Bottle Gourd: సొరకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ 5 రకాల వ్యక్తులు తింటే సమస్యలు తప్పవు!
మన వంటింట్లో తరచుగా కనిపించే కూరగాయల్లో సొరకాయ ఒకటి. పప్పు పులుసు నుంచి కూరల వరకు ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తాం. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందని మనందరికీ తెలుసు. అయితే, అందరూ అనుకున్నట్లుగా సొరకాయ అందరికీ మేలు చేయదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సొరకాయ తినే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎందుకు ప్రమాదకరమో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారికి, తక్కువ కేలరీల ఆహారం తీసుకునే వారికి సొరకాయ ఒక అద్భుతమైన ఎంపిక. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ కూరగాయను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. కానీ, ఈ నాణేనికి మరో వైపు కూడా ఉంది. గర్భిణీ స్త్రీల నుండి రక్తపోటు సమస్య ఉన్నవారి వరకు.. కొందరు దీనిని అమితంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు సొరకాయ ఎప్పుడు విషంగా మారుతుంది? ..
గర్భిణీ స్త్రీలు జాగ్రత్త!
గర్భిణీ స్త్రీలు తమ ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సొరకాయ విషయంలో కూడా వారు అప్రమత్తంగా ఉండటం మంచిది. సాధారణంగా ఇది పోషకాలను అందించినప్పటికీ, ఇందులోని కొన్ని రకాల సహజ విషపదార్థాలు పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి, సొరకాయను ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. దీనిని పూర్తిగా మానేయకపోయినా, అతిగా తినకుండా మితంగా తీసుకోవడం వల్ల ముప్పు తప్పుతుంది.
రక్తపోటు తక్కువగా ఉంటే..
తక్కువ రక్తపోటు (Low BP) సమస్య ఉన్నవారికి సొరకాయ కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. సహజంగానే సొరకాయకు రక్తపోటును తగ్గించే గుణం ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే బీపీ తక్కువగా ఉంటే, సొరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మరింత తగ్గిపోవచ్చు. దీనివల్ల తీవ్రమైన బలహీనత, తలతిరుగుడు మరియు అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటును సమతుల్యం చేసుకోవాలనుకునే వారు తమ డైట్‌లో సొరకాయ పరిమాణాన్ని తగ్గించుకోవడం లేదా నిపుణుల సలహాతో తీసుకోవడం మంచిది.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు
మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సొరకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రధాన కారణం సొరకాయలో అధికంగా ఉండే పొటాషియం. సాధారణంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరంలోని అదనపు పొటాషియం బయటకు విసర్జించబడుతుంది. కానీ కిడ్నీలు సరిగ్గా పనిచేయని స్థితిలో, రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది ఉన్న సమస్యను మరింత జటిలం చేస్తుంది. అందుకే కిడ్నీ పేషెంట్లు దీనిని పరిమితంగానే తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు, గ్యాస్
జీర్ణక్రియ మందగించినప్పుడు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నప్పుడు సొరకాయ ఇబ్బంది పెట్టవచ్చు. ఇందులో ఫైబర్ నీరు అధికంగా ఉండటం వల్ల కొందరికి త్వరగా అరగదు. ముఖ్యంగా రాత్రిపూట సొరకాయ వంటకాలు తినడం వల్ల గ్యాస్, అజీర్ణం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయాల్లో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో సొరకాయకు దూరంగా ఉండటమే మంచిది.
చేదు సొరకాయ డేజంర్..
చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం సొరకాయ రసాన్ని తాగుతుంటారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొరకాయలో ‘కుకుర్బిటాసిన్’ అనే టాక్సిన్ ఉంటుంది. రసం తయారుచేసే ముందు ముక్కను రుచి చూడాలి. అది చేదుగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చేదుగా ఉన్న సొరకాయ రసం తాగితే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కాబట్టి సొరకాయ అందరికీ మంచిది అనే అపోహ వీడి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారంలో చేర్చుకోండి.
