మటన్‌లో ఈ పార్ట్ వెరి వెరి స్పెషల్.. ఇలా తయారు చేసి తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లో ప్రతి భాగానికీ ప్రత్యేకమైన రుచి, పోషక విలువలు ఉంటాయి. అయితే మేక తలకాయ కూరకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఆంధ్రా స్టైల్‌లో మసాలాలతో చేసిన తలకాయ కూర రుచికి లొట్టలేసుకోవాల్సిందే. ఇంట్లోనే సులభంగా రుచికరమైన మటన్ తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

నాన్‌వెజ్ ప్రియులు మటన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. మేక మాంసంలోని ప్రతీ పార్ట్ ఒక్కో ప్రత్యేకతను, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంటాయి. మటన్, మటన్ లివర్, తిల్లి, బోటి, తలకాయ, కాళ్లు, దబ్బ.. ఇలా అన్ని పార్ట్స్ కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉండటంతోపాటు వండుకుంటే రుచిగా ఉంటాయి.. అయితే.. మటన్ తలకాయ కర్రీ టేస్టే వేరు.. మటన్ తలకాయ కూరను ఆంధ్రా స్టైల్ లో చేసుకుంటే.. లొట్టలేసుకుంటూ మరి తింటారు. వాస్తవానికి మటన్ తలకాయలోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను పటిష్టం చేస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
మేక తలకాయ కూరను ఇంట్లోనే అద్భుతమైన రుచితో, సులభంగా తయారుచేసుకోవచ్చు. నాన్-వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఈ వంటకానికి సరైన మసాలాలను ఉపయోగించడం ద్వారా అదనపు రుచి వస్తుంది.
మటన్ తలకాయ కూర తయరీ పద్ధతి:
మొదటగా, మార్కెట్ నుండి తెచ్చిన మేక తలకాయ మాంసాన్ని ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఈ మాంసాన్ని ఉప్పు నీళ్ళలో పది నిమిషాల పాటు నానబెట్టి, తరువాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది మాంసాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
తరువాత, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న మాంసాన్ని వేయాలి. దీనికి ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఇంట్లో తయారుచేసిన లేదా బయట నుండి తెచ్చుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నూనె జోడించాలి. మాంసం మునిగేంత వరకు నీళ్లు పోసి, ఒక పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు రెమ్మలు, రెండు బిర్యానీ ఆకులు వేసి మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇది మాంసాన్ని మెత్తగా ఉడకబెట్టడానికి సహాయపడుతుంది.
మసాలా పేస్ట్ తయారీ:
ఒక మిక్సీ జార్ లో నాలుగు వెల్లుల్లిపాయలు, నాలుగు అల్లం ముక్కలు, ఒక స్పూన్ మిరియాలు, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, ఒక యాలుక, చిన్న చెక్క, లవంగాలు, రెండు కొబ్బరి పలుకులు, కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. చిటికెడు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూర రుచిని అద్భుతంగా మారుస్తుంది.
కూర వండే విధానం:
స్టవ్ వెలిగించి, ఒక వెడల్పుగా ఉన్న డేక్షా లేదా పాత్రను పెట్టి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్టార్ ఫ్లవర్, సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి. స్టార్ ఫ్లవర్ కూరకి ప్రత్యేకమైన ఘాటును, కమ్మదనాన్ని ఇస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత, మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
మసాలా వేగుతున్నప్పుడు కొద్దిగా నీళ్లు, ఉప్పు, పసుపు వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత, ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత, నాలుగు పుదీనా ఆకులు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం (పచ్చి కారం అయితే ఒక స్పూన్, మామూలు కారం అయితే రెండు స్పూన్లు) వేసి మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి.
చివరగా, ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసి, గ్రేవీ ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. రుచి చూసి ఉప్పు, కారం సరిపోకపోతే సర్దుబాటు చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసి, వాటర్ అవసరం లేకపోతే వేయకుండా, మూత పెట్టి లో ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆయిల్ పైకి తేలితే కూర ఉడికినట్లే. సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి, ఇష్టమైతే ఐదు ఆరు చుక్కల నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రుచికరమైన మేక తలకాయ కూరను అన్నం లేదా రోటీతో ఆస్వాదించవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




