AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్ముజ్‌ లో ఈత కొడుతుండగా.. కళ్ల ముందే పేలిన నౌకలు!

Gulf War Environmental Damage: యుద్ధంతో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసమే కాదు.. ప్రకృతికి తీరని నష్టం జరుగుతుంది. సముద్రంలోని జీవరాశులకు తీవ్ర ముప్పుగా మారుతుంది. తాజాగా హర్ముజ్ జలసంధిలో ఈతకు దిగిన ఓ వ్యక్తికి.. కళ్ల ముందే ఇరాన్‌ అమెరికా మధ్య యుద్ధం భీకర దృశ్యాలు కనిపించాయి. పేలుళ్లు, ఆకాశంలో యుద్ధ విమానాలు, మంటల్లో నౌకలు.. ఇలా యుద్ధ వాతావరణం మధ్య ఆయన ఈత కొట్టాల్సి వచ్చింది. సముద్రంలో ఒలికిన చమురుకి పర్యావరణ నష్టానికి బాధ్యత ఎవరిది అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

హర్ముజ్‌ లో ఈత కొడుతుండగా.. కళ్ల ముందే పేలిన నౌకలు!
War Erupts Around Him As He Swims Through Hormuz A Marine Disaster That Could Last Decades
Sharada V
|

Updated on: Nov 29, 2026 | 8:56 PM

Share

Lewis Pugh : బ్రిటన్‌కు చెందిన లెవిస్ ప్యూ ప్రముఖ ఎండ్యూరెన్స్ స్విమ్మర్. ఐక్యరాజ్యసమితి సముద్ర పరిరక్షణ కార్యక్రమానికి గౌరవ ప్రతినిధి కూడా. ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పం నుంచి హర్ముజ్ జలసంధిలో 15 కిలోమీటర్లు ఈత కొట్టారు. సముద్ర జీవవైవిధ్యం గురించి ప్రపంచానికి తెలియచేసారు. మొదటి రోజే ఊహించని అనుభవం ఎదురైంది.  భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి ఆకాశంలో యుద్ధ విమానాలు కనిపించాయి ఓ చమురు రవాణా నౌకపై దాడి జరిగింది.

రెండవ రోజు  ఓ పర్వతం వెనుక నుంచి భారీగా పొగ పైకి లేవడాన్ని ప్యూ గమనించారు. దాదాపు 150 మీటర్ల ఎత్తున్న పర్వతం పై నుంచి మంటలు కనిపించేంత తీవ్రంగా పేలుడు సంభవించింది. క్షిపణి దాడికి గురైన ‘తారా గ్యాస్’ (Tara Gas) నౌకను చూశారు. ఆ నౌక పనామా దేశం జెండాతో ప్రయాణిస్తోంది. అందులో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. ‘నా జీవితంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. నౌక మొత్తం మంటల్లో చిక్కుకుంది. నౌక చుట్టూ నీరు కూడా మండుతున్నట్లు కనిపించింది. రసాయనాల ఘాటైన వాసన వచ్చింది’ అని ప్యూ తెలిపారు.

ఒకవైపు యుద్ధం.. మరోవైపు ప్రకృతి అందాలు!

హర్ముజ్ జలసంధిలో పరస్పర విరుద్ధ దృశ్యాలు కనిపించాయి. ఒకవైపు పేలుళ్లు, యుద్ధ విమానాలు, దాడులకు గురవుతున్న నౌకలు మరోవైపు ఒమన్‌లోని ముసందమ్ ప్రకృతి అందాలతో అలరించింది. ఎత్తైన పర్వతాలు, లోయలు, నీలిరంగు నీరు, నీటిలో డాల్ఫిన్లు ఈదుతూ కనిపించాయి. ఒక ఓస్ప్రే పక్షి నీటిలోకి దూకి చేపను పట్టుకుంది. ఇంతటి అందమైన ప్రకృతి మధ్యలో యుద్ధం జరుగుతుండటం ప్యూ మనసును కలచివేసింది. సముద్రాన్ని కేవలం నౌకల రవాణాకు మార్గంగా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతంగా మాత్రమే చూడకూడదనీ  ఎన్నో రకాల సముద్ర జీవులతో ఓ భారీ పర్యావరణ వ్యవస్థ ఉందని గుర్తుచేశారు.

సముద్ర జీవరాశులకు పొంచి ఉన్న ముప్పు!

హర్ముజ్ జలసంధి చమురు రవాణాకు కీలక మార్గం మాత్రమే కాదు. ఎన్నో రకాల సముద్ర జీవులకు ఆవాసం. డాల్ఫిన్లు, తాబేళ్లు, పగడపు దిబ్బలు, మడ అడవులు ఇక్కడి పర్యావరణ వ్యవస్థలో భాగం.  నౌకలపై దాడులు జరిగినప్పుడు చమురు ఒలికి సముద్రంలో కలిసి, చిన్న జీవుల శరీరాల్లోకి చేరతాయి. వాటిని చేపలు తింటాయి, ఆ చేపలను పెద్ద సముద్ర జీవులు ఆహారంగా తీసుకుంటాయి.  విషపదార్థాలు ఆహార గొలుసు ద్వారా ఇతర జీవులకు చేరతాయి. దీంతో ఒక్క నౌకపై దాడి ప్రభావం చాలా దూరం విస్తరిస్తుంది.

తాగునీటికి ముప్పు తప్పదా?

సముద్ర కాలుష్యం వల్ల మరో పెద్ద సమస్య ఉంది. గల్ఫ్ ప్రాంత  దేశాలన్నీ తాగునీటి  కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడుతున్నాయి. చమురు సముద్రంలో కలిస్తే ఆ నీటిని శుద్ధి చేసే కేంద్రాలకూ ముప్పు కలుగుతుంది.  ప్రజలకు తాగునీటి భద్రత లేకుండా పోతుంది.

నౌకల్లో పనిచేసే నావికుల పరిస్థితి ఏమిటి?

తారా గ్యాస్ నౌకపై దాడితో నావికుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నను లూయిస్ ప్యూ లేవనెత్తారు. పనామా జెండాతో ప్రయాణిస్తున్న నౌకలో 24 మంది భారతీయులు ఉన్నారు. వాణిజ్య నౌకల్లో చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన నావికులు కూడా పనిచేస్తుంటారు. వీరు యుద్ధంలో భాగస్వాములు కారు.  ఉద్యోగ విధుల్లొ భాగంగా సముద్రంలో ప్రయాణించే సామాన్య పౌరులు యుద్ధం కారణంగా ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి కుటుంబాల పరిస్థితిని కూడా ప్రపంచం అర్థం చేసుకోవాలని ప్యూ కోరారు. సముద్రంలో ఉన్న తమ భర్త క్షేమంగా ఉన్నాడో లేదోనని ఎదురుచూసే భార్య, ఎప్పుడు కొడుకు నుంచి ఫోన్ వస్తుందా అని ఆందోళన చెందే తల్లి గురించి ఆలోచించాలని కోరారు.

పర్యావరణ నష్టం బాధ్యత ఎవరిది?

దీనికి ఉదాహరణగా 1990-91 గల్ఫ్ యుద్ధాన్ని ఆయన గుర్తుచేశారు. కువైట్ నుంచి ఇరాక్ సైన్యం వెనక్కు వెళ్లే సమయంలో 700కు పైగా చమురు బావులకు నిప్పు పెట్టింది. ఆ మంటలు నెలల తరబడి కొనసాగి పొగ, కాలుష్య పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యాయి. పర్షియన్ గల్ఫ్‌లోకి ఉద్దేశపూర్వకంగా చమురును విడుదల చేయడంతో సముద్ర జీవరాశులు పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.  కువైట్‌పై దాడి కారణంగా జరిగిన నష్టానికి ఇరాక్ బాధ్యత వహించాలని 1991 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.  దాదాపు 4.3 బిలియన్ డాలర్లను కువైట్, ఇరాన్, జోర్డాన్, సౌదీ అరేబియాలో పర్యావరణ పునరుద్ధరణ పనుల కోసం వినియోగించారు.

ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో జరుగుతున్న దాడుల విషయంలోనూ ఇలాంటి బాధ్యతాయుత చర్యలు అవసరమని ప్యూ అభిప్రాయపడ్డారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.  యుద్ధం ముగిసిన తర్వాత కూడా సముద్రానికి, అక్కడి జీవరాశులకు, తీర ప్రాంత ప్రజలకు నష్టం కొనసాగుతుంది.  ఇప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ఆయన హెచ్చరించారు.

Follow Us
హర్ముజ్‌ లో ఈత కొడుతుండగా.. కళ్ల ముందే పేలిన నౌకలు!
హర్ముజ్‌ లో ఈత కొడుతుండగా.. కళ్ల ముందే పేలిన నౌకలు!
కట్నంగా ‘థార్’ అడిగిన వరుడి కుటుంబం.. దిమ్మదిరిగే షాక్ !
కట్నంగా ‘థార్’ అడిగిన వరుడి కుటుంబం.. దిమ్మదిరిగే షాక్ !
మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చా?  
మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చా?  
OYO అంటే ఏంటీ..? ఆ మూడక్షరాల వెనుకున్న అసలు అర్థం 90శాతం మందికి..
OYO అంటే ఏంటీ..? ఆ మూడక్షరాల వెనుకున్న అసలు అర్థం 90శాతం మందికి..
టీ20ల్లో ఎవరికీ వల్ల కాని చెత్త రికార్డు సాధించిన ఆసిస్ కెప్టెన్
టీ20ల్లో ఎవరికీ వల్ల కాని చెత్త రికార్డు సాధించిన ఆసిస్ కెప్టెన్
2027లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా.. సూతక..
2027లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా.. సూతక..
 ఎక్కిళ్లు వెంటనే తగ్గాలంటే ఈ చిన్న చిట్కాతో వెంటనే బంద్!
 ఎక్కిళ్లు వెంటనే తగ్గాలంటే ఈ చిన్న చిట్కాతో వెంటనే బంద్!
నోటి నుంచి చెడు వాసన వస్తోందా? ఆయుర్వేదంలో సూచించిన ఈ చిట్కాలు
నోటి నుంచి చెడు వాసన వస్తోందా? ఆయుర్వేదంలో సూచించిన ఈ చిట్కాలు
నెయిల్ పాలిష్ వేసినా అందంగా కనిపించడం లేదా? ఈ పొరపాట్లు చేయకండి!
నెయిల్ పాలిష్ వేసినా అందంగా కనిపించడం లేదా? ఈ పొరపాట్లు చేయకండి!
మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారా? ఇది నేర్చుకోండి!
మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారా? ఇది నేర్చుకోండి!