AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: స్నేహం పేరుతో నమ్మక ద్రోహం.. రెండు ఎద్దుల స్నేహం – తోడేలు కుట్ర కథ

నిజమైన స్నేహం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి స్నేహితుడిని అనుమానించకూడదు. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడి, ఐకమత్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా కుట్రలు స్నేహాన్ని విడదీయలేవు.. నిజమైన నమ్మకమే స్నేహాన్ని ఎప్పటికీ నిలబెడుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు ఈ కింది కథ చెబితే చిన్నతనం నుంచే విలువలతో కూడిన జీవితం అలవరచుకుంటారు..

Moral Story: స్నేహం పేరుతో నమ్మక ద్రోహం.. రెండు ఎద్దుల స్నేహం – తోడేలు కుట్ర కథ
Wolf Deception And Two Bulls Story
Srilakshmi C
|

Updated on: Aug 18, 2026 | 4:00 PM

Share

ఓ అందమైన అడవిలోకి ఒక కొత్త సింహం వచ్చింది. ఆ సింహాన్ని దాని సొంత అడవి నుంచి బయటికి పంపించారు. ఎలాగైనా ఈ అడవిలో తన సత్తా చూపించాలని, అందరినీ భయపెట్టాలని అది నిర్ణయించుకుంది. అదే అడవిలో చందు అనే తెల్ల ఎద్దు, కాలు అనే నల్ల ఎద్దు ఉండేవి. ఆ రెండు ఎద్దులు ఎంతో మంచి స్నేహితులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్లినా కలిసి ఉండేవి. ఒకదానిని విడిచి మరొకటి ఉండేది కాదు. ఒకరోజు అవి రెండూ గోల్డెన్ కొండల వైపు వెళ్తుండగా, దారిలో ఒక కుందేలు క్యారెట్ తింటూ కనిపించింది. కొంచెం దూరంలో ఒక తోడేలు చెట్టు వెనుక దాక్కొని ఉంది. తోడేలు మనసులో, ‘తిను కుందేలా… ఎంత తింటావో తిను. నీ క్యారెట్ అయిపోయిన వెంటనే నువ్వే నాకు ఆహారం!’ అని అనుకుంది.

ఆ మాటలు చందు, కాలు విన్నాయి. వెంటనే అవి కుందేలు దగ్గరకు పరుగెత్తాయి. ‘కుందేలా! త్వరగా పారిపో. నీ మీద తోడేలు దాడి చేయబోతోంది!’ అని అవి హెచ్చరించాయి. ‘ఏంటి? తోడేలా? ఎక్కడుంది?’ అని కుందేలు భయంగా అడిగింది. ‘ఆ చెట్టు వెనుక దాక్కొని ఉంది’ అని చెప్పాయి. కుందేలు చెట్టు వైపు చూసి, ‘ఓరి దేవుడా! ఎంత పెద్ద తోడేలు!’ అని అరిచి అక్కడి నుంచి వేగంగా పారిపోయింది. అప్పుడే తోడేలు ఎద్దుల ముందుకు వచ్చింది. ‘మీరు చాలా పెద్ద తప్పు చేశారు. దీనికి తగిన పరిణామాన్ని తప్పకుండా అనుభవిస్తారు!’ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతసేపటికే అదే సమయంలో కొత్త సింహం అక్కడికి వచ్చింది. బలంగా ఉన్న రెండు ఎద్దులను చూసి దాని కళ్లలో ఆశ కనిపించింది. ‘అద్భుతం! ఎంత బలమైన ఎద్దులు! వీటిలో ఒకదాన్ని చంపితే మూడు రోజులకు సరిపడా ఆహారం దొరుకుతుంది!’ అని అనుకుని గర్జిస్తూ వాటి వైపు పరుగెత్తింది. సింహాన్ని చూసిన ఎద్దులు భయంతో పరుగెత్తడం ప్రారంభించాయి. కొంతదూరం వెళ్లిన తర్వాత కాలు, చందుతో ఇలా అన్నాడు.. ‘మనం ఇలా పరిగెడుతూనే ఉంటే మనలో ఒకరి ప్రాణం తప్పకుండా పోతుంది. దాని కంటే మనిద్దరం కలిసి సింహాన్ని ఎదుర్కోవడం మంచిది’ అని చెప్పడంతో చందు కూడా అంగీకరించాడు.

“అవును. నువ్వు చెప్పింది నిజమే.” అని అవి రెండూ ఒక్కసారిగా ఆగి, సింహం వైపు తిరిగి పరుగెత్తాయి. ఎద్దులు తన వైపు రావడం చూసి సింహం భయపడిపోయింది. ‘అరే! వీళ్లిద్దరికీ పిచ్చా? నాపైకి కలిసి వస్తున్నారు! వీళ్లలో ఒకటి కొమ్ముతో పొడిచినా నా పొట్ట చీలిపోతుంది!’ అని భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఎద్దులు కూడా ఆగిపోయాయి. ‘దేవుడికి ధన్యవాదాలు! ఇవాళ మనం బతికిపోయాం. మనం ఒంటరిగా పారిపోయి ఉంటే ప్రమాదంలో పడేవాళ్లం’ అని అవి అనుకున్నాయి. ఆ రోజు నుంచి కూడా వాటి స్నేహం మరింత బలపడింది. అడవిలోని ప్రతి జంతువు వాటి స్నేహాన్ని మెచ్చుకునేది. ఒకరోజు ఉదయం ఆ తోడేలు కాలు ఇంటికి వెళ్లింది. ‘ఏయ్ కాలు! నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి’. ‘తోడేలు! నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని కాలు అడిగాడు.

తోడేలు మెల్లగా మాట్లాడుతూ, ‘నిన్ను నమ్మి చెబుతున్నాను. నువ్వు ముందు ముందు బాధపడకూడదంటే ఈ విషయం తెలుసుకోవాలి. నేను చందును ఒక ఆవుతో మాట్లాడుతుండగా చూశాను.’ ఒక ఆవుతోనా? ఏ ఆవు? అని కాలు ఆశ్చర్యపోయాడు. ‘అతను ప్రతిరోజూ ఉదయం నిన్ను కలవకముందే ఆ ఆవును కలుస్తాడు. నీకు ఈ విషయం చెప్పలేదా?’ అని అడిగింది. ‘లేదు. నాకు అసలు తెలియదు’ అని చెప్పింది. ‘అదే కాదు.. ఆ ఆవు చందును ఒకరోజు ఇలా అడిగింది. ‘నీకు నేను తప్ప ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా?’ అని. అప్పుడు చందు ‘ఉన్నాడు. ఒక నల్ల ఎద్దు. అతని పేరు కాలు’ అని చెప్పాడు. కాలు శ్రద్ధగా వింటున్నాడు. తోడేలు మరింత విషం నింపుతూ ‘అప్పుడు ఆ ఆవు, ‘నన్ను కూడా నీ స్నేహితుడికి పరిచయం చేయి’ అని అడిగింది. దానికి చందు ఏమన్నాడో తెలుసా?’..

‘ఏమన్నాడు?’ అని కాలు ఆతృతగా అడిగాడు. ‘చందు నిన్ను చూడటానికి చాలా దారుణంగా ఉంటాడని అన్నాడు. అచ్చం చీకటిలా నల్లగా ఉంటాడని, ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించదని అన్నాడు’. కాలు ముఖం మారిపోయింది. తోడేలు అక్కడితో ఆగకుండా, ‘అంతేకాదు. ‘నేను తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కాలుతో ఉంటాను. అవకాశం ఉంటే రోజంతా నీతోనే గడుపుతాను’ అని కూడా అన్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో అతను నీ దగ్గరకు ఆలస్యంగా వస్తున్నాడేమో!’ అని చెప్పింది. కాలు తీవ్రంగా బాధపడ్డాడు. ‘నా గురించి చందు అలా అన్నాడా? ఇంతకాలం అతను నన్ను నిజంగా స్నేహితుడిగా భావిస్తున్నాడని అనుకున్నాను. ఇక అతని మొహం కూడా చూడను!’ అని అనింది. దీంతో తోడేలు లోపల ఆనందపడింది.

‘దాని గురించి బాధపడకు. నాకు ఒక పెద్ద నల్ల ఎద్దు తెలుసు. అది కూడా నీలా నల్లగా ఉంటుంది. దానితో ఎవరూ స్నేహం చేయరు. మీ ఇద్దరూ మంచి స్నేహితులు కావచ్చు.’ అతను ఎక్కడ ఉంటాడు? నన్ను అతనికి పరిచయం చేస్తావా? ‘తప్పకుండా. సాయంత్రం గోల్డెన్ కొండల దగ్గరకు తీసుకెళ్తాను. అక్కడ ఒక గుహలో ఉంటాడు’ అని చప్పగానే కాలు వెంటనే అంగీకరించాడు. ‘సరే. ఇవాళ నేను చందు లేకుండా గడుపుతాను’ అని చెప్పింది. ఈ మాట విని తోడేలు సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ కాలు మనసులో మాత్రం ఒక సందేహం మొదలైంది. ;చందు నిజంగా నా గురించి అలా అన్నాడా? లేక ఈ తోడేలు ఏదైనా కుట్ర చేస్తుందా?’ అని ఆలోచించాడు.

సాయంత్రం తోడేలు మళ్లీ కాలు దగ్గరకు వచ్చింది. ‘పద! నీకు కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తాను’ అని చెప్పింది. కాలు కూడా దానితో బయలుదేరాడు. తోడేలు అతన్ని గోల్డెన్ కొండల వైపు తీసుకెళ్లింది. చాలా దూరం వెళ్లిన తర్వాత పెద్ద పెద్ద గడ్డి మధ్యలో ఒక గుహ కనిపించింది. ‘ఇంకెంత దూరం? నేను చాలా అలసిపోయాను’ అని కాలు అడిగాడు. ‘అదిగో! ఆ గుహ కనిపిస్తుందా? దాని లోపలే నీ కొత్త స్నేహితుడు ఉంటాడు’ అని చెప్పింది. కాలు ఆశ్చర్యపోయాడు. ‘ఏంటి? ఒక ఎద్దు గుహలో ఉంటుందా? అది ఎలా సాధ్యం?’ అప్పుడే తోడేలు ముఖంలో కుట్రతో కూడిన నవ్వు కనిపించింది. అది గుహ వైపు తిరిగి, ‘బయటికి రా నేస్తమా! ఎద్దు వచ్చేసింది నీ కోసం!’ అని గట్టిగా అరిచింది. ఆ మాటలు వినగానే గుహలో నుంచి కొత్త సింహం బయటకు వచ్చింది. సింహాన్ని చూసిన కాలు షాక్‌కు గురయ్యాడు. సింహం మాత్రం ఆనందంగా, ‘అద్భుతం తోడేలు! నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు’ అని చెప్పింది. కాలు వెంటనే అర్థం చేసుకున్నాడు. ‘ఇదంతా ఏంటి? నన్ను మోసం చేశావు కదా?’ అని బాధపడింది. తోడేలు నవ్వుతూ, ‘అవును! నేను నిన్ను మోసం చేశాను. ఆ రోజు నువ్వూ, చందూ కలిసి కుందేలును కాపాడటం వల్ల నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది. అందుకే ఈ సింహంతో కలిసి నీ మీద ఈ కుట్ర పన్నాను. ఇప్పుడు నువ్వే సింహానికి ఆహారం!’ అని చెప్పింది. కాలు భయంతో నిలబడిపోయాడు.

సింహం అతని వైపు దూసుకొచ్చింది. ‘ఏమైంది? చాలా భయంగా ఉందా? పారిపోవడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదా?’ అని సింహం ఎగతాళి చేసింది. సింహం కాలుపై దూకబోతున్న సమయంలో.. ఒక్కసారిగా చందు అక్కడికి వచ్చాడు! చందు సింహాన్ని తన కొమ్ములతో గట్టిగా ఢీకొట్టాడు. సింహం దూరంగా ఎగిరి పడిపోయింది. ‘ఓరి దేవుడా! చచ్చిపోయాను! ఇది ఎలా సాధ్యమైంది?’ అని సింహం భయపడిపోయింది. కాలు ఆశ్చర్యంగా చందును చూశాడు. ‘చందూ! నువ్విక్కడ ఏం చేస్తున్నావు?’ అని అడిగింది. చందు నవ్వుతూ, ‘అసలు నువ్వు ఏమనుకున్నావు? తోడేలు చెప్పిన మాటలన్నీ నేను చేసినవే అని నమ్ముతానని అనుకున్నావా?’ అని అడిగింది. కాలు మౌనంగా ఉన్నాడు. చందు కొనసాగించాడు ‘తోడేలు నీ దగ్గరకు వచ్చి అలా చెప్పిన వెంటనే నువ్వు నా దగ్గరకు వచ్చావు. జరిగిన విషయమంతా నాకు చెప్పావు. అప్పుడే మాకు దాని మీద అనుమానం వచ్చింది’. మరి? ఇంతకీ తోడేలు అసలు ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. అందుకే నువ్వు దానితో కలిసి ఇక్కడికి వస్తానని ఒప్పుకున్నావు. నేను మాత్రం మీ వెనకాలే రహస్యంగా వచ్చాను. కాలు కళ్లలో ఆనందం కనిపించింది. ‘అంటే… నువ్వు నా గురించి ఒక్క చెడ్డ మాట కూడా అనలేదా?’ అని అడగ్గా.. ‘అసలు అనలేదు! నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నీ గురించి ఎవరైనా ఏదైనా చెప్పినా నేను వెంటనే నమ్మను’

అంతలో తోడేలు, సింహం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాయి. కానీ చందు, కాలు వాటిని వెంబడించారు. ఆ రెండూ అడవి నుంచి పారిపోయేంత వరకు ఎద్దులు వాటిని వదల్లేదు. చివరికి కాలు చందుతో ఇలా అన్నాడు ‘ఇప్పటి నుంచి మన స్నేహం మరింత బలంగా ఉండాలి. ఎవరెన్ని కుట్రలు చేసినా మనిద్దరినీ విడదీయలేరు’. చందు నవ్వుతూ ‘అవును! నిజమైన స్నేహం అంటే నమ్మకం. మాటలు విని స్నేహితుడిని అనుమానించడం కాదు’. అలా చందు, కాలు ఎప్పటిలాగే కలిసిమెలిసి జీవించాయి. వాటి స్నేహాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ మరోసారి మెచ్చుకున్నాయి.

నీతి

నిజమైన స్నేహం నమ్మకంపై నిలబడుతుంది. ఇతరులు చెప్పే మాటలను వెంటనే నమ్మకుండా, నిజానిజాలు తెలుసుకోవాలి. ఐకమత్యంగా ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు.

Follow Us