AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫ్లయింగ్ బోర్డు పై చైనా యువకుడి విన్యాసాలు!

సూపర్‌హీరో సినిమాల్లో కనిపించే అద్భుతాలు నిజ జీవితంలో సాధ్యమైతే ఎలా ఉంటుంది? ముఖ్యంగా స్పైడర్‌మ్యాన్ సినిమాలో విలన్ గ్రీన్ గాబ్లిన్ ఓ ఎగిరే బోర్డుపై గాల్లో దూసుకెళ్తుంటే చూసి.. అలా మనం కూడా ఎగరగలిగితే బాగుంటుందని చాలామందికి అనిపించే ఉంటుంది. అయితే చైనాకు చెందిన ఓ యువకుడు తన సొంత ఆలోచనతో ఓ ఫ్లయింగ్ హోవర్‌బోర్డును తయారు చేశాడు. ఇప్పుడు దానిపై కొండలు, నదులు, నగరాల మీదుగా గాల్లో ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Video: ఫ్లయింగ్ బోర్డు పై చైనా యువకుడి విన్యాసాలు!
From Workshop To Sky Chinese Mans Homemade Hoverboard Stuns The Internet
Sharada V
|

Updated on: Nov 09, 2026 | 7:44 PM

Share

చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన 26 ఏళ్ల సాంగ్ జింగ్యూ (Song Xingyu) సోషల్ మీడియాలో ‘అమేజింగ్ అయు’ (Amazing Ayu) పేరుతో గుర్తింపు పొందాడు. దాదాపు రెండు నెలలు శ్రమించి ఎగిరే బోర్డును తయారు చేసి తన ప్రయోగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో యాంగ్జీ నది, పర్వత శిఖరాల మీదుగా అతడు గాల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

విమానాలపై ఆసక్తితో ప్రయోగాలు!

సాంగ్ 14 ఏళ్ల వయసులోనే చదువును మధ్యలో ఆపేసి తండ్రి నిర్వహించే కలప కోత మిల్లులో పనిచేసాడు. విమానాలంటే ఇష్టంతో ఓ టీవీ కార్యక్రమం చూసిన అతడు ఎగిరే పరికరాలను తయారు చేయాలని, పాత వస్తువులు, పనికిరాని సామగ్రిని సేకరించి తన మొదటి మోడల్ విమానాన్ని రూపొందించాడు. తండ్రికి చెందిన ఖాళీగా ఉన్న చెక్కపని షెడ్‌ను ప్రయోగశాలగా మార్చుకున్నాడు. తన ప్రయోగాల కోసం అప్పులు కూడా చేశాడు. ఓ మోసపూరిత వ్యవహారంలో చిక్కుకుని ఏకంగా 24 లక్షల యువాన్ల అప్పు భారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో Insta360 సంస్థ అతడికి అండగా నిలిచింది. ‘థింక్ బోల్డ్ ఛాలెంజ్ ఫండ్’ ద్వారా సాంగ్‌కు 18 లక్షల యువాన్ల ఆర్థిక సహాయం అందించింది.

 పారాచూట్ పనిచేయక ప్రాణాల మీదకు!

ఎగరాలన్న కోరిక కోసం సాంగ్ ఎంతటి సాహసానికైనా సిద్ధపడ్డాడు. సొంతంగా తయారు చేసుకున్న జెట్‌ పవర్డ్ పరికరాన్ని ధరించి హెలికాప్టర్‌ నుంచి 5,000 మీటర్ల ఎత్తులో దూకాడు. అయితే ఈ ప్రయోగం ప్రాణాల మీదకు తెచ్చింది. అతడు దూకిన తర్వాత ప్రధాన పారాచూట్ తెరుచుకోలేదు. చివరకు రెండో పారాచూట్ కూడా భూమికి కేవలం 600 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకుంది. దీంతో అతడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ఎలక్ట్రిక్ బోర్డు తయారీ!

తాజాగా సాంగ్ స్పైడర్‌మ్యాన్ సినిమాలో గ్రీన్ గాబ్లిన్ ఉపయోగించే ఎగిరే గ్లైడర్‌ను పోలిన పరికరాన్ని తయారు చేసాడు. మొదట చిన్న జెట్ ఇంజిన్లతో ప్రయోగాలు చేశాడు. అది విఫలం కావడంతో ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేసే హోవర్‌బోర్డును తయారు చేయడంపై దృష్టి పెట్టాడు. చివరకు ఎన్నో మార్పులు, పరీక్షల తర్వాత ఏఐ సహకారంతో ఫ్లయింగ్ బోర్డును రూపొందించాడు. ఈ పరికరం నలుగురు పెద్దలు ప్రయాణించగలిగే సామర్థ్యంతో డిజైన్ చేసాడు. దానిపై ప్రయాణించేటప్పుడు సమతుల్యత కోల్పోకుండా ఉండేందుకు సాంగ్ బ్యాలెన్స్ సాధన చేశాడు.

నదులపై, పర్వతాల మధ్య గాల్లో చక్కర్లు

అక్టోబర్‌లో హుబే ప్రావిన్స్‌లోని ఎన్‌షి ప్రాంతంలో ఈ హోవర్‌బోర్డును పరీక్షించాడు. యాంగ్జీ నది మీదుగా, ఎత్తైన పర్వత శిఖరాల పైనుంచి, నగర వీధుల మీదుగా గాల్లో ప్రయాణించాడు. చివరకు ఓ లోయలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిన్న వయసులోనే చదువు మానేయడం.. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు.. ప్రాణాల మీదకు వచ్చిన ప్రమాదం.. ఇలా ఎన్నో సవాళ్లు ఎదురైనా తన కలను మాత్రం వదులుకోలేదు సాంగ్. అందుకే ఇప్పుడు అతడి ఫ్లయింగ్ బోర్డు ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

Follow Us