AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Story: వదిలేయడం కూడా ఓ కళే.. అతి ఆలోచనకు చెక్ పెట్టి మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ

ఓవర్‌థింకింగ్ నుంచి బయటపడాలంటే ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయగలం? అదే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. చాలామంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు దాన్ని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలా అని గంటల తరబడి ఆలోచిస్తారు. కానీ నిజానికి ప్రతి సమస్యకు ఒక్కటే పర్ఫెక్ట్ పరిష్కారం ఉండదు. చాలా సందర్భాల్లో ముందుగా ఒక నిర్ణయం తీసుకుని, పని మొదలుపెట్టి, అనుభవం ద్వారా దాన్ని మెరుగుపరచుకోవడం ఉత్తమం. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా తెలుసుకోండి..

Motivational Story: వదిలేయడం కూడా ఓ కళే.. అతి ఆలోచనకు చెక్ పెట్టి మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ
Overthinking Story
Srilakshmi C
|

Updated on: Aug 25, 2026 | 8:28 PM

Share

అనగనగా ఒకరోజు అత్తిలి అనే ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని కలవడానికి ఊర్లోని చాలామంది వచ్చి తమ సందేహాలను అడిగి సమాధానాలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఓ అమ్మాయి సన్యాసిని ఒక ప్రశ్న అడిగింది. ‘స్వామీజీ.. ఈ ప్రపంచంలో రోజూ ఎన్నో గొడవలు, సమస్యలు, గందరగోళాలు జరుగుతున్నాయి. ఇంత గోల మధ్యలో మనం ప్రశాంతంగా ఎలా ఉండాలి? ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోకుండా ఎలా జీవించాలి?’ అని అడిగింది. సన్యాసి ఏమీ సమాధానం చెప్పకుండా ఆమెను తన దగ్గరలో ఉన్న ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు.

‘ఈ చెట్టు కింద ఉన్న ఆకులను చూశావా?’ అని అడిగాడు. ‘చూశాను స్వామీజీ’ అని ఆమె చెప్పింది. ఈ ఆకులు ఒకప్పుడు చెట్టుకి ఎంతో ఆనందంగా అంటుకుని పచ్చగా ఉండేవి. గాలికి అటూ ఇటూ ఊగుతూ జీవించాయి. కానీ కాలం మారింది. వాటి సమయం పూర్తయింది. అప్పుడు అవి ఎలాంటి ప్రతిఘటన చేయకుండా చెట్టు నుంచి రాలిపోయాయి. ‘నేను చెట్టును వదలను.. నేను ఇక్కడే ఉండాలి’ అని ఒక్క ఆకు కూడా పట్టుబట్టలేదు. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. కొన్ని విషయాలు మన జీవితంలోకి వస్తాయి. కొంతకాలం మనతో ఉంటాయి. ఆ తర్వాత వాటి సమయం పూర్తయితే మనం వాటిని వదిలేయాలి. కానీ మనం మాత్రం ప్రతి విషయానికీ అడ్డు చెబుతాం. ‘ఇలా ఎందుకు జరిగింది?’ ‘ఇలా జరగకూడదు కదా!’ ‘అతను అలా ఎందుకు మాట్లాడాడు?’ ‘నేను అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది!’ అంటూ గతాన్ని పట్టుకుని కూర్చుంటాం. అదే ఓవర్‌థింకింగ్.

మన జీవితానికి ఒక సహజమైన రిథమ్ ఉంటుంది. కానీ ప్రతి విషయాన్ని పట్టుకుని కూర్చోవడం ఆ రిథమ్‌ను ఆపేస్తుంది. అందుకే కొన్ని విషయాలను గౌరవంగా, ప్రశాంతంగా వదిలేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనం జీవితాన్ని దాని సహజ ప్రవాహంలో ఆస్వాదించగలం” అని సన్యాసి చెప్పాడు. మనలో చాలామంది కూడా ఇలాగే చిన్న చిన్న విషయాలకు విపరీతంగా ఆలోచిస్తుంటాం. అయితే ప్రతి విషయాన్ని ఆలోచించడం తప్పు కాదు. కెరీర్‌లో ఏం చేయాలి? ఏం చదవాలి? ఎక్కడ చదవాలి? ఏ ఉద్యోగం ఎంచుకోవాలి? ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి? వంటి ముఖ్యమైన నిర్ణయాల గురించి సమయం తీసుకుని ఆలోచించడం అవసరమే. అది థింకింగ్.. కానీ చిన్న చిన్న విషయాలకు అవసరానికి మించి మానసిక శక్తిని ఖర్చు చేయడం ఓవర్‌థింకింగ్..

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు.. రాత్రి నిద్రపోయే సమయంలో ఆ రోజు జరిగిన ఓ చిన్న చెడు సంఘటనను పదే పదే గుర్తు చేసుకోవడం. రేపు ఏ బట్టలు వేసుకోవాలో గంటల తరబడి ఆలోచించడం. ఎవరో మనతో సరిగ్గా మాట్లాడకపోతే “అతను నన్ను ఎందుకు అలా చూశాడు?” అని ఆలోచించడం. ఇతరులు మన గురించి ఏమనుకుంటారోనని ప్రతి మాటను ముందుగానే కొలవడం. ఇలా మన మెంటల్ ఎనర్జీలో పెద్ద భాగాన్ని అవసరం లేని విషయాలపై ఖర్చు చేస్తాం. దీని వల్ల మరో సమస్య వస్తుంది. అదే ఇండెసిషన్.. అంటే నిర్ణయం తీసుకోలేకపోవడం.

‘నేను ఇలా చేస్తే వాళ్లు ఏమనుకుంటారు?’ ‘అలా చేస్తే బాగుంటుందా?’ ‘ఇది సరైన నిర్ణయమేనా?’ ‘ఇంకొంచెం ఆలోచిస్తే మంచి ఆప్షన్ దొరుకుతుందేమో?’ అంటూ ఆలోచిస్తూనే ఉంటాం. చివరికి నిర్ణయం తీసుకునే సామర్థ్యమే తగ్గిపోతుంది. మన మెంటల్ ఎనర్జీ కూడా పరిమితమే. ఉదయం ఎంతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తి సాయంత్రానికి అలసిపోవడానికి కారణం శారీరక శ్రమ మాత్రమే కాదు.. రోజంతా తీసుకున్న నిర్ణయాలు, ఎదురైన సమస్యలు, ఆలోచనలు కూడా మన మెదడును అలసిపోయేలా చేస్తాయి. అందుకే మన మానసిక శక్తిని అవసరమైన చోటే ఉపయోగించాలి. దీన్ని చెప్పడానికి మరో కథ ఉంది.

ఒక ఆశ్రమంలో కొత్తగా చేరిన ఓ సన్యాసి తన గురువును కలిసి’గురువుగారూ.. నా మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. నా బుర్ర ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంది. నాకు మనశ్శాంతి దొరకడం లేదు. నేను ఏం చేయాలి?’ అని అడిగాడు. అప్పుడు గురువు అతనికి ఒక కథ చెప్పాడు. ఒక వేటగాడు అడవిలో వేటకు వెళ్లాడు. అక్కడ అనుకోకుండా ఒక బాణం వచ్చి అతని శరీరానికి తగిలింది. బాణం విషపూరితమైనది. అతను వెంటనే వైద్యం చేయించుకోవాల్సింది పోయి.. ‘ఈ బాణం ఎవరు వేశారు?’ ‘ఎక్కడి నుంచి వచ్చింది?’ ‘బాణం ఎంత పొడవు ఉంది?’ ‘దాన్ని ఏ పదార్థంతో తయారు చేశారు?’ ‘వేటగాడు ఏ దిశలో ఉన్నాడు?’ అంటూ అనవసరమైన ప్రశ్నల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను సమాధానాలు తెలుసుకునేలోపే విషం శరీరమంతా వ్యాపించింది. చివరికి అతని ప్రాణాలు పోయాయి. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన ముందున్న సమస్యకు పరిష్కారం వెతకడం కంటే, “ఇది ఎందుకు జరిగింది?”, “ఎవరి వల్ల జరిగింది?”, “ఇలా కాకుండా అలా జరిగి ఉంటే?” అంటూ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటాం.

ఫలితం ఏమిటంటే.. చేయాల్సిన అసలైన పని మాత్రం మిగిలిపోతుంది. అందుకే ఓవర్‌థింకింగ్ నుంచి బయటపడాలంటే ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయగలం? అదే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. చాలామంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు దాన్ని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలా అని గంటల తరబడి ఆలోచిస్తారు. కానీ నిజానికి ప్రతి సమస్యకు ఒక్కటే పర్ఫెక్ట్ పరిష్కారం ఉండదు. చాలా సందర్భాల్లో ముందుగా ఒక నిర్ణయం తీసుకుని, పని మొదలుపెట్టి, అనుభవం ద్వారా దాన్ని మెరుగుపరచుకోవడం ఉత్తమం. లేకపోతే అనాలిసిస్ ప్యారాలసిస్ అనే పరిస్థితి వస్తుంది. అంటే ఒకే ఆలోచనల చక్రంలో పదే పదే తిరుగుతూ చివరికి ఏ పనీ చేయలేకపోవడం. ‘తప్పు చేయకూడదు’ అనే భయంతో చాలామంది ఏ పనీ మొదలుపెట్టరు. కానీ తప్పులు కూడా మనకు విలువైన పాఠాలు నేర్పుతాయి. అందుకే ప్రతి పనిని ఒక ఎక్స్‌పెరిమెంట్‌లా చూడాలి. ‘నేను దీన్ని ప్రయత్నిస్తాను. ఫలితం ఎలా వస్తుందో చూస్తాను. అవసరమైతే మార్చుకుంటాను’ అనే ఆలోచన ఉండాలి. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండటం కూడా సాధ్యం కాదు. రేపటి పని గురించి ముందుగానే సిద్ధం కావాలి. కానీ దానికోసం రోజంతా ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడే బఫర్ బ్లాక్స్ అనే ఆలోచన ఉపయోగపడుతుంది.

మీ రోజులో కొన్ని పనులకు ముందుగానే ప్రత్యేక సమయం కేటాయించుకోండి. ఆ సమయంలో ఆ పని గురించి పూర్తిగా ఆలోచించండి. ప్లాన్ చేసుకోండి. నిర్ణయం తీసుకోండి. ఆ సమయం ముగిసిన తర్వాత దాన్ని పక్కన పెట్టండి. ఇలా చేస్తే మన మెదడుకు కూడా ఒక పరిమితి ఏర్పడుతుంది. ప్రతి క్షణం అదే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. జీవితం అంటే ప్రతి విషయాన్ని గట్టిగా పట్టుకోవడం కాదు. కొన్ని విషయాల కోసం ఆలోచించాలి. కొన్ని విషయాల కోసం పోరాడాలి. కొన్ని విషయాల నుంచి నేర్చుకోవాలి. మరికొన్ని విషయాలను మాత్రం వదిలేయాలి. చెట్టుపై ఉన్న ఆకు తన సమయం వచ్చినప్పుడు చెట్టును వదిలినట్టే.. మన జీవితంలో కూడా కొన్ని విషయాలకు గుడ్‌బై చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని పట్టుకుని కూర్చుంటే మన చేతులు నిండిపోతాయి. కానీ కొన్ని విషయాలను వదిలేస్తే.. కొత్త వాటికి చోటు ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఒక చిన్న ప్రశ్న మీకు మీరు వేసుకోండి ‘ఇది నిజంగా నా ఆలోచనకు అంత విలువైన విషయమేనా?’ సమాధానం ‘కాదు’ అయితే.. దాన్ని వదిలేయండి. ప్రస్తుతం మీ ముందున్న పనిపై దృష్టి పెట్టండి. మీ మెంటల్ ఎనర్జీని కాపాడుకోండి. పర్ఫెక్షన్ కోసం జీవితాన్ని ఆపకండి. అవసరమైన చోట ఆలోచించండి.. అవసరం లేని చోట వదిలేయండి. అప్పుడే జీవితం మరింత ప్రశాంతంగా, తేలికగా, ఆనందంగా మారుతుంది. జీవితం మనం అనుకున్నట్టుగా ప్రతిసారీ జరగదు. కానీ జరిగే ప్రతి విషయాన్ని మనం ఎలా స్వీకరించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అదే ఓవర్‌థింకింగ్ నుంచి బయటపడటానికి మొదటి అడుగు.

Follow Us