వర్షాకాలంలో ఇలా చేస్తే చాలు.. పాములు మీ ఇంట్లోకి రమ్మన్నా రావు..!
వర్షాకాలం రాగానే పాముల బెడద ఎక్కువవుతుంది. ఇంటి తోటల్లో, పొదల్లో దాక్కుని ఎప్పుడైనా బయటికి రావచ్చు. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. కానీ ఆందోళన అవసరం లేదు. కొన్ని సులభమైన సహజ చిట్కాలు పాటిస్తే పాముల సమస్య నుంచి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

వర్షాకాలం మొదలైతే చాలు.. పాముల సమస్య కూడా ఎక్కువవుతుంది. బయట నడిచినా, ఇంట్లో ఉన్నా.. ఎప్పుడు ఏ మూల నుంచి వస్తాయో తెలియక ప్రజలు భయపడుతుంటారు. ఈ కష్టమైన పరిస్థితుల్లో పాముల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ 10 సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
క్లీన్‌గా ఇంటి పరిసరాలు
వర్షాకాలంలో పాములు పొడిగా ఉండే చోటు కోసం వెతుకుతాయి. అందుకే అవి ఇంటి తోటల్లోకి లేదా ఇంట్లోకి వస్తాయి. ఇంటి బయట పొదలు, ఆకులు, చెత్త, చెక్క ముక్కలు పేరుకుపోకుండా చూసుకోండి.
గడ్డిని కత్తిరించండి
మీ ఇంట్లో తోట ఉంటే.. గడ్డిని పెరగనివ్వకుండా కత్తిరిస్తూ ఉండండి. దీని వల్ల పాములకు దాక్కునే చోటు ఉండదు.
ఎలుకలను కంట్రోల్ చేయండి
పాములకు ఎలుకలు ముఖ్యమైన ఆహారం. ఎక్కడ ఎలుకలు ఎక్కువగా ఉంటాయో.. అక్కడికి పాములు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎలుకలను ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి.
గోడల పగుళ్లను మూసేయండి
ఇంటి గోడలు, నేలలో పగుళ్లు ఉంటే పాములు వాటిలో నుంచి సులభంగా లోపలికి వస్తాయి. వెంటనే వాటిని సిమెంట్ లేదా ఇతర పదార్థాలతో మూసేయండి.
కిటికీలు, తలుపులు
ముఖ్యంగా కింద అంతస్తులో ఉన్నవారు వర్షాకాలంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచవద్దు. వాటికి వలలు వేయండి. మురుగు నీరు పోయే పైపులకు కూడా వలలు పెడితే పాములు, పురుగులు లోపలికి రాకుండా ఉంటాయి.
ఫినైల్, ఉప్పు వాడండి
ఫినైల్ వాసన పాములకు అస్సలు నచ్చదు. ఫినైల్ లేదా ఉప్పు కలిపిన నీటిని ఇంటి బయట, లోపల పిచికారీ చేయండి. ఆ నీటితో ఇల్లు తుడిచినా మంచి ఫలితం ఉంటుంది.
సహజ స్ప్రేలు
కాకరకాయ ఆకులను రుబ్బి నీటిలో కలిపి స్ప్రే చేయండి. లేదా వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయండి. ఈ సహజ ద్రావణాలు పాములను దూరం చేస్తాయి.
వేప, ఆవ నూనెలు
వేపనూనె లేదా ఆవనూనెను ఇంటి ద్వారం దగ్గర గోడల కింద కాలువల్లో పోయండి. ఈ వాసనలకు పాములు దరిచేరవు.
తోటలో లైట్లు పెట్టండి
మీ ఇంటి దగ్గర మొక్కలు ఎక్కువగా ఉంటే రాత్రి పూట పూర్తిగా చీకటి ఉండనివ్వవద్దు. ఒకటి రెండు బల్బులు వేసి వెలుతురు ఉండేలా చూసుకోండి. పాములు చీకటి ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి వెలుతురు ఉంటే రావు.
పెంపుడు జంతువులు
కొన్ని రకాల కుక్కలు, పిల్లులు, కోళ్లు పాములను దూరం చేస్తాయి. వాటి వాసన పాములకు ఇష్టం ఉండదు. కాబట్టి వీటిని పెంచుకోవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే పాముల బెడద నుంచి కాపాడుకోవచ్చు. ఒకవేళ పాము కనిపిస్తే నిపుణుల సాయం తీసుకోవడం మంచిది.




