Mobile Addiction: స్మార్ట్ ఫోన్ భూతం వదిలేలా.. స్కూల్ పిల్లలపై కొత్త ప్రయోగం
మీ పిల్లలు ఫోన్ పట్టుకుని వదలడం లేదా?.. అన్నం తినాలన్నా.. చెప్పిన మాట వినాలన్నా స్మార్ట్ ఫోన్ చూపిస్తేగానీ పని జరగడం లేదా? ఇది మీ ఒక్కరి సమస్యే కాదు.. దాదాపు సగం మంది తల్లిదండ్రులకి ఇది పెను సవాలుగా మారింది. ఈ ఫోన్ మహమ్మారి నుంచి పసి ప్రాయాలను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఇలాంటి పిల్లలందరినీ అడవుల బాట పట్టిస్తోంది. ఇంతకీ ఈ విశేషాలేంటో చూద్దాం..

కాసేపు రీల్స్.. మరికాసేపు వీడియో గేమ్స్ పొద్దు గడుస్తున్నా, అర్ధరాత్రి కావొస్తున్నా ఇప్పుడున్న పిల్లలది ఇదే తంతు. ఫోన్ లాక్కుంటే ఇక వారిని కంట్రోల్ చేయలేం. ఇలాంటి పరిస్థితులు ముప్పుగా పరిణమిస్తున్న సమయంలో వెస్ట్ బెంగాల్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిల్లలను మార్చేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పేరు జంగిల్ లైబ్రరీ.
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
మీరిప్పటి వరకు జంగిల్ సఫారీల గురించి విని ఉంటారు. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా? ఆ రాష్ట్రంలోని కూచ్ బిహార్ అడవుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా లైబ్రరీలను ఏర్పాటు చేశారు. స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ మానేసి మూడు రోజుల పాటు ఈ అరణ్య ప్రాంతాల్లో పాఠాలు వింటారు. పక్షుల కిలకిలారావాల మధ్య ఉంటూ నును వెచ్చని సూర్యోదయాన్ని, ప్రకృతిని ఆస్వాదిస్తారు. అడవి మధ్యలో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో పిల్లలకు నచ్చే రకరకాల పుస్తకాలను ఉంచుతారు. వారికి పుస్తక పఠనం అలవడేలా చేస్తారు. వీరి ప్రయత్నాన్ని ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ఇలా నెలలో మూడు రోజుల పాటు పిల్లలను ఈ జంగిల్ లైబ్రరీకి తీసుకువెళ్తారు. ఇలా మెల్లగా వారి ఫోన్ అడిక్షన్ తగ్గించి ఇతర అంశాలపైకి వారి ఆసక్తిని మళ్లిస్తారు. ప్రస్తుతం ఈ జంగిల్ లైబ్రరీ పేరు ట్రెండింగ్ గా మారింది.
తెలివితేటలు తేడాగా..
అదే పనిగా ఫోన్ చూస్తూ పెరుగుతున్న నేటితరం చిన్నారుల్లో సోషలైజేషన్ పూర్తిగా దెబ్బతింటోంది. దీని వల్ల పిల్లలు అన్ని విషయాల్లోనూ వెనకబడిపోతున్నారు. ఏకాగ్రత లోపిస్తోంది. దీర్ఘకాలం ఇదే కొనసాగితే వారు రేడియేషన్ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లల్లో గందరగోళం, ఆలోచన శక్తి తగ్గిపోవడం, మాటలు లేటుగా రావడం, తెలివితేటలు మందగించడం వంటివి కనిపిస్తున్నాయి. ఇక టీనేజీకొచ్చేసరికి వారు డిప్రెషన్ లోకి వెళుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఇకనైనా పిల్లల చేతికి ఫోన్లు ఇవ్వడం మానుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.