AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs LSG : ఆదుకున్న రిజ్వీ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం

DC vs LSG : లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని, కుర్రాడు సమీర్ రిజ్వీ తన అసాధారణ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. కేవలం 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 70* పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

DC vs LSG  : ఆదుకున్న రిజ్వీ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం
Dc Vs Lsg
Rakesh
|

Updated on: Apr 02, 2026 | 6:18 AM

Share

DC vs LSG : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజా దొరుకుతోంది. టోర్నీలో భాగంగా జరిగిన ఐదో లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని, కుర్రాడు సమీర్ రిజ్వీ తన అసాధారణ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. కేవలం 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చి, లక్నో నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఢిల్లీ బౌలర్లు లుంగీ ఎన్గిడి, టీ నటరాజన్ బంతులతో నిప్పులు చెరిగారు. వీరిద్దరి ధాటికి లక్నో బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. అబ్దుల్ సమద్ (36 పరుగులు) కాసేపు పోరాడినా, మిగిలిన వారు విఫలం కావడంతో లక్నో 18.4 ఓవర్లలోనే 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఎన్గిడి, నటరాజన్ చెరో మూడు వికెట్లు తీసి లక్నో పతనాన్ని శాసించారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి లక్నో బౌలర్లు చుక్కలు చూపించారు. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. స్టార్ ప్లేయర్లు కెఎల్ రాహుల్ (0), నితీష్ రాణా (15), నిశాంక (1), అక్షర్ పటేల్ (0) పెవిలియన్ చేరారు. కేవలం 26 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయిన ఢిల్లీని చూసి లక్నో విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే అప్పుడే సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ కలిసి అసలైన ఆట మొదలుపెట్టారు.

ఒత్తిడిలో ఉన్న జట్టును సమీర్ రిజ్వీ తన భుజాలపై వేసుకున్నాడు. ఎక్కడా తడబడకుండా లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 70* పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 119* పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి, 17.1 ఓవర్లలోనే ఢిల్లీని గెలిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసినా లాభం లేకపోయింది.

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అసాధ్యమనుకున్న మ్యాచ్‌ను సుసాధ్యం చేసి కుర్రాళ్ల సత్తా ఏంటో నిరూపించింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరు చేయడం, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఆ జట్టును దెబ్బతీసింది. మహ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసినా రిజ్వీ వీరవిహారం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us