AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోని ఆడేది ఇప్పుడు కాదు.. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయింట్ చేయాల్సిందే.. క్లారిటీ ఇచ్చిన మాజీ దిగ్గజం..!

Dhoni Injury Update: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల గుండెల్లో ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది. తమ ప్రియతమ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడా అని కోట్లాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే కీలక పోరుకు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

MS Dhoni: ధోని ఆడేది ఇప్పుడు కాదు.. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయింట్ చేయాల్సిందే.. క్లారిటీ ఇచ్చిన మాజీ దిగ్గజం..!
Ms Dhoni Csk Ipl 2026
Venkata Chari
|

Updated on: May 18, 2026 | 6:40 PM

Share

Dhoni Injury Update: గత కొంతకాలంగా మోకాలి నొప్పితో పాటు పిక్కల గాయం (కాఫ్ స్ట్రెయిన్) కారణంగా మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. కనీసం ఏడాది కాలంగా ఎలాంటి పోటీ క్రికెట్ ఆడని ధోనీ, చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి హోమ్ మ్యాచ్‌లోనైనా తుది జట్టులోకి వస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నెట్స్‌లో ధోనీ దాదాపు 40 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి, స్పిన్నర్లు విసిరిన బంతులను ఎదుర్కొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఆశలు మరింత రెట్టింపయ్యాయి.

ధోనీని ఆడించడం ఇప్పుడు పెద్ద జూదం.. : గవాస్కర్

ఈ ఉత్కంఠ భరిత తరుణంలో స్టార్ స్పోర్ట్స్ వేదికగా సునీల్ గవాస్కర్ చేసిన విశ్లేషణ క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ధోనీ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ, సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడిని బరిలోకి దించడం చెన్నై జట్టుకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని గవాస్కర్ హెచ్చరించారు. “చెన్నై జట్టుకు ప్లేఆఫ్స్ చేరడానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇలాంటి జీవన్మరణ పోరాటంలో గత ఆరు వారాలుగా నిరంతరం ఆడుతూ, మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లే జట్టుకు అవసరం. ఏడాది కాలంగా అసలు మైదానంలోనే దిగని ఆటగాడిని నేరుగా ఇంత పెద్ద మ్యాచ్‌లో ఆడించడం ఒక పెద్ద జూదమే అవుతుంది” అని గవాస్కర్ స్పష్టం చేశారు.

జట్టు ప్రయోజనాలే ధోనీకి ముఖ్యం.. కాంబినేషన్ దెబ్బతినకూడదు..!

ధోనీ ఎల్లప్పుడూ స్వార్థం లేని వ్యక్తి అని, తన సొంత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాడని గవాస్కర్ కొనియాడారు. “మహేంద్ర సింగ్ ధోనీ పక్కా టీమ్ మ్యాన్. ప్రస్తుత సీజన్‌లో చెన్నై జట్టు ఒక మంచి సమతుల్యతతో రాణిస్తోంది. ఇప్పుడు కేవలం అభిమానుల సెంటిమెంట్ కోసం ధోనీ జట్టులోకి వస్తే, ఆ గెలుపు కాంబినేషన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ ధోనీ ఫిట్‌గా ఉన్నా, జట్టు ప్రయోజనాల దృష్ట్యా తనే స్వయంగా పక్కన కూర్చోవడానికి మొగ్గు చూపుతాడని నేను భావిస్తున్నాను. అతడు తుది జట్టులోకి వస్తే నేను నిజంగా ఆశ్చర్యపోతాను” అని ఈ లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డారు.

ప్లేఆఫ్స్ వేటలో చెన్నైకి అగ్నిపరీక్ష..

రూ. 4 కోట్ల అన్‌క్యాప్డ్ ఆటగాడి కోటాలో ఈ సీజన్ కోసం చెన్నై జట్టు ధోనీని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే గాయం కారణంగా అతను కేవలం డగౌట్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే తదుపరి రెండు మ్యాచ్‌లు చెన్నై ప్లేఆఫ్స్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. గెలిస్తేనే రేసులో నిలిచే ఈ క్లిష్ట పరిస్థితిలో, మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

అభిమానుల గుండె చప్పుడు ఒకవైపు.. జట్టు విజయాల సమీకరణాలు మరోవైపు. చెపాక్ మైదానంలో ధోనీ హెలికాప్టర్ షాట్లను చూడాలనేది ప్రతి ఒక్కరి కల అయినప్పటికీ, గవాస్కర్ చెప్పిన చేదు నిజాన్ని కొట్టిపారేయలేం. మరి ఈ రాత్రి మ్యాచ్‌లో సెంటిమెంట్ గెలుస్తుందా లేక గవాస్కర్ ఊహించినట్టుగా చెన్నై పాత కాంబినేషన్‌తోనే ముందుకు వెళ్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us