AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లెపూలు గుత్తులుగా విరగపూయాలంటే ఇలా చేయాలి..? ఎవ్వరికీ తెలియని సీక్రెట్

మల్లె మొక్కలు సమ్మర్‌లో సమృద్ధిగా పూలు పూస్తాయి. అయితే, నిరంతరం పూల దిగుబడి కోసం కొన్ని సంరక్షణ పద్ధతులు పాటించడం అవసరం. పూలన్నీ కోసేసిన తర్వాత, కొమ్మల చివర్లను కత్తిరించాలి. ఇది కొత్త చిగుర్లు రావడానికి, మొక్క గుబురుగా పెరగడానికి సహాయపడుతుంది. దీంతోపాటు మల్లె మొక్కలు నిరంతరం పూలు పూయడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.

మల్లెపూలు గుత్తులుగా విరగపూయాలంటే ఇలా చేయాలి..? ఎవ్వరికీ తెలియని సీక్రెట్
Jasmine Plant Care
Shaik Madar Saheb
|

Updated on: May 16, 2026 | 3:14 PM

Share

మల్లెల సీజన్ నడుస్తోంది. చాలా ఇళ్లల్లో మల్లెపూల మొక్కలు ఉంటాయి.. అయితే.. కొన్ని రకాల చర్యలు తీసుకోకపోవడం వల్ల మల్లెపూలు తక్కువగా పూస్తుంటాయి.. అయితే.. మల్లె పువ్వులు నిండుగా పూయాలంటే.. సమర్థవంతమైన సంరక్షణ, ఇంటి ఎరువుల వాడకం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి మల్లె మొక్కలు ఏడాది పొడవునా పూలను పూస్తుంటాయి.. అయితే.. వేసవి కాలంలో మాత్రం ఎక్కువగా దిగుబడి ఉంటుంది. మల్లె మొక్కలు వేసవి కాలంలో తమ సువాసనతో, అందమైన పువ్వులతో ప్రతి తోటను ఆనందపరుస్తాయి. కానీ చాలామందికి మల్లె మొక్కలు ఆశించినంతగా పూలు పూయడం లేదని ఫిర్యాదు ఉంటుంది.

సమృద్ధిగా, నిరంతరం మల్లె పువ్వులు పొందడానికి సరైన సంరక్షణ, పోషణ పద్ధతులు అవసరం..

వివిధ రకాల ఎరువుల ప్రాముఖ్యత

మల్లె మొక్క ఆరోగ్యంగా పెరిగి, పుష్కలంగా పూలు పూయాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. ఒకే రకమైన ఎరువులను నిరంతరం వాడటం కంటే, వేర్వేరు రకాల ఎరువులను మార్చి మార్చి ఇవ్వడం వల్ల మొక్కకు అన్ని రకాల సూక్ష్మపోషకాలు లభిస్తాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులను మార్చడం మంచిది. నైట్రోజన్ మొక్కకు కొత్త చిగుర్లు, ఆకుపచ్చని కొమ్మల పెరుగుదలకు సహాయపడుతుంది. ఫాస్పరస్ మొగ్గలు, పువ్వుల ఉత్పత్తిని పెంచడానికి కీలకమైన హార్మోన్లను ప్రేరేపిస్తుంది. పొటాషియం కొమ్మలను బలంగా ఉంచి, మొగ్గలు రాలిపోకుండా చూస్తుంది.

పూల కత్తిరింపు (ప్రూనింగ్) – వాడిపోయిన పూలను తొలగించడం

ఒకసారి పూలు పూసి, వాడిపోయిన తర్వాత, ఆ కొమ్మ చివర్లను కత్తిరించడం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు ఆకుల దిగువ వరకు కత్తిరించడం వల్ల కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి. కత్తిరించకపోతే, కొత్త చిగుర్లు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. దీనివల్ల పూల దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా, చెట్టుపై వాడిపోయిన లేదా ఎండుతున్న పూలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. ఎందుకంటే వాడిపోయిన పూలు మొక్క నుండి శక్తిని, పోషకాలను లాగేసుకుంటాయి. వాటిని తొలగించడం వల్ల ఆ శక్తి కొత్త మొగ్గలు, పూల పెరుగుదలకు, మొక్క మొత్తం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కత్తిరింపు చేసిన ప్రతి చోట నుంచి రెండు మూడు కొత్త చిగుర్లు వచ్చి మొక్క మరింత గుబురుగా, దట్టంగా పెరుగుతుంది.

ఇంట్లో తయారు చేసుకునే అద్భుతమైన ఎరువులు

సిట్రస్ పండ్ల తొక్కల ద్రావణం (లిక్విడ్ ఫర్టిలైజర్): ఈ ద్రావణం మల్లె మొక్కలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మ, నారింజ, బత్తాయి పండ్ల తొక్కలను ఉపయోగించవచ్చు. జ్యూస్ తీసిన తర్వాత మిగిలిన తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, ఒక బాటిల్‌లో 3/4 వంతు నీరు పోసి, తొక్కలను వేయాలి. మూతను గట్టిగా కాకుండా కొద్దిగా వదులుగా పెట్టి, నాలుగైదు రోజులు పక్కన పెట్టాలి. ఇది ఐదారు రోజుల్లో అద్భుతమైన లిక్విడ్ ఫర్టిలైజర్‌గా మారుతుంది. ఈ ద్రావణంలో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి.

వాడకం: ఈ ద్రావణాన్ని 1:5 నిష్పత్తిలో నీటితో కలిపి మాత్రమే మొక్కలకు ఇవ్వాలి (ఒక కప్పు ద్రావణానికి ఐదు కప్పుల నీళ్లు). ప్రతి 15 రోజులకు ఒకసారి దీనిని వాడవచ్చు. ఇది మల్లె మొక్కలకే కాకుండా గులాబీలు, మందారాలు వంటి ఇతర పూల మొక్కలకు కూడా చాలా మంచిది. దీన్ని తయారు చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు.

అరటి తొక్కల పొడి: అరటిపళ్ళు తిన్న తర్వాత వాటి తొక్కలను ఎండబెట్టి, మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇది ఫాస్పరస్, పొటాషియంకు మంచి వనరు. ఈ పొడి పూల ఉత్పత్తిని పెంచడానికి, కొమ్మలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

వాడిన టీ పౌడర్: టీ తయారు చేసుకున్న తర్వాత మిగిలిన టీ పౌడర్‌ను కడిగి, ఆరబెట్టి, నిల్వ చేసుకోవాలి. ఇది నైట్రోజన్‌ను అందించి, మొక్కకు ఆకుపచ్చని, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుంది. వాడని టీ పౌడర్ అయితే సగం స్పూన్ ఇవ్వాలి.

ఎరువులు వాడే పద్ధతి:

ఏ ఎరువును అయినా మొక్కలకు ఇచ్చే ముందు, కుండీలోని మట్టిని పొడిపొడిగా, వదులుగా చేయాలి. గట్టిగా ఉండే మట్టిలో ఎరువులు వేస్తే అవి మొక్క వేర్లకు సరిగా చేరవు. మట్టిని వదులు చేసిన తర్వాత, అరటి తొక్కల పొడి, వాడిన టీ పౌడర్‌ను ఒక్కో మొక్కకు ఒక స్పూన్ (చిన్న మొక్కలకైతే), పెద్ద మొక్కలకైతే రెండు లేదా మూడు స్పూన్లు చొప్పున మట్టిలో కలిపి ఇవ్వాలి. ఆ తర్వాత వెంటనే నీరు పోయాలి. ఆ మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత, సిట్రస్ తొక్కల ద్రావణాన్ని 1:5 నిష్పత్తిలో డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వాలి. ఈ విధంగా ఒకసారి ఎరువులు ఇచ్చిన తర్వాత, 15 రోజుల వరకు మరే ఇతర ఎరువులను మొక్కలకు ఇవ్వకూడదు. ఈ పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే మీ మల్లె మొక్కలు ఏడాది పొడవునా సువాసనభరితమైన పూలతో నిండి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పద్దతులను పాటించడం ద్వారా.. మల్లెపూల దిగుబడిని అధికంగా పొందండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us