AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్నిపర్వతం మధ్యలో అందమైన గ్రామం.. ఎక్కడుంది ? ఏంటా స్టోరీ ??

సాధారణంగా ప్రకృతి విపతులు సంభవిస్తున్నాయంటే ఒక్క నిమిషం గుండె గజగజ వణుకుతుంది. ముందు ప్రాణాలను కాపాడుకోవాలని ఎవరైనా సరే పరుగులు పెడతారు. అలాంటిది ఎప్పుడు పేలుతుందో తెలియని ఓ అగ్నిపర్వతం బిలం లోపలే ఇళ్లు కట్టుకున్నారు ఓ గ్రామస్తులు. తరతరాలుగా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే నమ్ముతారా? ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

అగ్నిపర్వతం మధ్యలో అందమైన గ్రామం.. ఎక్కడుంది ? ఏంటా స్టోరీ ??
Aogashima Island
Korivi Jayakumar
|

Updated on: Nov 28, 2026 | 9:49 PM

Share

సాధారణంగా ప్రకృతి విపతులు సంభవిస్తున్నాయంటే ఒక్క నిమిషం గుండె గజగజ వణుకుతుంది. ముందు ప్రాణాలను కాపాడుకోవాలని ఎవరైనా సరే పరుగులు పెడతారు. అలాంటిది ఎప్పుడు పేలుతుందో తెలియని ఓ అగ్నిపర్వతం బిలం లోపలే ఇళ్లు కట్టుకున్నారు ఓ గ్రామస్తులు. తరతరాలుగా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది ? ఆ ప్రజలు ఎవరు ? ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

పసిఫిక్ సముద్రంలో దాగిన అద్భుతం..

ఆ అగ్నిపర్వతం మధ్యలో నివసిస్తున్న వారే ‘అవోగషిమా’ (Aogashima) వాసులు. ప్రకృతి వింతలకు పెట్టింది పేరైన జపాన్‌లోని రాజధాని టోక్యోకు సుమారు 360 కిలోమీటర్ల దూరంలో.. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఈ చిన్న ద్వీపం ఉంది. దూరం ఎక్కువే అయినా పరిపాలన పరంగా ఇది టోక్యో పరిధిలోకి వస్తుంది. కేవలం 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ చిన్ని ద్వీపంలో 170 మంది మాత్రమే నివసిస్తున్నారు. జపాన్‌లోనే అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుంది. అంతే కాకుండా ఆకాశం నుంచి చూస్తే అవోగషిమా ద్వీపం ఒక పెద్ద గిన్నె ఆకారంలో చిత్రంగా కనిపిస్తుంది.

గతంలో సంభవించిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల దీని చుట్టూ 250 మీటర్ల ఎత్తైన కొండచరియలు గోడలా ఏర్పడ్డాయి. ఆ కొండల మధ్యలో పచ్చని అడవి, దాని నడిబొడ్డున ‘మౌంట్ మారుయామా’ అనే మరో చిన్న అగ్నిపర్వత శిఖరం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అంటే ఒక అగ్నిపర్వతం లోపల మరో అగ్నిపర్వతం అంటే ఇదే అని చెప్పవచ్చు. 1785లో ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై లావాను కక్కడంతో, ప్రాణభయంతో ప్రజలంతా ఊరు వదిలి వెళ్లిపోయారు. దాదాపు 50 ఏళ్ల పాటు అక్కడ మనిషి అలికిడే లేదు. ఆ తర్వాత 1832లో కొందరు ధైర్యం చేసి మళ్లీ వచ్చి స్థిరపడ్డారు. ఇప్పటికీ ఇక్కడ అగ్నిపర్వత వేడి తగ్గలేదని.. నేలపై కొన్ని చోట్ల వేడివేడి ఆవిరి బయటకు వస్తుంటుందని చెబుతుంటారు. అయితే స్థానికులు గ్యాస్, కట్టెల పొయ్యిలకు బదులుగా ఆ సహజ ఆవిరి మీదే వంటలు చేసుకోవడం గమనార్హం.

ఇక చుట్టూ నీలి సముద్రం, మధ్యలో పచ్చని కొండలు.. ఇదే అవోగషిమా వాసుల ప్రపంచం. నగరాల్లో కనిపించే ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, షాపింగ్ మాల్స్ హడావిడి ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. వ్యవసాయం, పర్యాటకమే వీరి ప్రధాన ఆదాయ వనరులు. అలానే ఈ అద్భుత ద్వీపాన్ని చూడాలంటే టోక్యో నుంచి ముందుగా ‘హచిజోజిమా’ ద్వీపానికి వెళ్లాలి. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 20 నిమిషాల్లో లేదా పడవలో 3 గంటలు ప్రయాణించి అవోగషిమా చేరుకోవచ్చు. అయితే ఇది చురుకైన అగ్నిపర్వత ప్రాంతం కాబట్టి, పర్యాటకులు ముందుగానే ప్రభుత్వ హెచ్చరికలు, వాతావరణ పరిస్థితులను తెలుసుకుని వెళ్లడం మంచిది.

Follow Us