Candle Wax Cleaning Tips: ఫ్లోర్‌పై కొవ్వొత్తి మైనం గట్టిగా పేరుకుపోయిందా? కత్తితో గీకాల్సిన పనిలేదు.. ఇలా తొలగించండి!
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి కొవ్వొత్తులు వెలిగించడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా దీపాల వెలుగులతో ఇల్లు అందంగా కనిపించాలని ఫ్లోర్ పక్కన, గుమ్మాల దగ్గర కొవ్వొత్తులు పెడుతుంటారు. అయితే కొవ్వొత్తులు కరిగి వాటి మైనం నేలపై పడితే మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. చల్లబడిన తర్వాత అది గట్టిగా పేరుకుపోయి తొలగించడానికి ఇబ్బందిగా ఉంటుంది.

1. ఐస్ ముక్కలతో మైనాన్ని గట్టిపరచండి
ఫ్లోర్‌పై మైనం పడిన వెంటనే దాన్ని బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించకండి. ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్‌లో కొన్ని ఐస్ ముక్కలు వేసి, మైనం పడిన ప్రాంతంపై 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచండి. చల్లదనం వల్ల మైనం మరింత గట్టిపడి పెళుసుగా మారుతుంది. దీంతో దాన్ని సులభంగా తొలగించవచ్చు.
2. పాత ఏటీఎం కార్డుతో తొలగించండి
మైనం గట్టిపడిన తర్వాత పాత ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించవచ్చు. కార్డును మైనం అంచు దగ్గర నెమ్మదిగా పెట్టి పైకి లేపాలి. ఇలా చేస్తే ఫ్లోర్‌పై గీతలు పడకుండా మైనం ముక్కలను తొలగించవచ్చు. అయితే కత్తి, బ్లేడ్ లేదా పదునైన లోహపు వస్తువులను ఉపయోగించకూడదు.
3. హెయిర్ డ్రయ్యర్‌తో మిగిలిన మరకలు తొలగించండి
మైనం గట్టిపడిన భాగాన్ని తొలగించిన తర్వాత కూడా నేలపై జిడ్డుగా చిన్న పొర మిగిలిపోవచ్చు. అలాంటప్పుడు హెయిర్ డ్రయ్యర్ ఉపయోగపడుతుంది. తక్కువ లేదా మధ్యస్థ వేడి గాలిని మైనం మరకపై కొద్దిసేపు ప్రసరింపజేయాలి. మైనం మెత్తబడగానే పేపర్ టవల్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడవాలి. ఒకే చోట ఎక్కువసేపు వేడి పెట్టకూడదు.
4. డిష్ వాష్ లిక్విడ్‌తో జిడ్డు మరకలు పోగొట్టండి
మైనం తొలగించిన తర్వాత ఫ్లోర్‌పై నూనె జిడ్డులాంటి మరకలు కనిపిస్తే గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. ఈ నీటిలో మైక్రోఫైబర్ క్లాత్‌ను ముంచి మరక ఉన్న ప్రాంతాన్ని నెమ్మదిగా తుడవాలి. ఇలా చేస్తే మిగిలిన జిడ్డు తొలగిపోతుంది. చివరగా శుభ్రమైన తడి గుడ్డతో మరోసారి తుడిచి ఆరనివ్వాలి.
5. టైల్స్ మధ్య గీతల్లో మైనం పేరుకుపోతే ఇలా చేయండి
కొన్నిసార్లు కొవ్వొత్తి మైనం టైల్స్ మధ్య ఉండే గ్రౌట్ లైన్లలోకి వెళ్లి గట్టిపడుతుంది. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా శుభ్రం చేయాలి. హెయిర్ డ్రయ్యర్‌తో తక్కువ వేడి గాలిని కొద్దిసేపు ప్రసరింపజేసి మైనాన్ని కొద్దిగా మెత్తగా చేయాలి. తర్వాత పేపర్ టవల్‌తో మైనాన్ని అద్దినట్లు తీసేయాలి. మిగిలిన మరకలను పాత మెత్తటి టూత్ బ్రష్, సబ్బు నీటితో సున్నితంగా శుభ్రం చేయాలి.
