AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ

మనం ఎవరినైనా కించపరచడం తేలికే.. కానీ ఆ మాట వల్ల వారి మనసులో కలిగే బాధ, కోల్పోయే నమ్మకం, దెబ్బతినే సంబంధం ఎంత పెద్దదో ముందుగా ఊహించలేం. అందుకే మాటల్లో జాగ్రత్త, స్నేహంలో నమ్మకం, తప్పుల్లో క్షమ ఉండాలి. ఈ జీవిత విలువలను చిన్న పిల్లలకు ఈ కింది కథ రూపంలో చెబితే వారు చిన్నతనం నుంచే ఉన్నతమై స్వభావం అలవరచుకుంటారు..

Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ
Lion And Elephant Story
Srilakshmi C
|

Updated on: Aug 21, 2026 | 6:17 AM

Share

ఒక దట్టమైన అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి. సింహానికి ఏదైనా సందేహం వచ్చినా, సహాయం కావాలన్నా ఏనుగునే సంప్రదించేది. సింహం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఏనుగు మాత్రం సరదా మాటలతో సింహాన్ని నవ్విస్తూ ఉండేది. ఒకరోజు సింహం ఏనుగును అడిగింది.. ‘మిత్రమా! మన గురించి అడవిలోని జంతువులు ఏమనుకుంటున్నాయి?’. ఏనుగు నవ్వుతూ ‘నువ్వు నా ముందు నిలబడితే పర్వతం ముందు పిచ్చుక ఉన్నట్టుగా కనిపిస్తున్నావని అందరూ అంటున్నారు’ అని సరదాగా చెప్పింది.

ఆ మాట సింహానికి నచ్చలేదు. కోపంతో ‘నేను ఈ అడవికి రాజును. నన్ను పిచ్చుకతో పోలుస్తావా? ఇక నుంచి మనం స్నేహితులు కాదు. నన్ను అందరిలాగే ‘మృగరాజు’ అని పిలువు’ అని చెప్పింది. ఏనుగు తన మాట వల్ల స్నేహితుడు బాధపడ్డాడని అర్థం చేసుకుంది. ‘అలాగే మృగరాజా’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత అడవిలో దొంగతనాలు చేస్తున్న ఒక కోతిని నక్క పట్టుకుని సింహం దగ్గరకు తీసుకొచ్చింది. కోతి చేసిన తప్పులకు కోపగించిన సింహం దానికి మరణశిక్ష విధించింది. కోతిని గుహలో బంధించారు. మరుసటి రోజు కోతి స్నేహితుడైన జింక దాన్ని చూడటానికి వచ్చింది. ‘మిత్రమా! దొంగతనాలు చేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను. నా మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అని జింక బాధపడింది.

కోతి కన్నీళ్లతో ‘నిజమే మిత్రమా! నేను నీ మాట వినలేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులను చివరిసారిగా చూడాలని ఉంది. కానీ ఆ కోరిక కూడా నెరవేరదేమో’ అని చెప్పింది. జింకకు కోతి మీద జాలి కలిగింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్లి ‘మృగరాజా! నా మిత్రుడు తన తల్లిదండ్రులను చివరిసారిగా చూడాలనుకుంటున్నాడు. అతన్ని ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి అనుమతించండి. అతను తిరిగి వచ్చే వరకు నేను అతని స్థానంలో చెరసాలలో ఉంటాను’ అని కోరింది. సింహం అంగీకరించింది. కోతి తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్లింది. జింక మాత్రం చెరసాలలో ఉండిపోయింది. రోజులు గడిచాయి. కానీ కోతి తిరిగి రాలేదు. నక్క జింకను చూసి ఎగతాళి చేస్తూ ‘నీ మిత్రుడు నిన్ను మోసం చేశాడు. నువ్వు అతని కోసం ఎందుకు బాధపడుతున్నావు? అని అడిగేది. చివరకు శిక్షించే రోజు వచ్చింది. కోతి రాకపోవడంతో జింకకు శిక్ష విధించాలని సింహం ఆదేశించింది.

జింకను కొండపైకి తీసుకెళ్లారు. శిక్ష అమలు చేయబోతున్న సమయంలో దూరం నుంచి కోతి పరుగెత్తుకుంటూ వచ్చింది. ‘మృగరాజా! ఆలస్యమైనందుకు క్షమించండి. నా తల్లిదండ్రులను చూసి రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు శిక్ష నాకు విధించండి’ అని కోతి వేడుకుంది. అయితే జింక అందుకు ఒప్పుకోలేదు. ‘మృగరాజా! నా కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు. నా మిత్రుడి తల్లిదండ్రులు అతని కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి శిక్ష నాకు విధించి నా మిత్రుడిని విడిచిపెట్టండి’ అని జింక చెప్పింది. కోతి కూడా ‘లేదు మృగరాజా! శిక్ష నాకు విధించండి’ అని పట్టుబట్టింది. వారి నిజమైన స్నేహాన్ని చూసిన సింహం ఆశ్చర్యపోయింది. ఒకరి కోసం మరొకరు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడటం చూసి దాని మనసు మారిపోయింది. ‘మీ ఇద్దరినీ నేను శిక్షించను. మీరు నిజమైన స్నేహితులు. ఇకపై మంచిగా జీవించండి’ అని సింహం చెప్పింది.

ఆ సంఘటన సింహంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఒక చిన్న సరదా మాటను అపార్థం చేసుకుని తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్న విషయం గుర్తొచ్చింది. తన తప్పును తెలుసుకుని సింహం వెంటనే ఏనుగు దగ్గరకు వెళ్లింది. ‘మిత్రమా! నా కోపాన్ని క్షమించు. నీ మాటను సరదాగా తీసుకోవాల్సింది. ఒక చిన్న మాట కోసం మన స్నేహాన్ని దూరం చేసుకోవడం నా తప్పు’ అని సింహం బాధగా చెప్పింది. ఏనుగు చిరునవ్వుతో ‘మిత్రమా! మన స్నేహం కంటే ఏదీ గొప్పది కాదు’ అని చెప్పి సింహాన్ని క్షమించింది. ఆ రోజు నుంచి సింహం, ఏనుగు మళ్లీ మంచి స్నేహితులుగా కలిసిపోయాయి.

నీతి

నిజమైన స్నేహాన్ని చిన్న అపార్థాల వల్ల ఎప్పుడూ కోల్పోకూడదు. కష్టసమయంలో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. మన మాటలు ఎదుటివారి మనసును గాయపరచవచ్చు. సరదాగా అన్న మాట కూడా అవతలి వ్యక్తికి అవమానంగా అనిపిస్తే, మంచి సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే మాట్లాడే ముందు మన మాటల వల్ల ఎదుటివారికి ఎలా అనిపిస్తుందో ఆలోచించాలి. అలాగే, చిన్న అపార్థాలను పెద్దవిగా చేసుకుని స్నేహితులను దూరం చేసుకోవడం మంచిది కాదు. నిజమైన స్నేహంలో తప్పులను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పడం, క్షమించడం చాలా ముఖ్యం. కష్టకాలంలో ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడానికి సిద్ధపడే స్నేహమే నిజమైన స్నేహం.

Follow Us