AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2027: మహ్మద్ షమీకి షాక్.. 2027 వరల్డ్ కప్‌కు అశ్విన్ ఫేవరెట్ పేసర్లు వీళ్లే

ODI World Cup 2027: 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకు నచ్చిన ఐదుగురు పేసర్లను ఎంపిక చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటిచ్చాడు. 206 వన్డే వికెట్లు తీసిన మహమ్మద్ షమీ పేరు ప్రస్తావించినా జాబితాలో చేర్చలేదు.

ODI World Cup 2027: మహ్మద్ షమీకి షాక్.. 2027 వరల్డ్ కప్‌కు అశ్విన్ ఫేవరెట్ పేసర్లు వీళ్లే
R Ashwin (1)
Rakesh
|

Updated on: Nov 09, 2026 | 7:45 PM

Share

ODI World Cup 2027: 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే భారత జట్టు కూర్పుపై చర్చ మొదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఎలాంటి బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగాలనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకు నచ్చిన ఐదుగురు భారత పేసర్ల పేర్లు వెల్లడించాడు. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లకు తన జాబితాలో చోటిచ్చాడు. అయితే అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమీ పేరు ప్రస్తావించినప్పటికీ తుది ఐదుగురిలో అతడిని ఎంపిక చేయలేదు. దీంతో అశ్విన్ ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బుమ్రా నుంచి అర్ష్‌దీప్ వరకు

సోనీ స్పోర్ట్స్ నిర్వహించిన అజబ్ సవాల్ గజబ్ జవాబ్ కార్యక్రమంలో అశ్విన్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఐదుగురు భారత ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయాలని అడిగారు. దీనికి అతడు మొదట జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఫిట్‌గా ఉంటే అతడిని కూడా జట్టులో చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. మూడో బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్‌ను ఎంచుకున్నాడు. రాబోయే ఎనిమిది నెలల్లో సిరాజ్ మంచి ఫామ్‌లో ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశాడు. ఐదో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇచ్చాడు.

జాబితాలో మాత్రం షమీ నో ప్లేస్

అశ్విన్ వ్యాఖ్యల్లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మహమ్మద్ షమీ ఎంపిక. షమీ పేరు చెప్పడానికి తాను ఎంతో ఆత్రుతగా ఉన్నానని, కానీ ప్రస్తుతం అతడి విషయంలో కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నానని అశ్విన్ చెప్పాడు. అందుకే ఐదో బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంచుకున్నట్లు వివరించాడు. 36 ఏళ్ల షమీ 2025 మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ అతడి వన్డే రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 108 వన్డేలు ఆడి 206 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి అనుభవం ఉన్న బౌలర్‌ను అశ్విన్ తన ఐదుగురిలో చేర్చకపోవడం ఆసక్తికరంగా మారింది.

ఐదుగురు బౌలర్ల వన్డే రికార్డులు ఇవే

అశ్విన్ ఎంపిక చేసిన ఐదుగురు బౌలర్ల గణాంకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 91 వన్డేల్లో 151 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 30 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ 51 వన్డేల్లో 82 వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా 94 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ 20 వన్డేల్లో 34 వికెట్లు తీశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో అర్ష్‌దీప్ భారత జట్టులో ఉన్నాడు. బుమ్రాకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. ఫిట్‌నెస్ సమస్యలతో ప్రసిద్ధ్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. సిరాజ్‌కు తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో అవకాశం దక్కలేదు. హార్దిక్ కూడా గాయం కారణంగా కొంతకాలంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

టెస్టులకు గుడ్‌బై చెప్పిన షమీ

మహమ్మద్ షమీ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డేలు, టీ20ల్లో కొనసాగనున్నాడు. 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 64 మ్యాచ్‌లు ఆడి 229 వికెట్లు పడగొట్టాడు. 27.71 సగటుతో బౌలింగ్ చేసిన షమీ ఆరుసార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లలో ఆరో స్థానంలో నిలిచాడు. 2013 నవంబర్ 6న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టులకు వీడ్కోలు పలికిన షమీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 2027 ప్రపంచకప్ నాటికి అతడి ఫిట్‌నెస్, ఫామ్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us