AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: ఎంత ముదురు యాట మాంసం అయినా ఇదొక్కటి వేస్తే మెత్తగా జ్యూసీగా ఉడకాల్సిందే..

ముదురు యాట మాంసం ఉడకడం కష్టమేనని భావిస్తున్నారా? ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. కొన్ని టిప్స్ తో మెత్తగా, జ్యూసీగా ఉడికించొచ్చు. సరైన మసాలా, హై ఫ్లేమ్ టెక్నిక్‌తో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్టీ మటన్ కర్రీ సిద్ధం చేసుకోవచ్చు. రుచికరమైన, మెత్తని మటన్ కర్రీ వండటానికి ఏం చేయాలో సులువైన చిట్కాలను ఈ కథనంలో తెలుసుకోండి..

Mutton: ఎంత ముదురు యాట మాంసం అయినా ఇదొక్కటి వేస్తే మెత్తగా జ్యూసీగా ఉడకాల్సిందే..
Mutton Curry Recipe
Shaik Madar Saheb
|

Updated on: May 16, 2026 | 8:31 PM

Share

మటన్, చికెన్‌ను నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు.. అయితే, చికెన్ వండటం చాలా ఈజీనే.. కానీ, మటన్ వండటం కొంచెం టైం పడుతుంది. ముఖ్యంగా ముదురు మటన్ అయితే.. తొందరగా ఉడకదు.. దీనికోసం చాలా సేపు కష్టపడాల్సి ఉంటుంది. అటు చాలా సేపు ఉడికించడం వల్ల గ్యాస్ కూడా త్వరగా అయిపోతుంది. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మటన్ తొందరగా ఉడుకుతుంది. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లో సులభంగా, మెత్తగా, రుచిగా తయారు చేసుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలు, విధానాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. నాన్-వెజ్ వండటం రాని వారు కూడా ఈ రెసిపీని ప్రయత్నించి అద్భుతమైన మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చు.

ముందుగా, సరిపడినంత మటన్‌ను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక, మటన్ త్వరగా, మెత్తగా ఉడకడానికి ఒక టిప్ ఉంది.. పచ్చి బొప్పాయికాయ చిన్న ముక్కను గానీ, బగారా ఆకును గానీ, లేదా పాతకాలం టిప్ అయిన ఎండిన మామిడి ఆకును గానీ వేయవచ్చు. బగారా ఆకును వాడితే ఇంకా మంచి ఫ్లేవర్‌ను ఇస్తుంది.

నూనె వేడి అయ్యాక, ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి, పచ్చిమిర్చి (కర్రీకి సరిపడినంతగా) వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి పావు టీస్పూన్ ఉప్పు వేసి, మంచి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే మటన్ కర్రీకి మంచి రుచి వస్తుంది. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్‌లోకి రాగానే స్టవ్ తగ్గించి. ఒక టేబుల్‌స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

తర్వాత, ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసి, స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టి నీరు ఇంకిపోయి నూనె పైకి వచ్చే వరకు వేయించాలి. ఇలా హై ఫ్లేమ్‌లో వేయించడం వల్ల టమాటా నుండి వచ్చే నీరు వల్ల మటన్ వేగడం ఆలస్యం కాదు. నూనె సెపరేట్ అవుతున్నప్పుడు, స్టవ్ తగ్గించి, కర్రీకి మంచి డార్క్ రెడ్ కలర్ రావాలంటే కారం, అర పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి మసాలాను బాగా వేయించాలి. మసాలా బాగా వేగి, నురగలా పైకి వస్తున్నప్పుడు, శుభ్రం చేసుకున్న మటన్‌ను వేసి స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టి రెండు నిమిషాలు వేయించాలి. ఇలా చేయడం వల్ల మటన్‌కు నీచు వాసన రాకుండా ఉంటుంది. మటన్ వేగేటప్పుడు కూడా హై ఫ్లేమ్‌లో వేగితే మటన్‌లోని తేమ ఇంకిపోయి ఆయిల్ బయటకు వస్తుంది.

తరువాత, కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి కలిపి, కూరకు సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. కర్రీ చిక్కగా ఉండాలంటే ఒక గ్లాసు నీళ్లు చాలు, గ్రేవీ ఎక్కువ కావాలంటే మరో అర గ్లాసు నీళ్లు కలుపుకోవచ్చు. మటన్ లేతది అయితే, మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్, సిమ్‌లో 2 విజిల్స్ పెడితే సరిపోతుంది.

కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత, మూత తీసి చూస్తే కర్రీ మంచి డార్క్ కలర్‌తో సూపర్ రుచిగా తయారై ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి, పైన చిటికెడు గరం మసాలా, గుప్పెడు కొత్తిమీర చల్లి, ఒకసారి మూత లేకుండా ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీకి మరింత మంచి రుచి, ఫ్లేవర్ వస్తాయి. స్టవ్ ఆఫ్ చేస్తే, టేస్టీ మటన్ కర్రీ సిద్ధం అవుతుంది.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యాట మాంసం తెచ్చుకుని మంచిగా వండుకుని తినండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us