AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fertility: నిద్రకు, తండ్రి కావడానికి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు

అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. నిద్రకు పురుషుల్లో సంతానోత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. నిద్ర మరీ తక్కువైనా, ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యతపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చైనాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి...

Fertility: నిద్రకు, తండ్రి కావడానికి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
Men Sleep
Narender Vaitla
|

Updated on: May 25, 2024 | 2:58 PM

Share

మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అందుకే కచ్చితంగా రోజు సరిపడ నిద్ర ఉండాలని సూచిస్తుంటారు. రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం త్వరగా నిద్రలేవాలని సూచిస్తుంటారు. నిద్రలేమి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక సమస్యలతో పాటు, మానసిక సమస్యలకు కూడా నిద్రలేమి కారణమవుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.

అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. నిద్రకు పురుషుల్లో సంతానోత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. నిద్ర మరీ తక్కువైనా, ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యతపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చైనాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు.

ఆ తర్వాత వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోయినట్లు గుర్తించారు. దీంతో నిద్రకు, వీర్య కణాల నాణ్యతకు మధ్య ఉన్న సంబంధం ఉందని గుర్తించారు. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం వల్ల వీర్య కణాల కదలికలను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.

సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే నిద్రపోవాలని సూచిస్తున్నారు. అలాగే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లను పడుకునే గంట ముందే క్లోజ్‌ చేయాలని చెబుతున్నారు. పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, పడుకునే సమయంలో వదులుగా ఉండే దుస్తులు ధరించడం వంటివి చేయడం వల్ల మంచి నిద్రతోపాటు వీర్య కణాల నాణ్యత పెరుగుతుందని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..