AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్వర్డ్‌లో హైదరాబాద్ అమ్మాయి అరుదైన ఘనత.. ‘టాటెల్‌మన్ స్కాలర్-2026’గా శ్రియ రికార్డ్!

హైదరాబాద్ అమ్మాయి శ్రియ లక్కప్రగడ హార్వర్డ్ యూనివర్సిటీలో 'టాటెల్‌మన్ స్కాలర్-2026'గా అరుదైన ఘనత సాధించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఈ గౌరవం అందుకున్న ఏకైక విద్యార్థిని ఆమె. డెక్స్‌టెరిటీ గ్లోబల్, వెల్లెస్లీ కాలేజీ ద్వారా తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న శ్రియ, వ్యక్తిగత సవాళ్లను అధిగమించి ఉన్నత విద్య ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆశిస్తున్నారు. ఆమె ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకం.

హార్వర్డ్‌లో హైదరాబాద్ అమ్మాయి అరుదైన ఘనత.. ‘టాటెల్‌మన్ స్కాలర్-2026’గా శ్రియ రికార్డ్!
Shreya Lakkapragada, Harvard Tatelman Scholar
Balaraju Goud
|

Updated on: Aug 30, 2026 | 9:04 AM

Share

హైదరాబాద్‌కు చెందిన యువతి శ్రియ లక్కప్రగడ తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ‘లూయిస్ అండ్ ఇడా టాటెల్‌మన్ స్కాలర్’గా శ్రియ ఎంపికయ్యారు. ఈ ఏడాదికి ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక విద్యార్థిగా శ్రియ లక్కప్రగడ నిలిచారు.

శ్రియ లక్కప్రగడ ప్రతిభకు బీజం హైదరాబాద్‌లోనే పడింది. పాఠశాల విద్య సమయంలోనే యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే డెక్స్‌టెరిటీ గ్లోబల్ కార్యక్రమాల్లో ఆమె భాగమయ్యారు. నేషనల్ స్కాలర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన ఆమె.. డెక్స్‌స్కూల్ ద్వారా తన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకున్నారు.

2022లో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వెల్లెస్లీ కాలేజీలో సైకాలజీ చదివేందుకు శ్రియకు భారీ స్కాలర్‌షిప్ లభించింది. సుమారు రూ.2.7 కోట్ల విలువైన పూర్తి స్కాలర్‌షిప్‌తో ఆమె అక్కడ నాలుగేళ్ల విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. చదువుతో పాటు పరిశోధన, విద్యార్థి నాయకత్వ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. స్టూడెంట్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ‘ఆల్‌బ్రైట్ ఫెలో’గానూ ఎంపికయ్యారు.

వెల్లెస్లీ కాలేజీలో ఉన్న సమయంలో భారత్‌తో ఆ విద్యాసంస్థకు ఉన్న చారిత్రక సంబంధాలపై ప్రత్యేక థీసిస్‌ను కూడా ఆమె రూపొందించారు. పలు అకడమిక్, లీడర్‌షిప్ అవార్డులను అందుకున్న శ్రియ.. 2026 మేలో తన బ్యాచిలర్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు.

పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో శ్రియ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, యేల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, జాన్స్ హాప్‌కిన్స్ వంటి ఐదు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి ఆమెకు అడ్మిషన్ అవకాశాలు వచ్చాయి. అయితే ఉన్నత విద్య కోసం ఆమె హార్వర్డ్‌ను ఎంచుకున్నారు.

ఇక హార్వర్డ్ అందించే టాటెల్‌మన్ స్కాలర్‌షిప్ అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ విద్య, నాయకత్వంలో అసాధారణ పట్టుదలను ప్రదర్శించిన విద్యార్థికి ఈ గౌరవం అందిస్తారు. 2026–27 విద్యా సంవత్సరానికి శ్రియను ఎంపిక చేస్తూ హార్వర్డ్ నుంచి అధికారిక సమాచారం అందింది.

ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమని శ్రియ లక్కప్రగడ తెలిపారు. చిన్నతనంలో ఎదురైన వ్యక్తిగత సవాళ్లను అధిగమించడంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో కీలకమైందన్నారు. తనకు లభించిన విద్యా అవకాశాలను భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడేలా మలచడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన శ్రియ లక్కప్రగడ ప్రయాణం.. అంతర్జాతీయ విద్యా వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకోవడం ద్వారా ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మరిన్ని కెరీర్ – ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us