Inspiring Story: భర్త, మామ మృతి.. కుటుంబం కోసం రైతుగా మారిన ఓ మహిళ.. ఏటా రూ.25 లక్షల సంపాదన
Woman Inspirational Story: ప్రపంచం ఆధునిక విజ్ఞానంతో అంబరాలను చుంబించినా.. సముద్ర లోతులను కొలిచినా మహిళల పట్ల విచక్షణ ఇంకా కొనసాగుతూనే..
Inspiring Story: ప్రపంచం ఆధునిక విజ్ఞానంతో అంబరాలను చుంబించినా.. సముద్ర లోతులను కొలిచినా మహిళల పట్ల విచక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని కొన్ని పనులు మహిళలు చేయలేరంటూ తక్కువ చేసి చూడడం సర్వసాధారణంగా ఎక్కడైనా ఉండేదే.. అయితే ఓ మహిళ తనకు ఎదురైనా సవాళ్ళను.. ఎదుర్కొంది.. నువ్వు ఆడదానికి వ్యవసాయం చేయలేదు… విజయం సాధించలేవు అన్నవారి నోటి నుంచి శెభాష్ అనిపించుకుంది. ఆమె నాసిక్‌లోని మాటోరి గ్రామానికి చెందిన సంగీత పింగలే అనే మహిళా రైతు.. సంగీత సక్సెస్ స్టోరీ వివరాల్లోకి వెళ్తే..
సంగీత రెండో కుమారుడు 2004లో జనన సమస్యల వలన మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే 2007 లో సంగీత భర్త ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త మరణించే నాటికీ సంగీత 9 నెలల గర్భవతి. సంగీత కష్టాన్ని అత్తమామలు అర్ధం చేసుకున్నారు. పదేళ్ళపాటు అండగా నిలిచారు. అయితే 2017లో కుటుంబ కలహాల కారణంగా ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో సంగీత తన అత్తమామలు, పిల్లలతో కలిసి వేరేగా జీవించడం ప్రారంభించింది.
ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన రెండు నెలల తర్వాత సంగీత మామగారు అనారోగ్యంతో మరణించారు. కుటుంబంలో విషాదం నెలకొంది. సంగీత జీవితం కొత్త మలుపు తిరిగింది. కుటుంబం గడవాలంటే.. తప్పని సరిగా పనిచేయాల్సి వచ్చింది. సైన్స్ లో డిగ్రీ పట్టాపుచ్చుకున్న సంగీత మామవారు ఇచ్చిన 13 ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలు పెట్టింది.
సంగీత కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు పొలం.. కనుక సంగీత పొలంలో పని చేయడం ఎలాగో నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే సంగీత నిర్ణయాని అందరూ అడ్డు చెప్పారు. మహిళలు వ్యవసాయం చేయడం కష్టమని.. మాటలు చెప్పడం ఈజీ.. వ్యవసాయం చేయడం కష్టం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే సంగీత ఎవరి మాటలను వినలేదు.. తన పనిపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు తన 13 ఎకరాల భూమిలో ద్రాక్ష, టమోటాలను పండిస్తోంది. విమర్శకుల నోటికి తన పనితోనే సమాధానం చెప్పింది. పొలంలో ఆధునిక వ్యవసాయ పద్దతులను అనుసరించి టన్నుల దిగుబడి సాధించి.. లక్షల ఆదాయాన్ని పొందుతుంది.
వ్యవసాయం మొదలు పెట్టడానికి తమ కుటుంబ సభ్యుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇక సంగీతకు సోదరులు అండగా నిలబడ్డారు. పంట వేసే సమయం నుంచి దిగుబడి వచ్చే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. తన చదువుకు పదును పెడుతూ.. వ్యవసాయంలోని మెళకువులను త్వర త్వరగా నేర్చుకుంది. తనకు ఎదురైనా సవాళ్ళను ఎదుర్కొంటు.. ద్రాక్షతోటను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. వ్యవసాయంలో పురుషులు మాత్రమే చేసే కొన్ని పనులున్నాయని గ్రహించింది. ట్రాక్టర్ నడపడం, యంత్రాలను రిపేర్ చేయడం, సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తులను కొనుగోలు చేయడం కోసం మార్కెట్‌కు వెళ్లడం వంటి పనులుంటాయని తెలుసుకున్న సంగీత మోటార్ సైకిల్ నడపడం, ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. నెమ్మదిగా సంగీత పొలం పనులను పూర్తిస్తాయిలో చేయడం నేర్చుకుంది. ఈ రోజు సంవత్సరానికి 800-1,000 టన్నుల ద్రాక్ష దిగుబడిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు ఏడాదికి రూ 25-30 లక్షలు సంపాదించింది. టమోటా వ్యవసాయంలో కొన్ని సార్లు నష్టాలు వచ్చాయని తెలిపింది.
ఈ రోజు, సంగీత కుమార్తె గ్రాడ్యుయేషన్ , కొడుకు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. సంగీత తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ద్రాక్ష పంటను ఎగుమతిచేసే దిశగా ఆలోచిస్తుంది. తనను తాను నిరూపించుకోగలిగినందుకు గర్వపడుతున్నానని.. ఎంత ఎదిగినా వినయంగానే ఉంటానని చెప్పింది. అంతేకాదు వ్యవసాయం తనకు పట్టుదల, సహనాన్ని నేర్పిందని సంగీత చెబుతోంది.
Also Read: రష్యాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా భారీగా కేసులు నమోదు..