మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా గుర్తించండి..
Cumin Seeds: జీలకర్ర ఇప్పుడు కల్తీ మాఫియా గుప్పిట్లో చిక్కుకుంది. లాభాల కోసం వ్యాపారులు అసలైన జీలకర్రకు బదులుగా విషపూరితమైన గడ్డి విత్తనాలను, బొగ్గు పొడిని కలిపి విక్రయిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని వాడుతున్న జీలకర్ర మీ ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ నకిలీ జీలకర్రను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంటింట్లో పోపు పెట్టాలన్నా, మసాలా వంటకం ఘుమఘుమలాడాలన్నా జీలకర్ర ఉండాల్సిందే. ముఖ్యంగా బాలింతలకు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధం. అయితే డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో నకిలీ జీలకర్ర చలామణిలోకి వచ్చింది. మీరు వాడుతున్న జీలకర్ర మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేక హాని చేస్తోందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం.
జీలకర్రలో కల్తీ ఎలా చేస్తారు?
లాభాల కోసం వ్యాపారులు జీలకర్రను గడ్డి విత్తనాలతో కల్తీ చేస్తున్నారు. వాటికి జీలకర్ర రంగు రావడం కోసం బొగ్గు ధూళి, రసాయన రంగులను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోకి చేరితే జీర్ణవ్యవస్థ పాడవ్వడమే కాకుండా కాలేయం దెబ్బతినడం, తీవ్రమైన అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ జీలకర్రను గుర్తించే 3 సులభమైన మార్గాలు
నీటి పరీక్ష
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేయండి. అది కల్తీదైతే వెంటనే నీటి రంగు మారుతుంది లేదా నీరు మబ్బుగా మారుతుంది. నిజమైన జీలకర్ర గింజలు వెంటనే రంగును వదలవు. అవి రాత్రంతా నానితే తప్ప రంగు మారవు.
అరచేతిలో రుద్ది చూడండి
కొద్దిగా జీలకర్రను అరచేతిలో వేసుకుని గట్టిగా రుద్దండి. మీ చేతికి నలుపు లేదా మరేదైనా రంగు అంటుకుంటే అది కల్తీ అని అర్థం. నిజమైన జీలకర్ర ఎలాంటి రంగును వదలదు, కేవలం సువాసనను మాత్రమే ఇస్తుంది.
వాసన చూసి పసిగట్టండి
జీలకర్రను వాసన చూడటం ద్వారా కూడా కల్తీని గుర్తించవచ్చు. జీలకర్రకు ఒక ప్రత్యేకమైన గాఢమైన సువాసన ఉంటుంది. ఒకవేళ వింతగా లేదా రసాయనాల వాసన వస్తుంటే, దానికి కృత్రిమ రంగులు అద్దారని గుర్తించాలి.
జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ప్రసవం తర్వాత కొత్త తల్లులకు పప్పు, లడ్డూల రూపంలో జీలకర్ర ఇవ్వడం వల్ల వారికి త్వరగా శక్తి లభిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగడానికి కారణం.. ఇది బాడీని డీటాక్స్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనం వాడే సుగంధ ద్రవ్యాలు కల్తీవని తెలిస్తే అది ప్రాణాలకే ప్రమాదం. అందుకే కొనేటప్పుడు జాగ్రత్త వహించి, పైన చెప్పిన పరీక్షలు చేసి నాణ్యమైన జీలకర్రనే ఎంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
