AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: అబద్ధాలతో సాధించిన విజయం ఎప్పటికైనా పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ

కష్టపడకుండా, ఇతరులను మోసం చేసి పొందిన విజయం శాశ్వతంగా ఉండదు. నిజాయితీగా సంపాదించిన చిన్న విజయమే అయినా మనకు గౌరవాన్ని, నమ్మకాన్ని ఎక్కువకాలం అందిస్తుంది. అబద్ధంతో గెలిచిన విజయం తాత్కాలికం.. నిజాయితీతో సాధించిన విజయమే శాశ్వతం. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా మోసం, అబద్ధాల దారిని ఎంచుకోకుండా నిజాయితీగా కష్టపడాలి. అప్పుడే మనకు లభించే విజయం, గౌరవం నిజమైనవిగా నిలుస్తాయి. ఈ కింది కథ ద్వారా ఈ విషయాన్ని పిల్లలకు వివరంగా చెబితే చిన్నతనం నుంచే నిజాయితీతో కూడిన నడవడికను అలవరచుకుంటారు..

Moral Story: అబద్ధాలతో సాధించిన విజయం ఎప్పటికైనా పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ
Blue Fox Deception Story
Srilakshmi C
|

Updated on: Aug 27, 2026 | 5:20 PM

Share

అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, ఉడతలు, పక్షులు ఇలా ఎన్నో జంతువులు నివసించేవి. ప్రతి జంతువు ఎంతో కష్టపడి తన ఆహారాన్ని తానే సంపాదించుకునేది. అదే అడవిలో ఒక జిత్తులమారి గుంటనక్క ఉండేది. దానికి ఒళ్లంతా బద్ధకం. కష్టపడి ఆహారం సంపాదించడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ప్రతి రోజూ ఉదయం లేచి చుట్టూ చూసేది. ‘ఈరోజు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఆహారం కోసం నేను ఎందుకు కష్టపడాలి?’ అని అనుకునేది. చిన్న చిన్న పక్షులు, ఉడతలు, ఇతర జంతువులు కష్టపడి గింజలు, పండ్లు సేకరించుకుంటే చాలు… నక్క వాటిని భయపెట్టి పారగొట్టేది. అవి పారిపోయిన తర్వాత వాటి ఆహారాన్ని తానే తినేసేది. ‘చెప్పానా… ఆహారం సంపాదించడం చాలా ఈజీ!’ అంటూ గర్వపడేది. ఇలా రోజులు గడిచాయి. కానీ ఒక రోజు ఉడతలు, చిలకలు నక్క బుద్ధిని కనిపెట్టేశాయి. తమ ఆహారాన్ని నక్కకు అందకుండా రహస్య ప్రదేశాల్లో దాచుకోవడం ప్రారంభించాయి. ఇది చూసిన నక్కకు కోపం వచ్చింది.

‘ఈ ఉడతలకు, చిలకలకు కూడా తెలివి ముదిరిపోయింది! నాకే అందకుండా ఆహారాన్ని దాస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి?’ అని ఆలోచించింది. అప్పుడే కొంత దూరంలో ఒక సింహం తన ఆహారం తింటూ కనిపించింది. ‘సింహం తిని వెళ్లిపోయాక మిగిలినదంతా నేను తినేస్తాను’ అని నక్క నెమ్మదిగా అక్కడికి వెళ్లింది. కానీ సింహం దానిని చూసేసింది. ‘ఎంతసేపు దొంగలా దాక్కుంటావు? రా బయటికి!’ అంటూ గర్జించింది. నక్క భయపడిపోయి ‘అయ్యో! నేను దొంగతనం చేయడం లేదు. మీరు ఏం తింటున్నారో దూరం నుంచి చూస్తున్నాను అంతే’ అని అబద్ధం చెప్పింది. సింహం కోపంగా ‘నువ్వు రోజూ చేసే పని నాకు తెలియదనుకుంటున్నావా? చిన్న జంతువుల దగ్గర నుంచి ఆహారం కొట్టేసి నీ కడుపు నింపుకుంటున్నావు. నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవడానికి కూడా బద్ధకమా?’ అని ప్రశ్నించింది. నక్క ఏదో సాకులు చెప్పి అక్కడి నుంచి పారిపోయింది.

‘ఇంక ఈ అడవిలో నాకు లాభం లేదు. అందరూ చాలా తెలివైన వాళ్లైపోయారు. పక్కనే ఉన్న ఊరికి వెళ్తే ఏమైనా మంచి ఆహారం దొరుకుతుందేమో చూద్దాం’ అని అనుకుంది. ఆ ఊరిలోకి వెళ్లి ఇల్లిల్లూ వెతికింది. కానీ ఎక్కడా ఆహారం దొరకలేదు. ఒక చోట ఖాళీ పాత్రలు, ఇంకో చోట దుమ్ము, ధూళి మాత్రమే కనిపించాయి. ఆకలితో అలమటిస్తూ తిరుగుతున్న నక్కకు చివరకు ఒక ఇంటి దగ్గర ఎంతో ఆహారం కనిపించింది. కోళ్లు, గింజలు, రకరకాల వంటకాలు చూసి దాని నోట్లో నీళ్లు ఊరాయి. ‘ఈరోజు నాకు పండగే!’ అంటూ వాటి దగ్గరకు వెళ్లబోయింది. అప్పుడే ఇంట్లో ఉన్న కుక్కలు నక్కను చూసి మొరగసాగాయి. ‘దొరికావంటే చచ్చావే!’ అన్నట్టుగా దాని వెంట పడ్డాయి. నక్క ప్రాణభయంతో పరిగెత్తింది. పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక రంగుల ద్రవంతో నిండిన తొట్టెలో పడిపోయింది.

ఇవి కూడా చదవండి

కుక్కలు వెళ్లిపోయిన తర్వాత నక్క మెల్లగా బయటకు వచ్చింది. దగ్గరలోని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆశ్చర్యపోయింది. ‘అరే! ఇదేంటి? నా ఒళ్లంతా నీలి రంగులో మారిపోయింది!’ అని ఆశ్చర్యపోయింది. కాసేపటికి దాని కళ్లలో ఒక జిత్తులమారి ఆలోచన మెరిసింది. ‘అయ్యో! నన్ను నేనే గుర్తుపట్టుకోలేకపోయాను. ఇక అడవిలోని జంతువులు నన్ను ఎలా గుర్తుపడతాయి? ఈ రూపంలో అడవికి వెళ్లి అందరినీ ఒక ఆట ఆడిస్తా!’ అని అనుకుంది. నీలి రంగులో ఉన్న నక్క అడవిలోకి అడుగుపెట్టింది. దానిని చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ‘ఇదెక్కడి నుంచి వచ్చిన వింత జీవి?’ అని ఒకటి అడిగింది. ‘ఇంతకుముందు ఇలాంటి జంతువును ఎప్పుడూ చూడలేదు!; అని మరొకటి చెప్పింది. సింహం, పులి, ఏనుగు కూడా ఆ వింత జీవిని ఆశ్చర్యంగా చూశాయి.

అప్పుడు నక్క గంభీరమైన స్వరంతో ఇలా చెప్పింది.. ‘నన్ను స్వయంగా దేవుడు మీ అందరినీ పాలించడానికి పంపించాడు. ఇక నుంచి నేను ఈ అడవికి రాజును!’ ఆ మాటలు విన్న జంతువులు నమ్మేశాయి. కొన్నింటి కళ్లలో భయం, మరికొన్నింటి కళ్లలో భక్తి కనిపించాయి. ‘ఇతను సాధారణ జీవి కాదు. దైవ స్వరూపం అయి ఉంటాడు!’ అంటూ జంతువులన్నీ నీలి నక్కకు నమస్కరించాయి. సింహం, పులి కూడా దానికి మర్యాదగా తలవంచాయి. అలా నీలి నక్క అడవికి రాజు అయిపోయింది. ఇక దానికి ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. జంతువులన్నీ రకరకాల పండ్లు, ఆహారాన్ని తీసుకొచ్చి దానికి సమర్పించేవి. నక్క మాత్రం మనసులో నవ్వుకుంటూ ‘చెప్పానా? ఆహారం సంపాదించడం చాలా సులభం. కష్టపడాల్సిన పనే లేదు!’ అనుకునేది. కొంతకాలం అలా సుఖంగా గడిచింది.

కానీ ఒక రోజు వర్షం పడింది. వర్షపు నీటికి నక్క ఒంటిపై ఉన్న నీలి రంగు క్రమంగా కడిగిపోవడం మొదలైంది. జంతువులు ఆశ్చర్యంగా చూస్తుండగానే దాని అసలు రంగు బయటపడింది. ‘అరే! ఇది మన గుంటనక్కే!’ అని ఒక జంతువు అరిచింది. ‘ఇన్నాళ్లూ మనల్ని మోసం చేసిందా?’ అని ఇంకొకటి కోపంగా అంది. సింహం గర్జించింది ‘మమ్మల్నే మోసం చేస్తావా? నీ ధైర్యం ఎంత!’ అని అనింది. క్క భయంతో నవ్వుతూ.. ‘హి హి హి… ఊరికే సరదాగా అందరినీ ఆటపట్టిద్దామని చేశాను. మీరు నమ్మేశారు కదా!’అని చెప్పింది. కానీ ఈసారి జంతువులు దాని మాటలు నమ్మలేదు. సింహం, పులి, ఇతర జంతువులన్నీ నక్క వెంట పడ్డాయి. ‘పరిగెత్తు… పరిగెత్తు! వీళ్లకు దొరికావంటే ఈసారి తప్పించుకోలేవు!’ అని భయపడుతూ నక్క అడవిలోకి పారిపోయింది. అలా మోసం, మాయలతో కొంతకాలం రాజుగా జీవించిన నక్క చివరకు తన నిజస్వరూపం బయటపడటంతో పారిపోవాల్సి వచ్చింది.

నీతి

మోసం, అబద్ధాలతో పొందిన గౌరవం శాశ్వతం కాదు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కష్టపడకుండా పొందిన విజయం కూడా ఎక్కువకాలం నిలవదు. నీలి నక్క తన నిజస్వరూపాన్ని దాచిపెట్టి, జంతువులను మోసం చేసి అడవికి రాజుగా మారింది. కొంతకాలం అందరి గౌరవం, సేవలు, సుఖాలు అనుభవించింది. కానీ అది నిజమైన గౌరవం కాదు. అబద్ధం మీద నిలిచిన గౌరవం. ఎంత తెలివిగా అబద్ధం చెప్పినా, ఎంతకాలం మోసం చేసినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. నక్కపై పడిన వర్షం దాని శరీరంపై ఉన్న నీలి రంగును కడిగేసినట్లే, కాలం కూడా మనం దాచిన నిజాలను బయటపెడుతుంది.

Follow Us
నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్
నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్
పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..
పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..
చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే!
చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే!
రాఖీ పండుగ స్పెషల్.. తక్కువ చక్కెరగల స్వీట్స్ ఇవే!
రాఖీ పండుగ స్పెషల్.. తక్కువ చక్కెరగల స్వీట్స్ ఇవే!
కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్.. యాత్రకు అంత విశిష్టత ఏంటి?
కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్.. యాత్రకు అంత విశిష్టత ఏంటి?
డ్రాగా ముగిసిన కొలంబో టెస్ట్.. 1-0తో సిరీస్ భారత్ కైవసం
డ్రాగా ముగిసిన కొలంబో టెస్ట్.. 1-0తో సిరీస్ భారత్ కైవసం
'ఇరుముడి'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రవితేజ రిప్లై ఏంటంటే?
'ఇరుముడి'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రవితేజ రిప్లై ఏంటంటే?
అబద్ధాలతో సాధించిన విజయం పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ
అబద్ధాలతో సాధించిన విజయం పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ
నయనతార వాచ్.. అందరిని ఆకర్షిస్తున్న లుక్..
నయనతార వాచ్.. అందరిని ఆకర్షిస్తున్న లుక్..
శ్రీరాముడికి రాఖీ ఎవరు కట్టారు? ఆయనకు నిజంగానే సోదరి ఉందా?
శ్రీరాముడికి రాఖీ ఎవరు కట్టారు? ఆయనకు నిజంగానే సోదరి ఉందా?