కార్లలో వాటర్ బాటిల్స్ ఉంచే అలవాటు మీకూ ఉందా? అయితే జాగ్రత్త.. క్యాన్సర్ ప్రమాదం పొంచిఉన్నట్లే
శరీరానికి సరైన మొత్తంలో నీరు అందకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ప్రయాణాల్లో, ఇతర బిజీగా ఉండే రోజుల్లో నీరు తాగడం మర్చిపోతుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. కార్లు ఉన్నవారు కూడా ప్రయాణంలో దాహం వేసినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లు తాగుతుంటారు. కొంతమందికి కారులో నీళ్లను ఎంత కాలం క్రితం పెట్టారో కూడా గుర్తు ఉండదు. అయితే ఇలా కార్లలో..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం ఎంత ముఖ్యమో, నీరు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఈ వేసవి వేడి వాతావరణంలో నీరు ఎంత త్రాగినా సరిపోదు. శరీరానికి సరైన మొత్తంలో నీరు అందకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ప్రయాణాల్లో, ఇతర బిజీగా ఉండే రోజుల్లో నీరు తాగడం మర్చిపోతుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. కార్లు ఉన్నవారు కూడా ప్రయాణంలో దాహం వేసినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లు తాగుతుంటారు. కొంతమందికి కారులో నీళ్లను ఎంత కాలం క్రితం పెట్టారో కూడా గుర్తు ఉండదు. అయితే ఇలా కార్లలో ఉంచిన నీటిని తాగడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నీటిలో ఏముంది? అది ఏమిటి? ఆహారం లాగే నీరు కూడా చెడిపోతుందా అనే ప్రశ్నలు మీకు తలెత్తవచ్చు. ఇది అంత పెద్ద విషయంగా అనిపించకపోయినా ఈ అలవాటును కొనసాగిస్తే మాత్రం మీ ఆరోగ్యం త్వరలోనే ప్రమాదంలో పడుతుంది.
చాలా కాలంగా కారులో నిల్వ ఉంచిన నీటిని తాగడం ఎందుకు మంచిది కాదంటే..
కారులో నీళ్లు ఉంచితే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ 24 గంటల తర్వాత తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఇలాంటి తప్పులు చేయకూడదు. వాతావరణంలోని వేడి కారణంగా కారులో ప్లాస్టిక్ బాటిల్‌ను ఎక్కువసేపు ఉంచితే, రసాయనాలు నీటిలోకి లీకీ అవుతాయి. ఇది నీటిని కలుషితం చేస్తుంది. కాబట్టి దాహం వేసినప్పుడు తాగడం మన ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా పాత ప్లాస్టిక్ బాటిళ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద థాలేట్స్, బిస్ఫినాల్-ఎ (BPA) వంటి రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఎక్కువసేపు రోజులు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే ?
ప్లాస్టిక్ బాటిల్‌లో అధిక కాలం నీటిని నిల్వ చేయడం, అది పాతదైనా లేదా కొత్తదైనా దీర్ఘకాలిక నిల్వకు సురక్షితం కాదని అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (UF/IFAS) నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వేడిచేసిన ప్రదేశంలో ఉంచడం వల్ల యాంటీమోనీ, బిస్ఫినాల్ A (BPA) వంటి రసాయనాలు నీటిలోకి లీక్ అవుతాయని తేలింది. ఈ అధ్యయనం కోసం వారు 158°F (70°C) వద్ద నాలుగు వారాల వరకు నిల్వ చేసిన 16 బ్రాండ్ల ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌ను ఉపయోగించారు. బాటిల్‌ను ఒక నిర్దిష్ట పరిమితికి మించి వేడి చేసినప్పుడు ఈ రసాయనాల పరిమాణం పెరిగిందని అధ్యయనం కనుగొన్నారు.
టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని టైలర్‌లో నిర్వహించిన మరో అధ్యయనంలో వేడి వాతావరణంలో ఒకటి లేదా రెండు రోజులు కారులో ఉంచిన నీరు తాగడం వల్ల ప్రమాదం పెరుగుతుందని నిర్ధారించారు. ఈ ప్రమాదాలను నివారించడానికి ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌ను వేడి వాతావరణంలో ఎక్కువసేపు నిల్వ చేయకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకమైన అలవాటు జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, రుగ్మతలు, క్యాన్సర్ ప్రమాదం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించాం. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.