Homemade Hair Packs For Monsoon: వర్షాకాలం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణంలోని మార్పులు ఆరోగ్యంపై కాకుండా జుట్టు, చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించి పలు సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో జుట్టు జిగటగా మారుతుంది. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో జుట్టు సంరక్షణ కోసం చాలామంది మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక్కోసారి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. ఈక్రమంలో జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉండేందుకు కొన్ని సహజ చిట్కాలను ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన హెయిర్ మాస్క్‌లను ఉపయోగించవచ్చు. మరి వర్షాకాలంలో జుట్టు సంరక్షణ (Monsoon Hair Care Tips) కోసం ఎలాంటి హెయిర్ మాస్క్ లు ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.
వేప, శనగ పిండితో..
ఒక గిన్నెలో 2 టీస్పూన్ల వేప పొడిని, 2 స్పూన్ల శెనగపిండిని తీసుకోని బాగా కలపండి. ఆతర్వాత కొద్దిగా నీరు కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను తలకు పట్టించాలి. సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆతర్వాత తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును మృదువుగా చేస్తుంది.
గుడ్డు, నిమ్మకాయ, తేనెతో..
ఒక గిన్నెలో రెండు గుడ్ల సొనలు, నిమ్మరసం, తేనె తీసుకుని బాగా కలపండి. ఈ హెయిర్ ప్యాక్‌ని జుట్టుకు అప్లై చేయండి. వెంట్రుకలు ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత క్లెన్సింగ్ షాంపూతో శిరోజాలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ స్కాల్ప్‌ను ఆయిల్ ఫ్రీగా ఉంచడంతో పాటు జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
వెనిగర్, తేనెతో..
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో సమాన పరిమాణంలో వెనిగర్, తేనె కలపండి. కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు మంచి కండీషనర్‌గా పని చేస్తుంది
తేనె, పాలతో..
ఈ హెయిర్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో కొంచెం పాలు తీసుకోండి. ఇందులోకి కాస్త తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. సుమారు 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును హైడ్రేట్ చేయడానికి అలాగే మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
అవోకాడో, ఆల్మండ్ ఆయిల్ మాస్క్..
అవకాడో హెయిర్ మాస్క్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో బయోటిన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా ఉంచడంతో పాటు మిలమిల మెరిసేలా చేస్తాయి. ఇక బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. పండిన అవోకాడోను మెత్తగా చేసి అందులోకి బాదం నూనె కలపాలి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోవాలి. దీనిని సుమారు 30 నిమిషాల పాటు తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..