AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ పొరపాట్లు చేస్తున్నట్టే!

ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గాలని ఫిట్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్తూ, వర్కౌట్లు చేస్తూ తెగకష్టపడిపోతున్నారు. కానీ బరువు మాత్రం తగ్గట్లేదు. మీరూ ఇదే సమస్యను ఫేస్ చేస్తున్నారా. అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీరు చేసే కొన్ని తప్పుల కారణంగా మీరు వర్కౌట్స్ చేసినా బరువు తగ్గలేకపోతున్నారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం పదండి.

జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ పొరపాట్లు చేస్తున్నట్టే!
Weight Loss Mistakes
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 5:40 PM

Share

చాలామంది బరువు తగ్గాలని గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్‌లో చెమట చిందిస్తారు. రన్నింగ్, యోగా అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ, అద్దంలో చూసుకుంటే మాత్రం శరీరంలో ఎలాంటి మార్పు కనిపించదు. అదేంటి.. నేను ఇంత కష్టపడుతున్నా కదా మరి బరువు ఎందుకు తగ్గడం లేదు? అని చాలామంది మదనపడుతుంటారు. అయితే వ్యాయామం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన వెయిట్ లాస్ ప్రయాణాన్ని అడ్డుకుంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈరోజు ఎక్కువే వర్కౌట్ చేశాను.. రెండు ఇడ్లీలు ఎక్కువే తింటాను అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు ఎంత వ్యాయామం చేసినా, తీసుకునే క్యాలరీల పరిమాణం ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం అసాధ్యం. వర్కౌట్ చేసిన తర్వాత ఆకలి వేయడం సహజం, కానీ ఆ సమయంలో జంక్ ఫుడ్ లేదా అధిక పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే మీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం.

రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచి, కొవ్వు కణాలను నిల్వ చేసేలా చేస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల మెటబాలిజం నెమ్మదిస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లవు. పైగా శరీరానికి దాహం వేసినప్పుడు అది ఆకలిగా తప్పుగా భావించి మనం ఎక్కువగా తినేలా చేస్తుంది. అందుకే వర్కౌట్ చేసే సమయంలోనే కాకుండా రోజంతా సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

ప్రతిరోజూ ఒకే రకమైన వ్యాయామం చేయడం వల్ల శరీరం దానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల క్యాలరీలు కరగడం తగ్గుతుంది. అందుకే కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి మార్చి మార్చి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. నిరంతరం ఆందోళన చెందడం లేదా పని ఒత్తిడి వల్ల కూడా బరువు తగ్గరు. ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా వంటివి అలవాటు చేసుకోండి.

NOTE: బరువు తగ్గడం అనేది కేవలం ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన ఆహారం, తగినంత విశ్రాంతి ఉంటేనే మీరు కోరుకున్న ఫిట్ బాడీని సాధించగలరు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us