AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనియా, రాహుల్ వెళ్లినా వెనక్కి తగ్గని స్టాలిన్.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై డీఎంకే కీలక నిర్ణయం

డీలిమిటేషన్‌తో కూడిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లుకు మద్దతు ప్రకటించిన డీఎంకే నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు నేతలు చెన్నైలో స్టాలిన్‌తో భేటీ అయ్యారు. బిల్లుకు మద్ధతు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే వారికి స్టాలిన్ బిగ్ షాక్ ఇచ్చారు.

సోనియా, రాహుల్ వెళ్లినా వెనక్కి తగ్గని స్టాలిన్.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై డీఎంకే కీలక నిర్ణయం
Dmk Supports Women Reservation Bill
Krishna S
|

Updated on: Nov 29, 2026 | 7:07 PM

Share

నియోజకవర్గాల పునర్విభజనతో కూడిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లుకు డీఎంకే నాయకత్వం మద్దతు ప్రకటించడంపై పునరాలోచించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న స్టాలిన్ నివసానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లారు. వారికి స్టాలిన్ సాదర స్వాగతం పలికి, రాహుల్ గాంధీకి శాలువా కప్పి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, కనిమొళి తదితరులతో కాంగ్రెస్ నేతలు సుమారు గంటకు పైగా తీవ్ర స్థాయిలో చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో బిల్లుపై తమ పార్టీ వైఖరిని స్టాలిన్ స్పష్టం చేసినట్లు సమాచారం. తమ పార్టీ డిమాండ్ చేసిన రెండు ముఖ్యమైన అంశాలను బిల్లులో చేర్చడం వల్లే మద్దతు ఇస్తున్నట్లు స్టాలిన్ వివరించారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. న్యాయమైన పునర్విభజనే తమ విధానమని తెలిపిన ఆయన, బిల్లుపై మద్దతు నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, గతంలో బిల్లును వ్యతిరేకించిన డీఎంకే ఇప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చిందో వివరిస్తూ ఆ పార్టీ ఐటీ వింగ్ ఒక పోస్ట్‌ను విడుదల చేసింది. గతంలో బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ.. అప్పట్లో తమిళనాడు ఎంపీ సీట్లు 39 నుంచి 31 లేదా 32కి తగ్గే ప్రమాదం ఉండేదని, రాష్ట్ర వాటా 5.71 శాతం నుంచి 5.89 శాతానికి పరిమితమయ్యేదని పేర్కొంది. ప్రస్తుతం బిల్లులో మార్పుల వల్ల తమిళనాడు ఎంపీ సీట్ల సంఖ్య 59కి పెరిగే అవకాశం ఉందని, రాష్ట్ర వాటా 7.23 శాతం వరకు ఉంటుందని డీఎంకే ఐటీ వింగ్ తెలిపింది. 2051 వరకు ఈ రక్షణ కొనసాగితే రాబోయే 25 ఏళ్ల పాటు తమిళనాడు ఎంపీల సంఖ్య తగ్గదని పేర్కొంటూ తమ మద్దతు వెనుక ఉన్న లెక్కలను బయటపెట్టింది.

Follow Us