AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన కమ్మటి ఉండ్రాళ్ళ పాయసం నిమిషాల్లోనే..

వినాయక చవితి నైవేద్యాల్లో ఉండ్రాళ్ల పాయసం ప్రత్యేకమైనది.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. చాలా ప్రాంతాల్లో దీనిని అద్భుతంగా యారు చేస్తారు. బియ్యప్పిండి, సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు, బెల్లం, పాలు, జీడిపప్పుతో కమ్మటి పాయసం తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలు, పద్ధతులు పాటిస్తే ఉండ్రాళ్లు మెత్తగా, పాయసం చిక్కగా రుచికరంగా తయారవుతుంది.

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన కమ్మటి ఉండ్రాళ్ళ పాయసం నిమిషాల్లోనే..
Undralla Payasam Recipe
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2026 | 5:56 PM

Share

ఎక్కడచూసినా వినాయక చవితి సందడి నెలకొంది.. సోమవారం నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి.. అయితే.. వినాయక చవితి పండుగకు గణేశుడికి సమర్పించే నైవేద్యాలలో ఉండ్రాళ్ళ పాయసం చాలా ముఖ్యమైనది. ఈ కమ్మటి, రుచికరమైన పాయసాన్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. సరైన కొలతలు, పద్ధతులతో చేస్తే, మొదటిసారి చేసేవారు కూడా దీన్ని అద్భుతంగా తయారు చేయొచ్చు..

కమ్మటి ఉండ్రాళ్ళ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు:

  • సగ్గుబియ్యం: 2 టేబుల్ స్పూన్లు (ఒక గంట నానబెట్టినవి)
  • పచ్చిశనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు (ఒక గంట నానబెట్టినవి)
  • బియ్యప్పిండి: 1 కప్పు (పొడి బియ్యప్పిండి)
  • బెల్లం తురుము: 1 కప్పు (ఉండ్రాళ్ళ కోసం 2 టేబుల్ స్పూన్లు అదనంగా)
  • పాలు: 1/2 లీటరు (ఫుల్ ఫ్యాట్, చిక్కగా కాచి చల్లార్చినవి)
  • యాలకుల పొడి: 1/2 టీస్పూన్ నెయ్యి: 1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుద్రాక్ష: 1-2 టేబుల్ స్పూన్లు
  • నీళ్లు: 1 కప్పు (ఉండ్రాళ్ళ పిండి కోసం), 2.5 కప్పులు (పాయసం కోసం)

తయారీ విధానం:

సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు నానబెట్టడం: ముందుగా, 2 టేబుల్ స్పూన్ల లావు సగ్గుబియ్యం మరియు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును నీళ్లలో వేసి కనీసం ఒక గంట పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి.

పాలు చిక్కబరచడం: ఒక గిన్నెలో 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకుని, అవి కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించి పక్కన పెట్టుకోండి. చిక్కటి పాలు పాయసానికి మంచి రుచిని ఇస్తాయి.

ఉండ్రాళ్ళ పిండి తయారీ: ఒక పాన్‌లో 1 కప్పు నీళ్లు పోసి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి పూర్తిగా కరిగించి మరగనివ్వండి. ఇలా చేయడం వల్ల ఉండ్రాళ్ళు చప్పగా ఉండవు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులో 1 కప్పు పొడి బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. తడి బియ్యప్పిండి వాడితే నీళ్లు కొద్దిగా తగ్గించి పోయండి. పాన్ పైన మూత పెట్టి ఐదు నిమిషాలు ఆవిరిలో మగ్గనివ్వండి.

ఉండ్రాళ్ళ పిండి ముద్ద తయారు చేయడం: పిండి కొద్దిగా చల్లారాక, చేతికి నెయ్యి రాసుకుని పిండిని మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఈ పిండి ముద్దలో నుండి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండితో చిన్న చిన్న ఉండ్రాళ్ళను తయారు చేసి పక్కన పెట్టుకోండి.

బియ్యప్పిండి పేస్ట్ తయారీ: పక్కన తీసి పెట్టుకున్న కొద్దిగా బియ్యప్పిండి ముద్దను ఒక బౌల్‌లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు లేదా ముందుగా కాచి చల్లార్చిన అరకప్పు పాలు పోసి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలపండి. దీన్ని పక్కన పెట్టుకోండి.

పాయసం ఉడికించడం: ఒక పాన్‌లో 2.5 కప్పుల నీళ్లు పోసి మరగనివ్వండి. మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం వేసి మీడియం ఫ్లేమ్‌లో 3-4 నిమిషాలు 50% ఉడికించండి. ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసి మరో 5 నిమిషాలు ఉడికించండి. ఉండ్రాళ్ళు బాగా ఉడికినట్లు నిర్ధారించుకోండి.

చిక్కబరచడం, తీపి కలపడం: ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యప్పిండి పేస్ట్‌ను ఒకసారి కలిపి పాయసంలో వేయండి. ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఆ తర్వాత, 1 కప్పు బెల్లం తురుము వేసి బాగా కలపండి. బెల్లంలో నలకలు ఉండే అవకాశం ఉంటే, ముందుగా కరిగించి వడగట్టి పోసుకోవడం మంచిది. దీన్ని లో ఫ్లేమ్‌లో 3-4 నిమిషాలు ఉడికించండి.

చివరి మెరుగులు: స్టవ్ ఆఫ్ చేసి, 1/2 టీస్పూన్ యాలకుల పొడి వేసి కలపండి. పాయసం కొద్దిగా చల్లారనివ్వండి. వేడి మీద పాలు పోస్తే పగిలిపోయే అవకాశం ఉంటుంది.

పోపు తయారీ: ఒక చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించండి. అవి లైట్ కలర్ వచ్చిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్ష వేసి వేయించండి. కావాలంటే ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేయవచ్చు. ఈ పోపును నెయ్యితో సహా పాయసంలో వేసి బాగా కలపండి.

పాలు కలపడం: పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు, ముందుగా కాచి చల్లార్చిన చిక్కటి పాలల్లో నుండి 1 కప్పు పాలు పోసి బాగా కలపండి. పాయసం చిక్కదనం మీ అభిరుచికి తగ్గట్టుగా పాలను సర్దుబాటు చేసుకోవచ్చు.

అంతే, ఎంతో కమ్మటి, రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం సిద్ధం. ఈ వినాయక చవితికి ఈ నైవేద్యాన్ని గణేశుడికి సమర్పించి మీ కుటుంబ సభ్యులతో ఆనందించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us