Chanakya Niti: చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు ఏంటంటే..?
మరణానంతరం మనిషి సంపాదించిన ఆస్తిపాస్తులు ఇక్కడే ఉండిపోతాయి. మరణం తర్వాత మనిషి ఖాళీ చేతులతో వెళ్తాడని అంటారు.. కానీ చాణక్యుడి ప్రకారం మూడు విషయాలు ఆత్మను నీడలా అనుసరిస్తాయి. మరి అవి ఏంటివి..? ఆత్మతో ప్రయాణించే ఆ మూడు విషయాల గురించి తెలుసుకుందాం..

పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.. ఇది జగమెరిగిన సత్యం. మరణం తర్వాత మనిషి సంపాదించిన ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు అంతా ఇక్కడే ఉండిపోతాయని, మనిషి ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్తాడని మనం చూస్తుంటాం. అయితే ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక విలక్షణమైన విషయాన్ని చెప్పారు. మనిషి మరణించిన తర్వాత కూడా మూడు ప్రత్యేక విషయాలు ఆత్మను నీడలా అనుసరిస్తాయని ఆయన వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చేసిన కర్మలు
చాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసే ధర్మబద్ధమైన లేదా అధర్మమైన పనులు మరణానంతర జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తి చేసిన పుణ్యపాపాలు మాత్రమే అతని వెంట వస్తాయి. అవే ఆ ఆత్మ స్వర్గానికి వెళ్తుందా లేదా నరకానికి వెళ్తుందా అని నిర్ణయిస్తాయి. అందుకే జీవించి ఉన్నప్పుడే సత్కర్మలు చేయాలని మన పెద్దలు చెప్తారు.
సంపాదించుకున్న గౌరవం
మనిషి బ్రతికున్నప్పుడు సమాజానికి చేసిన సేవ, పరుల పట్ల చూపిన దయ అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయి. చాణక్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతను సంపాదించిన గౌరవం లేదా అప్రతిష్ట అతని పేరుతో పాటు కొనసాగుతాయి. మంచి పనులు చేసిన వారు మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. చెడు పనులు చేసిన వారు విమర్శలకు గురవుతారు.
నెరవేరని కోరికలు
మానవ జీవితం కోరికల మయం. అయితే మరణించే సమయానికి కొన్ని కోరికలు నెరవేరక అలాగే ఉండిపోవచ్చు. ఈ నెరవేరని కోరికలే ఆత్మతో పాటు ప్రయాణిస్తాయని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఒక వ్యక్తి అకాల మరణం చెందినప్పుడు ఆ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కోరికలు తీరాలని ప్రత్యేక ప్రార్థనలు లేదా పితృ కార్యాలు నిర్వహిస్తారు.
మనిషి తన జీవితకాలంలో ఆస్తిని, అంతస్తును సంపాదించుకోవడానికి పడే తాపత్రయంలో అసలైన కర్మ ఫలాన్ని మర్చిపోతున్నాడు. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు మనకు ఒకే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. మనం వెళ్లేటప్పుడు వెంట తెచ్చుకునేవి మనం సంపాదించిన కోట్లు కాదు, మనం చేసిన మంచి పనులు, సంపాదించుకున్న గౌరవం మాత్రమే
