AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో ఇలా కనిపెట్టండి..

వంట చేసేటప్పుడు కూరలోనో, పిండిలోనో నేరుగా గుడ్డును పగలగొట్టి వేయడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఆ ఒక్క గుడ్డు కుళ్లిపోయి ఉంటే.. అప్పటిదాకా కష్టపడి చేసిన మొత్తం వంటకం పాడైపోవడమే కాదు, తెలియక తింటే ఆసుపత్రి పాలవ్వడం ఖాయం. గుడ్డును పగలగొట్టకుండానే అది తాజాగా ఉందో లేదో కేవలం ఒక్క గ్లాసు నీటితో క్షణాల్లో కనిపెట్టేయవచ్చు.. ఆ సైన్స్ ట్రిక్ ఏంటో తెలుసా?

అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో ఇలా కనిపెట్టండి..
How To Tell If Eggs Are Good Or Bad
Krishna S
|

Updated on: Oct 03, 2026 | 9:22 PM

Share

రోజువారీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్డు లేదా కూరల్లో గుడ్లను వాడటం మనకు అలవాటు. ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ సూపర్ ఫుడ్‌ను దాదాపు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి కొని తెచ్చుకుంటారు. అయితే దుకాణంలో కనిపించే ప్రతి గుడ్డు పైకి బాగానే ఉన్నా.. లోపల కుళ్లిపోయిందా, నిల్వ ఉండి పాడైపోయిందా అన్నది పెంకును చూసి అస్సలు కనిపెట్టలేం. కూరల్లో లేదా పిండి వంటల్లో నేరుగా పగలగొట్టి వేసినప్పుడే అది కుళ్లిపోయిందన్న సంగతి తెలిసి, మొత్తం వంటకం పాడైపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి కలుషితమైన గుడ్లను తెలియక తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్, వాంతులు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. మరి గుడ్డును పగలగొట్టకుండానే అది ఎంత ఫ్రెష్‌గా ఉందో ఇంట్లోనే చిటికెలో ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం.

గుడ్డు నాణ్యతను తేల్చే వాటర్ టెస్ట్ ఎలా చేయాలి?

ఒక పెద్ద గాజు గ్లాసు లేదా గిన్నె నిండా నీటిని తీసుకోండి. అందులోకి గుడ్డును నెమ్మదిగా వేయండి. నీటిలో గుడ్డు ప్రవర్తించే తీరును బట్టి దాని వయసు, నాణ్యత ఇట్టే తెలిసిపోతుంది.

పూర్తిగా అడుగుకు మునిగితే

గుడ్డు గ్లాసు అడుగున సమాంతరంగా పడుకుని ఉండిపోతే, అది చాలా తాజాగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడే తెచ్చిన కొత్త గుడ్లు ఇలాగే ఉంటాయి. వీటిని ఆమ్లెట్, హాఫ్ బాయిల్ లేదా బేకింగ్ కోసం నిర్భయంగా వాడొచ్చు.

అడుగునే ఉంటూ.. ఒకవైపు పైకి లేస్తే

గుడ్డు అడుగు భాగంలోనే ఉంటూ, మొనదేలిన ఒక వైపు కొద్దిగా పైకి లేచి నిలబడితే, అది రెండు నుంచి మూడు వారాల క్రితం పెట్టిన గుడ్డు అని అర్థం. ఇది పాడైపోలేదు కానీ కాస్త పాతబడింది. ఇలాంటి గుడ్లను బాయిల్డ్ ఎగ్స్‌గా ఉడకబెట్టి తినడానికి వాడటం చాలా సులభం.

నీటిపై పూర్తిగా తేలితే

ఒకవేళ గుడ్డు నీటి అడుగుకు చేరకుండా పైకి తేలియాడుతుంటే, అది పూర్తిగా పాడైపోయిందని గుర్తించాలి. గుడ్డు పాతబడే కొద్దీ దానిలోని తేమ పెంకు రంధ్రాల ద్వారా బయటకు వెళ్లిపోయి, లోపల గాలి గది పెరిగిపోతుంది. అందుకే అది తేలుతుంది. ఇలాంటి గుడ్లలో బ్యాక్టీరియా చేరిపోతుంది కాబట్టి పొరపాటున కూడా తినకూడదు, వెంటనే పారేయాలి.

పగలగొట్టిన తర్వాత ఎలా పరీక్షించాలి?

నీటి పరీక్ష కాకుండా గుడ్డును బౌల్‌లో పగలగొట్టినప్పుడు కూడా కొన్ని సంకేతాలను గమనించవచ్చు.

పచ్చసొన తీరు: తాజా గుడ్డులోని పచ్చసొన గుండ్రంగా, ఉబ్బెత్తుగా దృఢంగా ఉంటుంది. తెల్లసొన కూడా చిక్కగా పచ్చసొన చుట్టూ అంటుకుని ఉంటుంది. అలా కాకుండా పచ్చసొన చదునుగా మారి, తెల్లసొన పల్చటి నీళ్లలా పక్కకు పారిపోతుంటే అది పాతబడిన గుడ్డు.

స్మెల్ టెస్ట్: గుడ్డు పెంకు పగలగానే కాస్తయినా పులిసిన లేదా భరించలేని ఘాటైన దుర్వాసన వస్తే దాన్ని వెంటనే డస్ట్‌బిన్‌లో పడేయడం మంచిది.

ముఖ్యమైన చిట్కా: గుడ్లను ఫ్రిడ్జ్‌లో భద్రపరిచేటప్పుడు లేదా స్టోర్ చేసేటప్పుడు వాటిని ముందే నీటితో కడగకూడదు. కడగడం వల్ల పెంకుపై ఉండే సహజ రక్షణ పొర తొలగిపోయి బ్యాక్టీరియా త్వరగా లోపలికి చేరే ప్రమాదం ఉంది. వండటానికి సరిగ్గా కొద్ది నిమిషాల ముందు మాత్రమే ఈ నీటి పరీక్ష చేయడం మంచిది.

Follow Us