అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్న వెంటనే గటగటా గ్లాసుడు నీళ్లు తాగే అలవాటు మీకుందా? దాహంగా ఉందని వెంటనే నీరు తాగేస్తున్నారా? అయితే మీరు తీవ్రమైన పొరపాటు చేస్తున్నట్లే. ఎంతో మేలు చేస్తుందనుకుని తినే అరటిపండు.. ఆ వెంటనే నీళ్లు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

మనకు ఆహారంలో అత్యంత సులభంగా లభించే పండ్లలో అరటిపండుది ఫస్ట్ ప్లేస్. పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటి ఎన్నో విలువైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు గుండె, జీర్ణవ్యవస్థ పనితీరుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామంది అరటిపండు తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగేస్తుంటారు. ఈ చిన్న అలవాటు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జీర్ణరసాలు పలుచబడటం: ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన కడుపులో అవసరమైన ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. పండ్లు తిన్న వెంటనే నీరు తాగినప్పుడు ఈ జీర్ణరసాలు పలుచబడి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
గ్యాస్ – కడుపుబ్బరం: అరటిపండు వంటి పండ్లలో కరిగే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇవి నీటితో కలిసినప్పుడు జీర్ణాశయంలో త్వరగా ఉబ్బి, పులియబెట్టే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఫలితంగా కడుపులో విపరీతమైన గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ తలెత్తుతాయి.
రక్తనాళాల సంకోచం – అజీర్ణం: పండ్ల తర్వాత ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని రక్తనాళాలు సంకోచించి, జీర్ణక్రియకు అవసరమైన అంతర్గత ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇది తీవ్రమైన మలబద్ధకం, అజీర్ణానికి దారితీస్తుంది.
షుగర్ లెవల్స్ పెరగడం: జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, ఆహారం కడుపు నుంచి పేగుల్లోకి వెళ్లే ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
పాటించాల్సిన సరైన పద్ధతి
సమయపాలన: అరటిపండు లేదా ఇతర పండ్లు తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు నీళ్లు తాగకుండా ఆగాలి.
నీటి ఉష్ణోగ్రత: చల్లటి నీటికి బదులుగా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగడం మంచిది.
మెరుగైన జీర్ణక్రియ కోసం చేయాల్సినవి
మనం తినే ఆహారం సరిగ్గా ఒంటపట్టాలన్నా, గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్యలు రాకుండా ఉండాలన్నా భోజనం తర్వాత కొన్ని నియమాలు తప్పనిసరి..
తేలికపాటి నడక: తిన్న వెంటనే ఒకేచోట కూర్చోకుండా 10 నుండి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల పేగుల కదలికలు మెరుగవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
వెంటనే పడుకోకూడదు: భోజనం లేదా పండ్లు తిన్న వెంటనే పడుకోవడం లేదా ముందుకు వంగడం చేయకూడదు. కనీసం 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవాలి; లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడి గుండెల్లో మంట వస్తుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండ్ల ద్వారా లభించే సంపూర్ణ పోషకాలను శరీరం గ్రహించి, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
