మోసం చేస్తున్నారని తెలిసినా రిలేషన్ కొనసాగించడమే కొత్త ట్రెండ్? ఏమని పిలుస్తారు
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త కొత్త డేటింగ్ పదాలు మనకు పరిచయమవుతున్నాయి. ఒక ట్రెండ్ గురించి అర్థం చేసుకునేలోపే మరో కొత్త పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అయితే 2026 నాటికి విడాకులు లేదా మోసాన్ని కూడా కొత్త పేర్లతో పిలుస్తూ వాటిని సమర్థించుకునే ప్రయత్నం జరుగుతోంది.

టోల్యామరీ అనేది వినడానికి చాలా ఫ్యాన్సీగా అనిపించినా, దీని అర్థం చాలా సరళం. తన భాగస్వామి మరొకరితో సంబంధం పెట్టుకున్నారని తెలిసినా, దానిని భరిస్తూ ఏమీ తెలియనట్లుగా నటించడమే ఈ ట్రెండ్ యొక్క సారాంశం. ఇది సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టి ‘కూల్’ గా చూపించే ప్రయత్నం జరుగుతోంది.
ముఖ్యంగా ప్రేమ, పెళ్లి వంటి బంధాలలో ‘నమ్మకం’ అనేది మృగ్యమవుతున్న వేళ, ‘టోల్యామరీ’ అనే పదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది వినడానికి ఏదో కొత్త ఫిలాసఫీలా అనిపించినా, వాస్తవానికి ఇది పాతకాలపు ‘నమ్మకద్రోహానికి’ రంగుల అద్దిన కొత్త రూపం మాత్రమే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పాలీయామరీ వర్సెస్ టోల్యామరీ
చాలామంది ఈ రెండింటి మధ్య గందరగోళానికి గురవుతుంటారు, కానీ వీటి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. పాలీయామరీలో భాగస్వాములు ఇద్దరూ పరస్పర అంగీకారంతో, ఓపెన్‌గా తమ ఇతర సంబంధాల గురించి చర్చించుకుంటారు. ఇది నమ్మకం, అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది. టోల్యామరీ మోసపూరితమైనది.
ఒక భాగస్వామి తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా, రెండో వ్యక్తి ఆ బాధను భరిస్తూ మౌనంగా ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ అంగీకారం కంటే ‘భరించడం’ ఎక్కువగా ఉంటుంది. ఇది భాగస్వామిని మానసిక వేదనకు గురిచేస్తుంది తప్ప, బంధాన్ని బలపరచదు.
నమ్మక ద్రోహానికి కొత్త బ్రాండింగ్
మోసాన్ని ఎవరూ సమర్థించలేరు కాబట్టి, భాషతో ఆడుకుంటూ దానిని ఒక ట్రెండ్ లా మార్చేస్తున్నారు. టోల్యామరీ అనేది గౌరవం, విధేయత లేని బంధానికి నిదర్శనం. ఇది బంధం యొక్క పునాది అయిన ‘నమ్మకాన్ని’ పూర్తిగా దెబ్బతీస్తుంది. ఒక తప్పుడు వస్తువుకు ఎంత గొప్ప మార్కెటింగ్ చేసినా అది నాణ్యమైనది కానట్లే, మోసానికి ఎన్ని కొత్త పేర్లు పెట్టినా అది ‘రెడ్ ఫ్లాగ్’ మాత్రమే అవుతుంది.
ప్రేమలో నిజాయితీ లేనప్పుడు ఆ బంధానికి అర్థం ఉండదు. టోల్యామరీ వంటి పదాలు అబద్ధాలను, అన్యాయాన్ని గ్లోరిఫై చేస్తాయి. ఇటువంటి ట్రెండ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. బంధం ఏదైనా అందులో పరస్పర గౌరవం, పారదర్శకత ఉన్నప్పుడే అది కలకాలం నిలుస్తుంది. రంగురంగుల పదాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలను గుర్తించడం నేటి తరం బాధ్యత.
