Tulip Garden: నేలమీద పువ్వుల ఇంద్రధనస్సుని చూడాలనుకుంటున్నారా.. తులిప్ గార్డెన్ కు చేరుకోండి.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే..
భూతల స్వర్గం కాశ్మీర్ చాలా అందమైన ప్రదేశం. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ అందాలను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఏప్రిల్ నెలలో ఇక్కడ సందర్శించడం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ శ్రీనగర్‌లో ఉంది. ఈ తులిప్ పువ్వుల అందాలను చూసేందుకు పర్యాటకుల కోసం 1 నెల రోజుల పాటు తెరిచి ఉంచుతున్నారు.

మీరు ప్రకృతి ప్రేమికులైతే.. రంగురంగుల పూల తోటలను చూడడం ఇష్టమైతే.. మీకు ఒక గుడ్ న్యూస్. కాశ్మీర్ లోయలో ఉన్న అందమైన నగరం శ్రీనగర్ మరింత అందంగా మారనుంది. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఈ సంవత్సరం మార్చి 26, 2024 నుంచి సాధారణ ప్రజల సందర్శనం కోసం తెరవనున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ తోట అందాన్ని ఆస్వాదించడానికి.. తులిప్ పండుగలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తారు. శ్రీ నగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ప్రపంచంలోని అత్యంత అందమైన తోటలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
స్వర్గంలా కనిపించడమే కాదు.. భూతలం మీద ఇంద్రధనస్సులా కనిపిస్తూ వేలకొద్దీ రంగురంగుల తులిప్ పువ్వులు వికసిస్తాయి. మీరు ఈ సంవత్సరం మీ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు సందర్శించే పర్యాటక ప్రాంతాల జాబితాలో తులిప్ గార్డెన్‌ను చేర్చుకోండి. తులిప్ గార్డెన్ ప్రత్యేకతలు, ట్రిప్ ప్లానింగ్, టికెట్ బుకింగ్, అక్కడికి సందర్శించడానికి ఉత్తమ సమయం గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు తెలుసుకుందాం..
తులిప్ గార్డెన్ లక్షణాలు
ఈ తోట ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట, ఇది 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ 17 లక్షలకు పైగా తులిప్ పువ్వులు, 75 కంటే ఎక్కువ రకాల తులిప్‌లను చూడవచ్చు. ఈ తోట దాల్ సరస్సు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి జబర్వాన్ కొండల అందమైన దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ మంచు పర్వతాలు, తెల్లటి నురుగుతో పాల సంద్రంగా కనిపించే సరస్సు వంటి అనేక అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్ నెలల్లో తులిప్ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా పర్యాటకుల కోసం అనేక కార్యకలాపాలను, కార్యక్రమాలను నిర్వహిస్తారు. తులిప్స్ పువ్వులతో పాటు, అనేక రకాల డాఫోడిల్స్, హైసింత్స్, నార్సిసస్ వంటి అనేక రకాల ఇతర విదేశీ పువ్వులను ఇక్కడ చూడవచ్చు.
తులిప్ గార్డెన్ సందర్శించడానికి ఉత్తమ సమయం
శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ ప్రతి సంవత్సరం 1 నెల మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే తులిప్ పువ్వుల జీవిత కాలం చాలా తక్కువ. ఈ తోట సాధారణంగా మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు తెరిచి ఉంటుంది. ఎవరైనా పూర్తిగా వికసించిన తులిప్ పువ్వులను చూడాలనుకుంటే మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారం మధ్య అక్కడికి వెళ్లడం ఉత్తమం.
సమయం.. టిక్కెట్లు
తులిప్ గార్డెన్ ను రోజూ ఉదయం 9 గంటలు తెరుస్తారు. సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ గార్డెన్ ను సందర్శించేందుకు టికెట్ ధర చెల్లించాల్సి ఉంది. పెద్దలకు రూ. 75 , పిల్లలకు రూ. 30. టికెట్ ధర ఉండవచ్చు.
శ్రీనగర్ తులిప్ గార్డెన్ ఎలా చేరుకోవాలంటే
ఇక్కడికి చేరుకోవడానికి శ్రీనగర్ కు సమీప విమానాశ్రయం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం (SXR), ఇది దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం నుంచి తులిప్ గార్డెన్ 18 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి టాక్సీ లేదా స్థానిక క్యాబ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అదే రైలులో వెళ్ళాలనుకుంటే శ్రీనగర్ నుంచి 270 కి.మీ దూరంలో ఉన్న జమ్మూ తావి రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సులో శ్రీనగర్ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే సొంత వాహనంలో వెళ్లాలనుకున్నా, లేదా బస్సులో ప్రయాణించాలనుకుంటే జాతీయ రహదారి-44 ద్వారా శ్రీనగర్‌కు సులభంగా చేరుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..