తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన చిన్మయ్ సుతార్..!
రంజీ ట్రోఫీలో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (Chinmay Sutar) సంచలనం సృష్టిస్తున్నాడు. నాగాలాండ్‌పై ఏకంగా 400 పరుగులు చేసిన ఈ 29 ఏళ్ల బ్యాటర్.. ఇప్పుడు మేఘాలయపై మరో శతకం బాదాడు. తొలి నాలుగు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు చేసి, 100 ఏళ్ల నాటి విల్ పోన్స్‌ఫోర్డ్ రికార్డును అధిగమించాడు.

కొద్ది రోజుల క్రితం చిన్మయ్ సుతార్ రంజీ ట్రోఫీ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. నాగాలాండ్‌పై 517 బంతులు ఎదుర్కొని అజేయంగా 400 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. రంజీ ట్రోఫీలో 400 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా సుతార్ చరిత్రలో నిలిచాడు.
215 బంతుల్లో 125 పరుగులు..
400 పరుగుల భారీ ఇన్నింగ్స్ తర్వాత కూడా సుతార్ జోరు తగ్గలేదు. నడియాద్‌లో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 215 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఇది అతని వరుసగా రెండో శతకం కావడం విశేషం.
విల్ పోన్స్‌ఫోర్డ్‌ను వెనక్కి నెట్టిన సుతార్..
తొలి నాలుగు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో సుతార్ ఏకంగా 659 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ విల్ పోన్స్‌ఫోర్డ్ (Bill Ponsford) పేరిట ఉన్న శతాబ్దం నాటి రికార్డును అధిగమించాడు. పోన్స్‌ఫోర్డ్ తన తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 616 పరుగులు చేశాడు.
రంజీలో అత్యధిక స్కోరు ఇంకా భౌసాహెబ్ నింబాల్కర్ పేరిటే..
రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మహారాష్ట్రకు చెందిన భౌసాహెబ్ నింబాల్కర్ (Bhausaheb Nimbalkar) పేరిట ఉంది. 1948-49 సీజన్‌లో కాఠియావార్‌పై ఆయన అజేయంగా 443 పరుగులు చేశాడు. సుతార్ 400 పరుగులతో ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400 పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా కూడా నిలిచాడు.
అవకాశం దక్కగానే రికార్డుల మోత..
చిన్మయ్ సుతార్ ముంబై క్రికెట్ సర్క్యూట్‌లో ఎదిగిన బ్యాటర్. అయితే ఎర్ర బంతి క్రికెట్‌లో ముంబై తరఫున రెగ్యులర్ అవకాశాలు రాకపోవడంతో 2026-27 సీజన్‌కు ముందు మిజోరం జట్టులో చేరాడు. ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో మణిపూర్‌పై 35, 99 పరుగులు చేశాడు. 99 వద్ద రనౌట్ కావడంతో సెంచరీ మిస్ అయింది. ఆ తర్వాత నాగాలాండ్‌పై 400, ఇప్పుడు మేఘాలయపై 125 పరుగులతో తన రాకను ఘనంగా చాటుకున్నాడు.
