AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్‌సభలో నెంబర్ గేమ్.. ఎన్డీఏ పక్కా వ్యూహం.. కాంగ్రెస్ తర్జనభర్జన..!

హస్తినలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. డీలిమిటేషన్ బిల్లుపై దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్‌సభలో తమకు 370 మంది ఎంపీల మద్దతు ఉందని, బిల్లు గట్టెక్కడం ఖాయమని ఎన్డీఏ కూటమి ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు సొంత మిత్రులను కాపాడుకోలేక ఇండి కూటమి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలు ఎన్డీఏ చెబుతున్న 370 లెక్క వెనుక ఉన్న అసలు లెక్కేంటి ? బిల్లు నెగ్గాలంటే క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందా?

లోక్‌సభలో నెంబర్ గేమ్.. ఎన్డీఏ పక్కా వ్యూహం.. కాంగ్రెస్ తర్జనభర్జన..!
Nda Claims 370 Mps Support In Lok Sabha
Krishna S
|

Updated on: Nov 29, 2026 | 9:52 PM

Share

డీలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి ధీమాతో కనిపిస్తుంది. గత ఏప్రిల్‌లో బిల్లు వీగిపోవడంతో, ఈసారి సవరణలతో ఎన్డీఏ సర్కార్ పక్కా వ్యూహంతో ముందుకొస్తోంది. లోక్‌సభలో తమకు 370 నుంచి 371 మంది ఎంపీల మద్దతు ఉందని ఎన్డీఏ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే సభకు హాజరై ఓటు వేసే వారిలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న బలం ప్రకారం 360 ఓట్లు వస్తే బిల్లు సులభంగా గట్టెక్కుతుంది. తమ దగ్గర 360 కాదు మరో 10ఓట్ల అదనపు బలం ఉందని ఎన్డీఏ లెక్కలు వేసుకుంటోంది. లోక్‌సభలో ఎన్డీఏ కూటమి సొంత బలం సుమారు 320 నుంచి 325 స్థానాలు. ఈమద్య తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం నుంచి వచ్చిన ఎంపీలతో పాటు అకాలీదళ్ మద్దతుతో ఎన్డీఏ బలం పెరిగింది. దీనికి తోడు డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు, శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన 8 మంది ఎంపీలు, వైసీపీకి చెందిన 4 గురు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నారు. వీరందరినీ కలిపితే మద్దతు 355 నుంచి 360 మార్కుకు చేరుకోవడం ఖాయం.

బిల్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెగ్గాలంటే మరో 5 నుంచి 15 ఓట్ల వరకు కీలకం. ఇక్కడే క్రాస్ ఓటింగ్, గైర్హాజరుపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇండి కూటమిలోని కొన్ని చిన్న పార్టీల ఎంపీలు, స్వతంత్రులు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ, జేఎంఎం వంటి పార్టీలపై ఎన్డీఏ కన్నేసింది. ఇప్పటికే జేఎంఎం బిల్లుకు మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా జేఎఎం నాన్చుతోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ అమలుతో ముడిపడి ఉన్న బిల్లు కావడంతో.. సొంత పార్టీల విప్‌లను కాదని కొందరు విపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌ చేసే చాన్స్ ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మరికొందరు ఓటింగ్‌కు గైర్హాజరైతే సభలో సంఖ్య తగ్గి ఎన్డీఏకు బిల్లు నెగ్గడం మరింత సులభమవుతుంది.

మరోవైపు మిత్రపక్షాలను నిలబెట్టుకోలేక ఇండి కూటమి తీవ్ర గందరగోళంలో ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్‌ను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెన్నై వెళ్లినా ఫలితం దక్కలేదు. తమిళనాడు ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాబోయే 25 ఏళ్ల పాటు రాష్ట్రవాటాకు డోకా లేకపోవడంతో బిల్లుకు మద్దతు ఇస్తామని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఒకవైపు 370 ఓట్లతో బిల్లు నెగ్గి చరిత్ర సృష్టిస్తామని ఎన్డీఏ ధీమాగా ఉంటే, చివరి నిమిషంలోనైనా అడ్డుకుంటామని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మరి బిల్లు సమయంలో ఓటింగ్‌లో క్రాస్ ఓటింగ్ మ్యాజిక్ పనిచేస్తుందా? లేక విపక్షాల వ్యూహం ఫలిస్తుందా? అన్నది చూడాలి.

Follow Us