Mutton Dosa: మధురై స్టైల్ నోరూరించే మటన్ కీమా మసాలా దోశ.. నాన్వెజ్ ప్రియులకు స్పెషల్
దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా మధురై ప్రాంతంలో, మటన్ కర్రీ దోశకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. సాధారణ దోశను మటన్ కీమా మసాలా, గుడ్లతో కలిపి తయారు చేస్తే వచ్చే రుచి అద్భుతం. ఈ స్పెషల్ కీమా దోశను ఇంట్లోనే అతి సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో వివరంగా చూద్దాం. పాత చింతకాయ పచ్చడి వద్దు, కొత్త రెసిపీ కావాలంటే ఇది ట్రై చేయండి!

సాధారణ దోశాలు తిని బోర్ కొట్టిందా? అయితే, ఈసారి టేస్ట్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లే మధురై స్పెషల్ మటన్ కర్రీ దోశను ట్రై చేయండి! ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, రాత్రి డిన్నర్‌గా కూడా అదిరిపోతుంది. మెత్తని దోశ పిండి, ఘాటైన మటన్ కీమా మసాలా, దానిపై పగిలిన గుడ్డు… ఆ కాంబినేషన్ తలచుకుంటేనే నోట్లో నీళ్లూరతాయి! మరెందుకాలస్యం, రెస్టారెంట్‌లో తినే ఆ స్పైసీ, ఫ్లేవర్‌ఫుల్ మటన్ కీమా దోశను కేవలం కొన్ని నిమిషాల్లో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం!
కావలసిన పదార్థాలు
మటన్ కీమా (ఉడికించినది) – 200 గ్రాములు
గుడ్లు – 3
దోశ పిండి – 1 కప్పు
ఉల్లిపాయ (చిన్నగా తరిగినది) – 1
టమోటా (చిన్నగా తరిగినది) – 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూన్
పసుపు – అర చెంచా
మిరప పొడి – 1 చెంచా
ధనియాల పొడి – ముప్పావు చెంచా
మిరియాల పొడి – 1 స్పూన్
సోంపు – పావు టీస్పూన్
నూనె/నెయ్యి – 3 చెంచాలు
ఉప్పు – తగినంత
తయారీ విధానం
స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. సోంపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
టమోటాలు ఉడికిన తర్వాత, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత, ముందుగా ఉడికించిన మటన్ కీమా వేసి కలపండి.
కొద్దిగా నీరు పోసి, మసాలా కీమాకు బాగా పట్టేలా 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గ్రేవీ గట్టిపడిన తర్వాత స్టవ్ కట్టేసి, మసాలాను ఒక గిన్నెలోకి తీయాలి.
గిన్నెలో ఉన్న కీమా మసాలాలో గుడ్లు పగలగొట్టండి. కొద్దిగా తరిగిన పచ్చి ఉల్లిపాయ, కొత్తిమీర వేసి దోశపై వేయడానికి సిద్ధం చేయండి.
దోశ పెనాన్ని వేడి చేసి, మంట మీడియంలో ఉంచాలి. దోశ పిండిని తీసుకొని కొద్దిగా మందంగా పాన్ కేక్ లాగా పోయాలి.
దోశ కాస్త ఉడికిన తర్వాత, పైన ఒక చెంచా కీమా-గుడ్డు మిశ్రమాన్ని వేసి దోశ అంతటా విస్తరించండి. చుట్టూ కొద్దిగా నూనె వేయాలి.
దోశ ఉడికిన తర్వాత, దానిపై కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లి, తిప్పి లేదా తిప్పకుండా మీకు నచ్చినట్లు వత్తాలి.
దోశ బాగా ఉడికి, క్రిస్పీగా తయారైన తర్వాత తీయండి. మీ రుచికరమైన మధురై మటన్ కర్రీ దోశ తినడానికి సిద్ధంగా ఉంటుంది.




