Chicken Fry Recipe: న్యూ ఇయర్ పార్టీకి అదిరిపోయే చికెన్ ఫ్రై.. ఈ సీక్రెట్ మసాలా కలిపితే రెస్టారెంట్ రుచి పక్కా!
కొత్త సంవత్సరం వేడుకలు అంటేనే విందు వినోదాల సందడి. ఆ పార్టీలో స్పెషల్ ఐటమ్ ఏదైనా ఉండాలి అంటే అది ఖచ్చితంగా 'చికెన్ ఫ్రై' కావాల్సిందే. హోటళ్లలో దొరికే విధంగా ఎంతో క్రిస్పీగా, నోరూరించే రంగుతో ఉండే చికెన్ ఫ్రైని ఇప్పుడు మీరు మీ వంటగదిలోనే సిద్ధం చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా, ఇంట్లో ఉండే మసాలాలతోనే అతిథులను ఆశ్చర్యపరిచే ఈ రుచికరమైన వంటకం తయారీ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు స్టార్టర్‌గా చికెన్ ఫ్రై ఉంటే ఆ మజానే వేరు. ఒక్కొక్క పీస్ ఎంతో జ్యూసీగా, పైన లేయర్ కరకరలాడుతూ ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రెస్టారెంట్ రుచిని మించిపోయేలా, ఘుమఘుమలాడే మసాలాల కలయికతో రూపొందే ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చాలా సులభం. న్యూ ఇయర్ స్పెషల్‌గా మీరు కూడా ఈ అదిరిపోయే రెసిపీని ట్రై చేసి ఇంట్లో వారందరినీ మెప్పించండి.
కావలసిన పదార్థాలు:
చికెన్ : అర కేజీ
పసుపు : పావు స్పూన్
కారం : 1 స్పూన్
ఉప్పు : రుచికి తగినంత
నిమ్మరసం : సగం చెక్క
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : తగినంత
ధనియాలు : 1 స్పూన్
మిరియాలు : అర స్పూన్
జీలకర్ర : అర స్పూన్
షాజీరా : అర స్పూన్
దాల్చిన చెక్క : 2 ఇంచుల ముక్క
యాలకులు : 3
లవంగాలు : 3
ఎండు మిర్చి : 4
చింతపండు : చిటికెడు
పచ్చిమిర్చి : 3
అల్లం : 2 ఇంచులు
వెల్లుల్లి రెబ్బలు : 8
బియ్యం పిండి : అర కప్పు
కార్న్ ఫ్లోర్ : 2 టేబుల్ స్పూన్లు
నూనె : వేయించడానికి సరిపడా
జీడిపప్పు : 15 పలుకులు
తయారీ విధానం:
చికెన్ ముక్కలను శుభ్రం చేసి తడి లేకుండా తుడుచుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
బాణలిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి. చివరగా కొంచెం చింతపండు వేసి దించి చల్లార్చాలి.
వేయించిన మసాలాలను మిక్సీలో వేసి, అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి బరకగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి.
మసాలా పట్టిన చికెన్‌లో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. అవసరమైతే రెండు స్పూన్ల నీళ్లు చల్లుకుని ముక్కలకు పిండి బాగా పట్టేలా చూడాలి.
కడాయిలో నూనె వేడి చేసి, ముక్కలను మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. దించే ముందు జీడిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించి తీసుకుంటే క్రిస్పీ చికెన్ ఫ్రై సిద్ధం.
