AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కోచింగ్ అవసరం లేదు.. కానీ గైడెన్స్ తప్పనిసరి’.. UPSC టాపర్‌ IPS అక్షయ్ కుమార్‌ సక్సెస్‌ సీక్రెట్స్‌

సివిల్స్ టాపర్ యడవెల్లి అక్షయ్ కుమార్ తన యూపీఎస్‌సీ విజయ రహస్యాలతో పాటు సామాజిక బాధ్యత, దేశాభివృద్ధిపై తన లోతైన దృక్పథాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 624వ ర్యాంకు సాధించిన అక్షయ్ కుమార్ కేవలం ఒక సివిల్స్ టాపర్‌గానే కాకుండా, సమాజంపై విస్తృత అవగాహన ఉన్న వ్యక్తిగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. నేరాల నివారణకు కేవలం శిక్షల పెంపు కాకుండా, సామాజిక అధ్యయనాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యూపీఎస్‌సీ అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం, స్థిరత్వం, వ్యక్తిగత ప్రణాళిక గురించి అక్షయ్ కుమార్ మాటల్లో..

'కోచింగ్ అవసరం లేదు.. కానీ గైడెన్స్ తప్పనిసరి'.. UPSC టాపర్‌ IPS అక్షయ్ కుమార్‌ సక్సెస్‌ సీక్రెట్స్‌
UPSC Topper Akshay Kumar
Srilakshmi C
|

Updated on: Aug 21, 2026 | 1:39 PM

Share

UPSC సివిల్స్ టాపర్ IPS యడవెల్లి అక్షయ్ కుమార్ తన సివిల్స్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలోని అనేక గ్రామాల్లో కనీస వైద్య సదుపాయాలు, విద్య, తాగునీరు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా అవి పనిచేయకపోవడం, విద్యుత్తు లేక దీపంలో బతుకుతున్న ప్రజలు ఉన్నారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదని చెప్పారు. తన ఐపీఎస్‌ కల వెనుక ప్రధానంగా ‘సేఫ్ అండ్ సెక్యూర్ లా అండ్ ఆర్డర్’, ‘మహిళా భద్రత’ ఉన్నాయని అన్నారు. భారత జనాభాలో 50% మహిళలు ఉన్నారని, వారికి సరైన భద్రత కల్పించకపోతే ఏ విధంగానూ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదని స్పష్టం చేశారు. ‘సూపర్ పవర్’ గురించి మాట్లాడే ముందు ‘డెవలప్డ్ స్టేట్’ కావాలంటే ముందుగా మహిళల భద్రతను చూసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రతి గంటకు ఒక రేప్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరాల నివారణపై వినూత్న ఆలోచన

అత్యాచారాల వంటి నేరాలపై ప్రజల్లో కోపం, ఆగ్రహం వ్యక్తం కావడం సహజమేనని, అయితే కేవలం శిక్షల పెంపుతో నేరాలు ఆగవని అక్షయ్ కుమార్ వాదించారు. నిర్భయ ఘటన, శక్తి మిల్స్ రేప్ వంటి ఉదాహరణలను ఉటంకిస్తూ, కఠిన శిక్షలు విధించినా కొత్త నేరాలు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. నేరస్థుడిని ఉరితీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, అసలు నేరం ఎందుకు జరుగుతోంది అనే మూలకారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. నేరస్థుడి సామాజిక-ఆర్థిక నేపథ్యం, అతని మానసిక స్థితి, నేరం చేయడానికి దారితీసిన పరిస్థితులు వంటి అంశాలపై మనస్తత్వవేత్తల సమక్షంలో లోతైన పరిశోధన (Sociological Study) చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి సమగ్ర అధ్యయనం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా నివారించవచ్చని అక్షయ్ తన వినూత్న ఆలోచనను పంచుకున్నారు.

యూపీఎస్‌సీ అభ్యర్థులకు మార్గదర్శనం

సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి అక్షయ్ కీలక సలహాలు ఇచ్చారు. ఇంటర్నెట్‌లో లభించే అపరిమిత సమాచారం, సలహాలు గందరగోళానికి దారితీస్తాయని, ఏది చదవాలో, ఏది వదిలేయాలో తెలియక సమయం వృథా అవుతుందని అన్నారు. కోచింగ్ సెంటర్లు తప్పనిసరి కాదని, అయితే సరైన మార్గదర్శకత్వం (Guidance) అవసరమని సూచించారు. నేర్చుకోవడమే కాకుండా, నేర్చుకున్న వాటిలో అనవసరమైన వాటిని వదిలేయడం (Un-learning) కూడా అంతే ముఖ్యమన్నారు. రెండో కీలక అంశం నిలకడ (Consistency) అని చెప్పారు. కొంతమంది రెండు మూడు రోజులు ఉత్సాహంగా చదివి తర్వాత వదిలేస్తారని, అలా కాకుండా నిలకడగా కృషి చేస్తే విజయం సాధించడం ఖాయమని అన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదభావాలను తాను చూడనని, మనిషిలోని విషయానికి మాత్రమే విలువ ఇస్తానని అక్షయ్ అన్నారు. ఈ ఆలోచన తనకు రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమగ్ర దృష్టి, సామాజిక స్పృహ కలిగిన అక్షయ్ కుమార్ వంటి యువకులు సివిల్ సర్వీసెస్‌లోకి వస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఇంటర్వ్యూయర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత ప్రణాళికే కీ రోల్

ప్రిపరేషన్ వ్యక్తిగతమని, ప్రతి అభ్యర్థికి వారి జీవనశైలి, అలవాట్లు, ఆసక్తులు వేర్వేరుగా ఉంటాయని, కాబట్టి ఒకే ప్రణాళిక అందరికీ సరిపోదని అక్షయ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమదైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు. కోచింగ్ కోసం హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, పెన్ను, పేపర్, ఆసక్తి ఉంటే స్టేషన్ ఘన్‌పూర్ వంటి చిన్న గ్రామం నుంచైనా ఏ పరీక్షనైనా సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్ కోసం తాను అనుసరించిన పుస్తకాలు, వనరులను కూడా అక్షయ్ కుమార్ వివరించారు. అవేంటంటే..

ఈ పుస్తకాలు చదవండి

  • పాలిటీ: లక్ష్మీకాంత్, దైనందిన కరెంట్ అఫైర్స్.
  • ఎకానమీ: మృణాల్ యూట్యూబ్ వీడియోలు (తనకు ఎంతో సహాయపడ్డాయని ప్రత్యేకంగా ప్రస్తావించారు).
  • జాగ్రఫీ: సవీంద్ర సింగ్ (ఫిజికల్ జాగ్రఫీ), ఖుల్లర్ (ఇండియన్ జాగ్రఫీ).
  • హిస్టరీ: బిపిన్ చంద్ర (మోడరన్ హిస్టరీ), స్పెక్ట్రమ్ (మోడరన్ హిస్టరీ), తమిళనాడు 11వ తరగతి టెక్స్ట్ బుక్ (మెడీవల్ & ఏన్షియంట్).
  • ఆర్ట్ అండ్‌ కల్చర్: నితిన్ సింఘానియా బుక్‌
  • కరెంట్ అఫైర్స్: ఇన్సైట్స్, బైజూస్, డీసీ ఫర్ ఐఏఎస్ వంటి వెబ్‌సైట్‌లు. ముఖ్యంగా ఇన్సైట్స్‌లో రోజువారీ ప్రశ్నలకు జవాబులు రాయడం ద్వారా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశానని చెప్పారు. మెయిన్స్‌కు కూడా ఈ పుస్తకాలే ఉపయోగపడతాయని, ప్రిలిమ్స్, మెయిన్స్‌లను వేరుగా చూడలేదని తెలిపారు.

Follow Us