AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు

యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్ష కోసం నాలుగుసార్లు ప్రయత్నించిన 26 ఏళ్ల అభ్యర్థి చివరికి తన ఏళ్ల నాటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను కేవలం రూ.464కు కబాడీకి అమ్మేశారు. 2023, 2024, 2025లో వరుసగా మూడుసార్లు మెయిన్స్‌కు హాజరైన ఆయన.. తాజా ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశలోనే విఫలమయ్యారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి సివిల్స్‌ కోసం చేసిన ప్రయాణానికి ముగింపు పలుకుతూ భావోద్వేగ పోస్టు పెట్టారు. పుస్తకాల ద్వారా వచ్చిన రూ.464ను ఆలయంలో విరాళంగా ఇచ్చిన ఆయన.. ‘ఇక మరోసారి లేదు’ అంటూ తన కన్నీటి గాథను నెటిజన్లతో పంచుకున్నాడు..

3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు
UPSC Aspirant Heartbreaking Story
Srilakshmi C
|

Updated on: Aug 26, 2026 | 10:30 AM

Share

యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు ఏళ్ల తరబడి సిద్ధమై.. చివరికి తన పుస్తకాలను కిలోల చొప్పున తూకం వేసి కేవలం రూ.464కు కబాడీవాలాకు అమ్ముకున్న ఓ 26 ఏళ్ల అభ్యర్థి భావోద్వేగ అనుభవం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నాలుగుసార్లు సివిల్స్‌ పరీక్షకు ప్రయత్నించి.. 2023, 2024, 2025లో వరుసగా మూడు సార్లు మెయిన్స్‌కు హాజరయ్యారు. అయితే తాజా ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశలోనే విఫలమయ్యారు. దీంతో సివిల్స్‌ ప్రయాణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.

పుస్తకాలు కాదు.. తన జీవితంలో ఓ భాగం

తన అనుభవాన్ని రెడిట్‌ పోస్టులో పంచుకున్న అభ్యర్థి.. తాను ప్రారంభించిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి లక్ష్మీకాంత్‌ వరకు అన్నింటినీ కబాడీకి విక్రయించినట్లు తెలిపారు. మొదటిసారి రాసిన టెస్ట్‌ పేపర్లు, మాక్‌ టెస్టులు, అనాలిసిస్‌ షీట్లు, చేతిరాత నోట్స్‌ ఇలా ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలను తన పుస్తకాలతో పాటు తూకం వేసినట్లు వివరించారు. తనకు ఆ పుస్తకాలు కేవలం చదువు సామగ్రి కాదని.. తెల్లవారుజామున 4 గంటలకు చేసిన చదువులు, మెయిన్స్‌ పరీక్షల కోసం రాసిన సమాధానాలు, పదేపదే చేసిన తప్పుల సవరణలు, ఒక్క మార్కు కోసం చేసిన ప్రయత్నాలు, ఆత్మన్యూనతతో పోరాటం, మళ్లీ మళ్లీ ప్రయత్నించాలనే పట్టుదలకు అవి గుర్తులని చెప్పారు. సివిల్స్‌ సాధించాలనే ఆశతో 2022లో మంచి జీతంతో వచ్చే ఉద్యోగాన్ని కూడా ఆయన స్వీకరించలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా తన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని నమ్మి పూర్తిగా యూపీఎస్సీ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టారు. ఈ ప్రయాణంలో నాలుగేళ్లుగా కొనసాగిన వ్యక్తిగత సంబంధం కూడా ముగిసిందని వెల్లడించారు. అయినప్పటికీ ప్రతిసారీ మళ్లీ మొదలుపెట్టి, ‘మరోసారి ప్రయత్నిద్దాం’ అనే పట్టుదలతో ముందుకు సాగినట్లు చెప్పారు. అయితే చివరి పుస్తకం కూడా కబాడీ తూకంలో పడినప్పుడు.. ఏళ్ల తరబడి తాను నిర్మించుకున్న వ్యక్తిత్వం, చేసిన కృషి అన్నీ కిలోల బరువుగా మారిపోయినట్లు అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడికి రూ.464.. ‘ఇక మరోసారి లేదు’

అన్ని పుస్తకాలను కబాడీవాలాకు ఇచ్చిన తర్వాత ఆయనకు రూ.464 మాత్రమే లభించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి మరో రూ.100 లేదా రూ.200 కోసం బేరం చేసుకోవచ్చని సూచించారు. కానీ అప్పటికే ఆ డబ్బు తనకు పెద్దగా ప్రాధాన్యం అనిపించలేదని అభ్యర్థి తెలిపారు. తనకు ఆ పుస్తకాల నుంచి కావాల్సింది ఎప్పటికీ దక్కలేదని, అలాంటప్పుడు మరో వంద లేదా రెండొందల రూపాయలు ఎక్కువ వచ్చినా పెద్దగా ఏం మారుతుందని ఆయన పేర్కొన్నారు. తర్వాత వచ్చిన రూ.464ను ఆయన ఆలయంలో విరాళంగా ఇచ్చారు. అదృష్టం కోసం లేదా పుణ్యం కోసం కాదని, ఇకపై మరో ప్రయత్నం చేయబోనని దేవుడికి నిశ్శబ్దంగా చెప్పేందుకే ఆ డబ్బును సమర్పించినట్లు తెలిపారు. ఆయన పోస్టు యూపీఎస్సీ అభ్యర్థులు, మాజీ అభ్యర్థులను తీవ్రంగా కదిలించింది. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో ఎదురయ్యే ఒత్తిడి, వ్యక్తిగత త్యాగాలు, పదేపదే విఫలమైనా మళ్లీ ప్రయత్నించే మానసిక పరిస్థితిని తాము కూడా అనుభవించామని పలువురు కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

Sold all my UPSC books and mock tests to the kabadiwala yesterday. Here’s what it felt like. by u/Sol-Invictus-10 in UPSC

‘నీ ప్రయాణం మాదిరిగానే నా ప్రయాణం కూడా ఉంది. యూపీఎస్సీ ప్రిపరేషన్‌ను అనుభవించిన వారికి మాత్రమే ఈ బాధ అర్థమవుతుంది’ అంటూ ఓ యూజర్‌ స్పందించారు. మరో వ్యక్తి ఆయన చివరి మాటలు తీవ్రంగా తాకాయని, జీవితంలో లక్ష్యాలను చేరుకునేందుకు ధైర్యం, శక్తి లభించాలని ఆకాంక్షించారు. మరికొందరు.. సివిల్స్‌ ఒక్కటే జీవితం కాదని, అనుభవాల నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. చివరికి పరీక్షలో విజయం సాధించకపోయినా, ఇన్నేళ్ల ప్రయాణం ఆయన జీవితంలో ఒక అనుభవంగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.

Follow Us