Sitting Too Much: ఎక్కువసేపు కూర్చోవడం ఎంత ప్రమాదమో తెలుసా.. ! తెలియకుండానే 19 వ్యాధుల బారిన పడే ప్రమాదం
ఉద్యోగ నిర్వహణ కోసమో.. లేక వివిధ కారణాలతో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్న వారి సంఖ్య రోజురోజుకీ అధికం అవుతోంది. అయితే ఇలా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధకులు చెబుతున్నారు. అయోవా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం గంటల తరబడి కూర్చుని ఉండడం.. వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో 19 వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇది ధూమపానం కంటే ప్రమాదకరం.

గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తూ.. ఎలాంటి వ్యాయామం చేయకపోతే అది ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. ఇది ధూమపానం వలె శరీరానికి హానికరం. అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇటీవలి పరిశోధన ప్రకారం గంటల తరబడి కూర్చుని శారీరక పని చేయని వ్యక్తులు మధుమేహంతో సహా 19 వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని తెలుస్తుంది. అయితే వారానికి కనీసం 150 నిమిషాలు ఏదైనా శారీరక శ్రమ చేసే వారికి ఈ 19 దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
అయోవా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనం 7,000 మందికి పైగా రోగుల డేటా ఆధారంగా రూపొందించబడింది. వారు వారి శారీరక శ్రమ స్థాయి గురించి సమాచారం ఇచ్చారు. గంటల తరబడి కూర్చుని పనిచేసే వారి శరీరంలో ధూమపానం లాంటి ప్రభావాలు కనిపించాయి. ఈ వ్యక్తులు టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, ఊబకాయం, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఇన్సులిన్ నిరోధకత, కీళ్లలో దృఢత్వం, వెన్నెముక సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, కొవ్వు కాలేయం, మూత్రపిండాల వ్యాధి, బలహీనతతో బాధపడుతున్నారు. వీరిలో కొందరికి ఈ సమస్యలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలున్నాయి. అయితే గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయని వారికి లేదా.. పని చేస్తున్నా అందుకు తగిన శరీరానికి తగినంత శారీరక శ్రమ.. వ్యాయామం చేసే వారికి ఇటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పాలి.
వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు ప్రజలకు చెప్పాలని కూడా పరిశోధన సూచించింది. ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం లేదా శరీరం సాగదీయడం వంటి సాధారణ తేలికపాటి కార్యకలాపాలు నిశ్చల జీవనశైలి ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎవరైనా గంటల తరబడి ఒకే చోట కూర్చున్నప్పటికీ.. వీరు వ్యాయామం చేయడం తప్పనిసరి అని పరిశోధన చెబుతోంది. మధ్యలో విరామం తీసుకోవడం, నడవడం, కాళ్ళు, చేతులు సాగదీయడం చాలా ముఖ్యం.
వ్యాయామం ఔషధం వలె ప్రయోజనకరం
అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వ్యాధులను నివారించడానికి వ్యాయామం అవసరమని చెబుతోంది. వ్యాయామం ఔషధం అని వారు అంటున్నారు. ఎవరైనా ఎక్కువ సమయం కూర్చుని ఉద్యోగం చేస్తుంటే.. ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు విరామం తీసుకొండి. అప్పుడప్పుడు నడవండి లేదా స్ట్రెచింగ్ చేయండి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయండి, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ లేదా యోగా కూడా చేయవచ్చు. ఆఫీసులో కూర్చున్నప్పుడు సరైన భంగిమను అడాప్ట్ చేసుకోండి. వీలైతే స్టాండింగ్ డెస్క్ ఉపయోగించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి








