AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sr.NTR : ఆ సినిమా ఆడటమే ఎక్కువ అన్నారు.. కట్ చేస్తే.. ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసింది..

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI)లో ప్రదర్శితమైన మొదటి దక్షిణాది సినిమా ఇదే. ఈ సినిమా 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలై ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పి, ఆయనను తిరుగులేని స్టార్‌గా నిలబెట్టింది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా..

Sr.NTR : ఆ సినిమా ఆడటమే ఎక్కువ అన్నారు.. కట్ చేస్తే.. ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసింది..
Pathala Bhairavi
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2026 | 5:01 PM

Share

తెలుగు సినీ ప్రపంచంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. సంవత్సరాలు గడిచినా, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే మూవీస్ ఇంకొన్ని ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మళ్లీ తీయలేని చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వాటిలో ముందుగా గుర్తొచ్చే సినిమా పాతాళ భైరవి. తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆ సినిమా ఓ ఆణిముత్యం. జానపద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈ మూవీ. ఎన్.టి. రామారావును వెండితెర ‘మగధీరుడు’గా, ఎస్.వి. రంగారావును ‘మాయామంత్రి’గా జనం గుండెల్లో నిలిపిన ఈ అద్భుత కావ్యం విడుదలై అప్పుడే 75 వసంతాలు (వజ్రోత్సవం) పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం:

పాతాళ భైరవి.. సీనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని మలుపు తిప్పిన మూవీ. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి కె.వి. రెడ్డి దర్శకత్వం వహించారు. తోట రాముడిగా ఎన్టీఆర్ సాహసోపేత నటన, నేపాళ మాంత్రికుడిగా ఎస్వీఆర్ పండించిన విలనిజం ఇప్పటికీ అజరామరమనే చెప్పాలి. “సాహసం చేయరా డింబకా.. రాజకుమారి లభిస్తుంది” అనే డైలాగ్ తెలుగు వారి వాడుక భాషలో ఇప్పటికీ ఒక భాగమైపోయింది. ఆ కాలంలోనే గ్రాఫిక్స్ లేకపోయినా, మార్కస్ బార్ట్లే తన ఛాయాగ్రహణంతో సృష్టించిన విజువల్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పాతాళ భైరవి విగ్రహం, మాంత్రికుడి గుహ, తోట రాముడి సాహసాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్రరావు సాహిత్యం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘ఎంత ఘాటు ప్రేమయో’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే’ వంటి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి.

అయితే ఈ సినిమాకు ముందుగా ఎన్టీఆర్ ను అనుకోలేదట. ఇండస్ట్రీలో అప్పటికే అక్కినేని నాగేశ్వర రావు వరుసగా సినిమాలు చేస్తున్నారు. దీంతో తోటరాముడిగా ఏయన్నార్.. నేపాళ మాంత్రికుడిగా గోవిందరాజుల సుబ్బారావులతో ఈ చిత్రాన్ని తీయాలనుకున్నారట నాగిరెడ్డి. కానీ అంతకు ముందే ఎన్టీఆర్ తో రెండేళ్లకు నాలుగు సినిమాలు హీరోగా చేసే ప్రాతిపదికన నెలకు రూ.250 పారితోషికానికి అగ్రిమెంట్ చేసుకున్నారట. అలాగే నాగిరెడ్డి అభిప్రాయంతో కెవిరెడ్డి చక్రపాణిలు ఏకీభవించకపోవడం వల్ల ఏయన్నార్, గోవిందరాజులు ఈ చిత్రానికి అంతగా మొగ్గు చూపలేదు.

మరికొన్ని రోజుల్లో సినిమా మొదలు కావాల్సి ఉండగా.. ‘సంసారం’ సినిమా షూటింగ్ విరామంలో ఎన్టీఆర్, ఏయన్నార్ సరదాగా టెన్నిస్ ఆడుతున్నారు. ఆటలో భాగంగా ఎన్టీఆర్ వరుసగా నాలుగు బంతులను మిస్ చేశారు. సామాన్యులైతే నవ్వుకుని వదిలేసేవారేమో, కానీ ఎన్టీఆర్‌లోని సహజసిద్ధమైన పట్టుదల (కసి) మేల్కొంది. వెంటనే రాకెట్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, ఐదో బంతిని ఎంత బలంగా బాదారంటే.. అది స్టూడియో ప్రహరీ దాటి ఎక్కడో పడిపోయింది. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న దర్శకుడు కె.వి. రెడ్డికి మెదడులో ఒక మెరుపు మెరిసింది. తోట రాముడి పాత్రకు కావాల్సిన ఆవేశం, బలం, పట్టుదల ఎన్టీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయని ఆయన గ్రహించారు. వెంటనే ఆయనను పిలిచి, సినిమాలో బొడ్డుదేవరను పగలగొట్టే సీన్‌ను సాంపుల్‌గా చిత్రీకరించారు. ఆ రష్ చూసిన తర్వాత, “మన తోట రాముడు దొరికేశాడు” అని కె.వి. రెడ్డి ఫిక్స్ అయిపోయారు. అలా ఈ సినిమాకు ఎన్టీఆర్ ను ఎంపిక చేశారు.

‘పాతాళ భైరవి’ కేవలం ఒక సినిమా కాదు, అది తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఒక అద్భుతం. 75 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే కొత్త అనుభూతి కలుగుతుంది. జానపద చిత్రాల గురించి ప్రస్తావన వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు ‘పాతాళ భైరవి’. తెలుగు సినీ చరిత్ర ఉన్నంత కాలం ఈ సినిమా వెలుగుతూనే ఉంటుంది.

Follow Us