాపలా కూర్చుంది.

బిడ్డ ప్రాణం కాపాడిన ముంగీస

కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద నల్లత్రాచు పాము ఉయ్యాలలో ఉన్న బిడ్డ వైపు పాకుతూ వచ్చింది. ప్రమాదాన్ని గమనించిన ముంగీస వెంటనే పాముపై దాడి చేసింది. తీవ్ర పోరాటం తర్వాత పామును చంపేసి బిడ్డ ప్రాణాలను కాపాడింది. అయితే ఆ పోరాటంలో పాము రక్తం ముంగీస ఒంటికి, మూతికి అంటుకుంది.

అదే సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన కమలమ్మ.. రక్తంతో తడిసి ముంగీసను చూసి అది తన బిడ్డను చంపేసిందని భావించింది. ఆవేశంతో చేతిలో ఉన్న నీటి బిందెను దానిపై విసిరికొట్టింది. ఆ దెబ్బకు ముంగీస అక్కడికక్కడే చనిపోయింది.

ఇంట్లోకి పరుగెత్తి వెళ్లి చూసిన కమలమ్మకు బిడ్డ క్షేమంగా కనిపించాడు. పక్కనే ముక్కలైన నల్లత్రాచు పాము కనిపించింది. అప్పుడు జరిగిన నిజం అర్థమై, తమ బిడ్డ ప్రాణలు కాపాడిన ముంగీసను తొందరపాటుతో చంపేశామని భాస్కర శర్మ దంపతులు ఎంతో పశ్చాత్తాపపడ్డారు. అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

నీతి

ఆవేశం, తొందరపాటు మనిషిని తప్పుదారిలో నడిపిస్తాయి. ఏ నిర్ణయం తీసుకునే ముందు నిజానిజాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. లేకపోతే జీవితాంతం మరిచిపోలేని నష్టం ఎదురవుతుంది.

పిల్లలకు నీతి కథలు జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తాయి. చిన్న వయసులో నేర్చుకున్న ఈ పాఠాలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయి. నీతి కథ చదవడం ముగిసినా.. అందులో నేర్చిన పాఠం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది.

Follow Us