AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

నేటి కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి, మానసిక అలసట అనేవి నిత్యకృత్యంగా మారిపోయాయి. ముఖ్యంగా భారతీయ కార్యాలయాల్లో పని పూర్తి చేసుకుని సరైన సమయానికి ఇంటికి వెళ్లడం కూడా ఒక నేరంగా పరిగణించే పరిస్థితి నెలకొంది. దీనిపై గురుగ్రామ్‌కు చెందిన పారిశ్రామికవేత్త, '24NorthStar' సహ వ్యవస్థాపకురాలు నిష్ఠా త్రిపాఠి చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన పనిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఆఫీసు సమయం ముగియగానే వెళ్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులను ఆమె ఎత్తిచూపారు.

సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!
Burnout Culture
Nikhil
|

Updated on: May 15, 2026 | 10:29 PM

Share

నిష్ఠా త్రిపాఠి తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాలు సగటు ఉద్యోగి వేదనను ప్రతిబింబిస్తున్నాయి. “భారతదేశంలో సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరాలంటే ఏదో తెలియని అపరాధ భావం వెంటాడుతుంది. పగలు 7 గంటలకే ఆఫీసుకి వచ్చి, వారం మొత్తం కష్టపడి పని ముగించినా.. సకాలంలో లాగ్-ఆఫ్ చేస్తే చాలు, పక్కన ఉన్న వారు ‘ఈ రోజు హాఫ్ డేనా?’ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేస్తారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పనితీరు కంటే ఆఫీసులో ఎంత ఎక్కువ సేపు కూర్చున్నాము అనే దానినే నిబద్ధతకు కొలమానంగా చూడటం విచారకరమని ఆమె అభిప్రాయపడ్డారు.

పాశ్చాత్య దేశాల సంస్కృతి..

నిష్ఠా త్రిపాఠి ఐరోపా దేశాల్లోని పని సంస్కృతిని భారత్‌తో పోలుస్తూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. యూరోపియన్ బృందాలతో పనిచేసిన అనుభవం ప్రకారం.. అక్కడ ఉద్యోగులు సాయంత్రం 5 గంటలు కాగానే ఎటువంటి సంకోచం లేకుండా లాగ్-ఆఫ్ చేస్తారు. ఎవరికీ వివరణలు ఇచ్చుకోరు, అపరాధ భావంతో ఉండరు. అయినా సరే అక్కడ పనులన్నీ సకాలంలో పూర్తవుతున్నాయి. కానీ భారత్‌లోని బహుళజాతి కంపెనీలలో (MNCs) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా లేదా ఐరోపా దేశాల ఆఫీసులకు అనుగుణంగానే మీటింగ్‌లు ఏర్పాటు చేస్తారు. రాత్రి 10 గంటలైనా సరే భారతీయ ఉద్యోగి అందుబాటులో ఉంటాడనే నమ్మకంతో షెడ్యూల్స్ రూపొందించడం ఒక అనవసరపు సంప్రదాయంగా మారిపోయింది.

విదేశాల్లో పనిచేసి తిరిగి భారత్‌కు వచ్చే వృత్తినిపుణులకు ఇక్కడి వాతావరణం మరింత కష్టంగా అనిపిస్తుంది. సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం, ఉద్యోగి వ్యక్తిగత ప్రాధాన్యతలను తప్పుగా అర్థం చేసుకోవడం వంటివి ఇక్కడ కనిపిస్తాయి. నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగి విలువ పెరగదని, పైగా వారిని చులకనగా చూసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. కష్టపడి పనిచేసే వారి శక్తిని గౌరవించాలి తప్ప, కేవలం అలసిపోయేలా చేసే ‘హస్టిల్ కల్చర్’ను ప్రోత్సహించకూడదని ఆమె గట్టిగా చెప్పారు.

నెటిజన్ల ప్రతిస్పందన..

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున స్పందన వస్తోంది. ‘ప్రెజెంటీయిజం’ (ఆఫీసులో కనిపించడం) అనే దానిని ఒక గొప్ప నిబద్ధతగా ముద్ర వేయడం వల్ల సృజనాత్మకత దెబ్బతింటుందని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సమర్థతను బద్దకంగా భావించే ఇలాంటి సంస్కృతి వల్ల ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారని సాదిక్ దివాన్ వంటి పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో పని గంటలకు ఇచ్చే గౌరవం వల్ల అక్కడి ఉత్పాదకత పెరుగుతుందే తప్ప తగ్గదని మరికొందరు గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ వాదనతో అందరూ ఏకీభవించడం లేదు.

భారతదేశం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి, పని గంటలు ఎక్కువగా ఉండటం సహజమని కొందరు వాదిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఒకప్పుడు ఇలాంటి కఠినమైన పని సంస్కృతి ఉండేదని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే భారతీయ ఉద్యోగుల జీవనశైలి, పని ప్రారంభించే సమయాలు భిన్నంగా ఉంటాయని, కాబట్టి పాశ్చాత్య దేశాలతో పోల్చడం సరైనది కాదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, మనిషి శక్తికి, ఉత్పాదకతకు విలువనిచ్చే పని సంస్కృతి వైపు మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఈ చర్చ స్పష్టం చేస్తోంది.

Follow Us