స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో కొత్త ముప్పు.. యువతలో వేగంగా పెరుగుతున్న ఆ వ్యాధి
స్మార్ట్‌ఫోన్‌లు నేటి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది మొబైల్ ఫోన్‌లతోనే గడుపుతున్నారు. అయితే ఈ అలవాటు ఇప్పుడు యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా బెంగళూరులో ‘టెక్స్ట్ నెక్’ లేదా ‘టెక్ నెక్’ అనే సమస్య వేగంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

నిరంతరం తల కిందకు వంచి మొబైల్ ఫోన్ చూడటం వల్ల మెడ వెన్నెముకపై అధిక ఒత్తిడి పడుతోంది. దీనివల్ల మెడ కండరాలు, స్నాయువులు, నరాలు దెబ్బతిని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. గతంలో ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగులు లేదా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు టీనేజర్లు, కళాశాల విద్యార్థుల్లో కూడా ఎక్కువగా నమోదవుతోంది.
రోజుకు పలువురు యువకులు ఆసుపత్రుల బాట
వైద్యుల సమాచారం ప్రకారం, బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఓపీడీలలో ప్రతిరోజూ రెండు నుంచి మూడు టెక్స్ట్ నెక్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత విద్య, ఉద్యోగాలు, వినోదం అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో స్క్రీన్ టైమ్ గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం ఇప్పుడు యువత ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఎలా మొదలవుతుంది ఈ సమస్య?
మొదట్లో మెడ నొప్పి, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా ఈ నొప్పి భుజాల వరకు వ్యాపిస్తుంది. అనంతరం తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి మరింత తీవ్రమైతే మెడలోని నరాలపై ఒత్తిడి పెరిగి చేతుల్లో తిమ్మిరి, బలహీనత, సూది గుచ్చినట్లు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరమయ్యేంత తీవ్ర స్థితికి చేరుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ యువ ఐటీ ఉద్యోగి నిరంతర స్క్రీన్ వినియోగం కారణంగా చేతుల బలాన్ని కోల్పోయి చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.
నోమోఫోబియా, డూమ్‌స్క్రోలింగ్ ప్రధాన కారణాలు
మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితిని ‘నోమోఫోబియా’గా, గంటల తరబడి సోషల్ మీడియా లేదా వీడియోలను నిరంతరం చూస్తూ ఉండే అలవాటును ‘డూమ్‌స్క్రోలింగ్’గా పిలుస్తారు. ఈ రెండు అలవాట్లు టెక్స్ట్ నెక్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చాలామంది నిద్రపోయే ముందు కూడా మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి సమస్య మరింత ఎక్కువవుతోంది. స్క్రీన్ సమయాన్ని తగ్గించకపోవడం చికిత్సకు కూడా అడ్డంకిగా మారుతోంది.
నివారణకు ఏం చేయాలి?
టెక్స్ట్ నెక్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ, సరైన శరీర భంగిమ, మెడ వ్యాయామాల ద్వారా నియంత్రించవచ్చు. మొబైల్ ఫోన్‌ను ఎప్పుడూ కంటి స్థాయిలో ఉంచుకోవడం, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మెడకు విశ్రాంతి ఇవ్వడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ పరికరాల వినియోగం అవసరమే అయినప్పటికీ, వాటి వాడకంలో పరిమితులు పాటించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన మెడ, నరాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే యువత స్క్రీన్ టైమ్‌ను నియంత్రించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.




